సుభాన్ జీ, మళ్ళీ ఉదయించండి

ABN , First Publish Date - 2021-07-16T08:16:45+05:30 IST

ఎం.ఎసుభాన్ అస్తమయంతో చెన్నైలోని తెలుగువారు ఒక ఆత్మీయుడిని కోల్పోయారు. తొమ్మిది పదుల వయసులో గత నెల 22న ఆయన అంతిమ శ్వాస విడిచారు...

సుభాన్ జీ, మళ్ళీ ఉదయించండి

ఎం.ఎసుభాన్ అస్తమయంతో చెన్నైలోని తెలుగువారు ఒక ఆత్మీయుడిని కోల్పోయారు. తొమ్మిది పదుల వయసులో గత నెల 22న ఆయన అంతిమ శ్వాస విడిచారు. గత శతాబ్దిలో దాదాపు మూడు దశాబ్దాల పాటు చెన్నైలో ‘కళాసాగర్’ అనే సాంస్కృతిక సంస్థ నిర్వహణ ఆయన కీర్తికిరీటం. చెన్నై’లోని రైల్వే ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్‌) ఉద్యోగులైన ఇద్దరు మిత్రులు ఎం.ఎ సుభాన్‌, జి.ఎన్‌ భూషణ్‌ (ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్‌) 1972లో కళాసాగర్ సాంస్కృతిక సంస్థకు రూపకల్పన చేశారు. చెన్నైలోని తెలుగువారికి తెలుగు సినిమాలు, నాటకాలు, నాట్య ప్రదర్శనలు, ఇత్యాది సాంస్కృతిక వినోద కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చూసి ఆనందించేలా ‘కళాసాగర్‌’ ను నిర్వహించారు. 1972లో ఏప్రిల్‌ 9న ప్రారంభమైన ‘కళాసాగర్’ చాలా కొద్దికాలంలోనే చెన్నైలోని వివిధ భాషల సాంస్కృతిక సంస్థలన్నిటిలో అగ్రగామిగా నిలిచింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నాటక సంస్థలు, కళాసంస్థలు చెన్నైలో ‘కళాసాగర్‌’ వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చిందంటే, అదొక ప్రతిష్ఠాత్మకమైన విషయంగా భావించి పొంగిపోయేవారు. 


సాధారణంగా సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు చాలామంది తమ పేరు పత్రికల్లో తరచుగా రావాలని, ప్రముఖులతో పాటు తామూ ఫోటోలలో కనిపించాలని తాపత్రయపడుతూ ఉంటారు. సుభాన్‌లో ఆ ధోరణి ఉండేది కాదు. తాను తెరవెనుకే ఉండి, తక్కిన కార్యనిర్వాహక వర్గానికి ఆ అవకాశాలు కల్పించేవారు. ‘ఎందుకలా చేస్తున్నారు’ అంటే ‘వాళ్ల ఆనందమే నా ఆనందం’ అనేవారు. ప్రముఖ కవి ఆత్రేయ అయితే సుభాన్‌ ధోరణి నచ్చక, ఒకసారి ‘కళాసాగర్‌’ నాటకసప్తాహం నిర్వహించినప్పుడు సుభాన్‌ చేయి పట్టుకుని వేదిక మీదికి లాక్కొచ్చి సత్కార కార్యక్రమం నిర్వహించి ఉక్కిరి బిక్కిరి చేశారు. ‘కళాసాగర్‌’ రజతోత్సవ వేడుకల సందర్భంగా- వేదికపై శివాజీగణేశన్‌, అక్కినేని వంటి దిగ్గజాలుండగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తెర వెనుక ఉన్న సుభాన్‌ని బలవంతంగా వేదిక మీదికి తీసుకొచ్చి, ఆ ప్రముఖుల చేత ఘనంగా సత్కరింపజేశారు.


నిస్వార్థంగా కళాభిమానంతో సుభాన్‌ ‘కళాసాగర్‌’ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆకర్షించేవి. మాగుంట సుబ్బరామిరెడ్డి, ఎం.చిత్తరంజన్‌ (ఐటిసి), పి.వి రమణయ్య రాజా, పి.ఓబుల్‌రెడ్డి, టివికె శాస్త్రి, జి.ప్రకాశ్‌నారాయణ గుప్త, డా.సి. ముద్దుకృష్ణారెడ్డి, డి.ఎన్‌ లింగం, కె.హరిప్రసాద్‌రెడ్డి, జి. జనార్దనరెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్‌ రెడ్డి, దాసరి నారాయణరావు, మురళీమోహన్‌ వంటి పలువురు ప్రముఖులు సుభాన్‌ కోరిన సహాయం అందించడానికి ముందుకు వచ్చి సహకరించేవారు. ‘కళాసాగర్‌’ అధ్యక్ష పదవికి ఎవరైనా ఆశపడేవారేమో కానీ, సుభాన్‌ నిర్వహించే కార్యదర్శి హోదాకు పోటీ అనేది లేకుండా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించేవారు.


సాహిత్యపరంగా కూడా సుభాన్‌ జరిపిన కృషి అసామాన్యం. ఆయన సంపాదకత్వంలో వెలువడిన ‘కళాసాగర్‌’ వార్షిక సంచికలు అపురూపంగా దాచుకుని చదువుకునేవారు సాహితీప్రియులు. తెలుగు జనజీవన ప్రతిబింబాల కథానిధిగా 97 కథలతో ‘కథాసాగర్‌’ గ్రంథాన్ని కళాసాగర్ వెలువరించి తెలుగు కథాప్రియులకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ఆ పుస్తకం చదివితే ‘కళాసాగర్‌’ సమగ్ర స్వరూపం అందరికీ అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- ‘కథాసాగర్‌’- ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారి గ్రూప్‌-1 మెయిన్స్‌ సిలబస్‌లో చేర్చబడ్డ కథల సంకలనంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది.


ఇన్ని ఘనకార్యాలు నిర్వహించిన సుభాన్‌ తనను ఎవరైనా సత్కరిస్తామన్నా, అవార్డులు ఇస్తామన్నా అంగీకరించేవారు కాదు. ‘ఇది నా ఒక్కడి కృషి కాదు, సమష్టి కృషి’ అని సవినయంగా అనేవారు. అయితే ఆయన రెండే రెండు అవార్డులు స్వీకరించారు. అవి: ‘సమైక్య భారత స్వర్ణ పురస్కార్‌-–2001’; ‘డా. రామినేని ఫౌండేషన్‌ వారి అవార్డు’ . ఈ అవార్డులను ఒక సత్కార్యం కోసమే సుభాన్ తీసుకున్నారని ఆయన సన్నిహిత మిత్రులు, ప్రముఖ రచయిత పల్లేటి బాలాజీ ఇటీవల వెల్లడించారు. ఓ యువకుడు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ, జీవనం గడవక, సొంత ఆటో కొనలేక అవస్థలు పడుతుంటే అతను ఆటో కొనుక్కోవడానికి ఆ అవార్డుల కింద లభించే డబ్బు ఉపయోగపడుతుందని భావించి, ఆ పురస్కారాలను ఆయన స్వీకరించారు. అవార్డు నగదును ఆ ఆటోవాలాను ఆదుకోవడానికే వినియోగించారు. ఈ విషయాన్ని సుభాన్‌ ఎక్కడా చెప్పలేదు. అదీ ఆయన విశాల హృదయానికి నిదర్శనం.


25 సంవత్సరాలకు పైగా నిరాటంకంగా సాగిన ‘కళాసాగర్‌’ ఆ తర్వాత మూతబడిపోవడాన్ని తలచుకున్నప్పుడల్లా బాధపడేవారు సుభాన్‌. టీవీ కార్యక్రమాలు చూడ్డానికి జనం అలవాటు పడిపోయారు. చక్కని సంగీతం, నాట్యం వంటి కళల మీద, నాటకాల మీద ఆసక్తి తగ్గిపోతోందని ఆయన ఆవేదన పడేవారు. కళాసాగరంలో (సు)భానుడు అస్తమించాడు! సుభాన్‌జీ మళ్లీ ఉదయించండి. మీలాంటి వాళ్లు మాకు కావాలి.

బి.కె. ఈశ్వర్‌

Updated Date - 2021-07-16T08:16:45+05:30 IST