సబ్సిడీలు, స్కీములు, బటన్లు.. అన్నీ అప్పులే!

ABN , First Publish Date - 2022-09-20T06:35:48+05:30 IST

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెల ఆర్థిక వివరాలను బహిర్గతం చేసింది. త్రైమాసిక ఆర్థికాన్ని చూస్తే, రాష్ట్రం సంపాదించే ఆదాయం జీతాలు, వడ్డీలు, పింఛన్లకు కూడా...

సబ్సిడీలు, స్కీములు, బటన్లు.. అన్నీ అప్పులే!

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెల ఆర్థిక వివరాలను బహిర్గతం చేసింది. త్రైమాసిక ఆర్థికాన్ని చూస్తే, రాష్ట్రం సంపాదించే ఆదాయం జీతాలు, వడ్డీలు, పింఛన్లకు కూడా సరిపోవట్లేదు. మూడు నెలల్లో రాష్ట్ర స్వంత ఆదాయం రూ. 24,403కోట్లు. దీనిలో నుంచి బ్యాంకులకు కట్టాల్సిన లిక్కర్ నెలవారీ అప్పు పద్దు రూ.3,625 కోట్లు తీసేస్తే, రూ.20,778 కోట్లు + కేంద్ర కార్యక్రమాల గ్రాంటు రూ.10,004 కోట్లు. ఖర్చు రూ.62,992 కోట్లు. మరి ఆదాయం కన్నా ఎక్కువ ఉన్న ఖర్చు భర్తీ ఎలా? రూ.32,210 కోట్లు నికర అప్పు. అంతే.


మూడు నెలల స్వంత ఆదాయం రూ.20,778 కోట్లు కాగా, జీతాలు రూ.12,733 కోట్లు, అప్పులకు వడ్డీ చెల్లింపు రూ.5,385 కోట్లు, పింఛన్లు రూ.4,710 కోట్లు = నికరంగా రూ.22,828 కోట్లు ఖర్చు. అంటే రాష్ట్రం తాను సంపాదించే ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, వడ్డీలు కూడా కట్టలేక, దానికోసమే ఇంకొక రెండువేల కోట్లు అప్పు చేస్తోంది. దీనికి అదనం మూడు నెలల్లో రాష్ట్రం చేసే రోజు వారీ ఖర్చు, అంటే రెవెన్యూ ఖర్చులయిన విద్యుత్, రవాణా, బియ్యం, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనం, పోలీసు, ఇంధనం, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు తదితరాలు కలిపి రూ.27,813 కోట్లు. ఇది కాకుండా రాష్ట్రం ఎంతో ఆర్భాటంతో ప్రతి నెలా ఎదో ఒక స్కీం కింద బటన్ నొక్కి అకౌంట్లలో వేసే డబ్బులు, మూడు నెలల్లో రూ.10,200 కోట్లు.


స్వంత ఆదాయం ఇరవై వేల కోట్లతో అరవై వేల ఖర్చును రాష్ట్రం ఎలా పెట్టింది? సింపుల్‌గా చెప్తే అప్పులు చేసి ఇస్తోంది. అప్పులు చేయడానికి కేంద్రమే అనుమతిస్తోంది. కానీ ఎంత? ఈసారి రాష్ట్రానికి తొమ్మిది నెలలకు రూ.43,803 కోట్ల రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకోవడానికి అనుమతించింది. నెలకు రూ.4,867 కోట్లు. మూడు నెలలకి రూ.14,601 కోట్లు తీసుకోవచ్చు. మరి తీసుకుంది ఎంత? రూ.32,210 కోట్లు అంటే మూడు నెలలకి సరాసరి నెలకు రూ.10,700 కోట్ల పైచిలుకు అప్పు. అప్పులు చేస్తే దానికి వడ్డీ కట్టాలి కదా. అందుకే రాష్ట్రం తన స్వంత సంపాదనలో 26% వడ్డీ కింద నెలకు కడుతోంది. అప్పులు పెరిగేకొద్దీ కట్టే వడ్డీ పెరుగుతుంది. మిగిలిన డబ్బు జీతాలకి, ఫించన్లకి కూడా చాలకుండా ప్రతి నెలా అప్పు చేస్తున్నాం.


మరి రాష్ట్రం ఏ ధైర్యంతో అన్ని స్కీంలను నడుపుతోంది? రిజర్వ్ బ్యాంకు నివేదిక ప్రకారం 2022–23 బడ్జెట్ రీత్యా రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వబోతున్న స్కీంల మొత్తం ఖర్చు రూ.27,541 కోట్లు. దీనికి పింఛన్ ఖర్చు అదనం. అంటే అప్పులు తెచ్చేద్దాంలే అనే ధైర్యం ఒక్కటే, రాష్ట్రాన్ని నడిపిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తాను ప్రకటించిన స్కీంలన్నీ బటన్ నొక్కాలంటే ఈ మూడు నెలల ఆదాయం ప్రామాణికంగా చూస్తే సంవత్సర మొత్తానికి లక్షా ఇరవై వేల కోట్లు అప్పులు చెయ్యాలి. ఈ స్కీముల మొత్తం విలువ ఆర్బీఐ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత ఆదాయంలో ముప్పై శాతానికి పైగా ఉంది. మన రాష్ట్రం కంటే ఎక్కువ సబ్సిడీలు, స్కీంలు బటన్ నొక్కడం మీద ఖర్చు పెట్టేది, 45 శాతంతో పంజాబ్ మాత్రమే.


ఏదైనా అంటే పేదవారికి ఏమీ ఇవ్వకూడదా అనే ప్రశ్న లేవనెత్తుతారు. ఎంత ఉచితం, ఏది సంక్షేమం అనేది నిర్వచించకపోతే, అది శ్రీలంక సంక్షోభం మాదిరి అవుతుంది. ఆ మాట అంటే ప్రభుత్వాలకి కోపమొస్తుంది. కానీ నెలసరి ఆదాయంలో తప్పనిసరిగా ఇచ్చి తీరాలి అనే ఖర్చులని కూడా మనం సంపాదించుకోలేని క్రమంలో, మనం నెలకు పదివేల కోట్ల పైచిలుకు అప్పులు చేసి స్కీంలను నడిపితే, ప్రభుత్వాలు నిలబడతాయా అనే ప్రశ్న రాష్ట్ర ప్రజలు తమకు తాము వేసుకోవాలి. పాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఈ అయిదేళ్ల పాటు నాకిష్టం వచ్చినంత అప్పులు చేసి దానాలు చేసేస్తాను అంటే, రాష్ట్ర మనుగడ ఈ అయిదు సంవత్సరాలతో ఆగిపోదు కదా. ఒకప్పుడు దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా వున్న మనం ఈ రోజు రిజర్వ్ బ్యాంకు నివేదికలో శ్రీలంకతో పోల్చబడుతున్నామంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.


పేదలకి ఖచ్చితంగా సంక్షేమం అందాలి. ఏ సందేహమూ లేదు. నిజానికి పింఛన్లని ఉచితం కింద చూడటం మనం ఆపేశాం. అందుకే మూడు నెలలకి రూ.4,710 కోట్లు ఇవ్వాల్సి వచ్చినా, ఆ పద్దుని ‘తప్పనిసరి’ ఖర్చులోనే కలుపుతున్నాం గానీ, ఉచితమనో, సంక్షేమమనో చెప్పటం లేదు. కానీ ఆదాయం లేకుండా, కేవలం అప్పుల మీదనే ఆధారపడుతూ ఈ స్కీములు, బటన్లు అనే జోడెడ్ల బండిని ఎన్నాళ్ళు లాక్కొస్తారు అనేది ప్రధాన ప్రశ్న? జీఎస్టీ పెట్టినందుకు రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న పరిహారం కూడా జూలై నెలతో పూర్తయింది. అంటే కేంద్ర గ్రాంట్లు కూడా ఇకపై గణనీయంగా తగ్గుతాయి.


మార్కెట్ రుణాలతోనే సంక్షేమం నడిపిస్తామంటే ఎంతోకాలం సాగదు. పోనీ ఈ స్కీములు, వాటిల్లో ఇచ్చే డబ్బు ఏదైనా ఆదాయ సముపార్జన మార్గాలను చూపిస్తున్నాయా అంటే అదీ లేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామికీకరణ, గ్రామీణ మౌలిక సౌకర్యాలు, రవాణా, రోడ్లు... ఇవి ఆదాయం పెంచే మార్గాలు. వీటిలో రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు ఉద్యోగాలు వస్తాయి. పేదరికం క్రమానుగతంగా తగ్గుతుంది. గత మూడు నెలలలో ఆంధ్రప్రదేశ్ కాపిటల్ ఖర్చు అంటే ఏదైనా ఆదాయ సముపార్జనకు ఆస్కారమున్న పథకాల్లో పెట్టిన పెట్టుబడులు కేవలం రూ.1900 కోట్లు అని బడ్జెట్ లెక్కలు. వేటిలో పెట్టారో ఏ పద్దు కింద వీటిని చూపిస్తున్నారో కూడా తెలీదు.


ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం. అది ఆదాయం గణనీయంగా పెంచుకోవడం. ఇక్కడా చిత్రమైన స్థితే. క్రితం ఆర్థిక సంవత్సరంలో దేశంలో కెల్లా అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మనమీద విరుచుకుపడుతుంది. కానీ కిటుకు ఇక్కడే ఉంది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటే రాష్ట్రంలో జరిగిన మొత్తం క్రయ విక్రయాల ద్వారా ఆర్థిక విపణిలో వచ్చిన ఆదాయం. మనం సంపాదించిన ఆదాయం కంటే లక్ష కోట్లకు పైగా అప్పులు తెచ్చి ఆర్థిక రంగంలో పెట్టాం. నిజంగానే ఆ లక్ష కోట్లు ఒకటి రెండుసార్లు రొటేషన్ జరిగి వృద్ధి కనిపించింది. ఆ లక్ష కోట్లు లేకుండా మన ఆర్థిక వ్యవస్థలోనే ఆ లక్ష కోట్లు ఉత్పత్తి అయ్యి రొటేషన్ జరిగి ఉంటే, అంటే కొత్త పరిశ్రమలు, ఉద్యోగాల ద్వారా బయట డబ్బు రాష్ట్రంలోకి ప్రవహించి ఉంటే అది గొప్పతనం. అంతేకానీ, అప్పు తెచ్చి అది వృద్ధి అంటే ఎలా? ఆ అప్పు వడ్డీతో సహా తీర్చాలి కదా. వృద్ధి రేటులో ఇంకొక పార్శ్వం, వృద్ధి రెండు రకాలు. శాతాల్లో చూడడం, వచ్చిన డబ్బును అంటే నికర విలువను పరిగణనలోకి తీసుకోవడం. అంటే మహారాష్ట్ర మనకన్నా తక్కువ వృద్ధిరేటు ఉన్నంత మాత్రాన మనం వాళ్ళ కంటే గొప్ప కాదు. వృద్ధి తక్కువే, కానీ మనకంటే నికర విలువలో చాలా ఎత్తులో ఉన్నారు.


ఆదాయం పెంచుకోవడం అనేది నిర్వివాదాంశం. ద్రవ్యోల్బణం మళ్ళీ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఆదాయమార్గాలు తగ్గాయంటే, తప్పనిసరి ఖర్చులు, జీతాలు, పింఛన్లు లాంటి వాటికి కూడా కష్టం రావచ్చు. మనం అప్పు చేసే వృద్ధి రేటు, మన జీఎస్డీపీకి చేరువ అవుతోంది అంటే, మనం అపాయానికి దగ్గరలో ఉన్నట్టు. రిజర్వ్ బ్యాంకు ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పుల – జీడీపీ నిష్పత్తి 2026 సంవత్సరానికి 34కు చేరుతుందని అంచనా. కానీ ఈ అప్పుల్లో కేంద్రం అనుమతించిన వాటినే కలిపారు. కార్పొరేషన్ల ద్వారా అప్పులు, బ్యాంకుల్లో లిక్కర్ ఆదాయం తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఇత్యాదులు కలపలేదు. కలిపితే బహుశా నలభై శాతం దరిదాపులకు వస్తుందేమో. అప్పుడు మనకు పోటీ పంజాబ్ ఒక్కటే. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక రిస్క్ అంచనాలను పునర్ నిర్వచించుకోవాలి. అప్పులతో  తట్టుకోగలిగే స్థాయి ఎంతో మరొక్కసారి ఆలోచించుకోవాలి. ఎంతసేపూ పంజాబ్, కేరళ, రాజస్థాన్, బిహార్ లాంటి రాష్ట్రాలతో అప్పుల్లో పోటీ పడడమే కానీ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, లాంటి రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీపడాలని ఆలోచించకపోతే ఎలా?

నీలయపాలెం విజయకుమార్

తెలుగుదేశం పార్టీ

Updated Date - 2022-09-20T06:35:48+05:30 IST