సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలి

ABN , First Publish Date - 2022-05-25T07:38:28+05:30 IST

రాష్ట్రంలో హోం మంత్రి పేరుకే ఉన్నారని, ఆమె అధికారానికి పూర్తిగా కత్తెర పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

సుబ్రహ్మణ్యం హత్య కేసును   సీబీఐకి అప్పగించాలి
సుబ్రహ్మణ్యం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రామకృష్ణ, గొల్లపల్లి

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్‌

పెదపూడి, మే 24: రాష్ట్రంలో హోం మంత్రి పేరుకే ఉన్నారని, ఆమె అధికారానికి పూర్తిగా కత్తెర పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కాంగ్రెస్‌ నాయకుడు కొరివి వినయ్‌కుమార్‌, పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులతో కలిసి గొల్లల మామిడాడలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుబ్రహ్మణ్యం చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం హత్య విషయంలో పోలీసుల తీరు అమాన వీయంగా ఉందన్నారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకనే సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నా మన్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఉద్యమం చేపట్టకపోతే అనంతబాబు అరెస్టును చూపలేరన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం అందించి, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధనకు వచ్చే నెల 2న అఖిలపక్షాలు, ప్రజా, దళిత సంఘాలతో కలిసి విజయవాడలో గవర్నర్‌ను కలుస్తామన్నారు. 

సుబ్రహ్మణ్యానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గొల్లపల్లి

సుబ్రహ్మణ్యానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ప్రభుత్వ సహకారం లేకపోతే అనంతబాబు ఇంతటి దారుణానికి పాల్పడేవాడు కాదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. పోలీసు యంత్రాంగం ప్రభుత్వం చేతిలో ఉండి, అధికార ఒత్తిడితో జిల్లా ఎస్పీ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నా రన్నారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. 

ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్‌ నేత కొరివి వినయ్‌కుమార్‌ అన్నారు. ఈ కేసును ఎస్సీ, ఎస్టీ చట్ట పరిధిలోకి తీసుకువచ్చి అనంతబాబుకు శిక్షపడేలా చూడాలన్నారు. రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి జి.వేణు, మాల యువతేజం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.దుర్గ, విరసం కన్వీనర్‌ బూసి వెంకట్రావు, సోషల్‌ యాక్టివిస్టు అరుణ, ఆర్పీఐ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్య క్షుడు జేవీ ప్రభాకర్‌ తదితరులు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2022-05-25T07:38:28+05:30 IST