Advertisement

జీవనాధారం

Apr 9 2021 @ 00:00AM

మానవ నాగరికత కొన్ని ప్రత్యేక సమస్యలను తెచ్చిపెడుతూనే ఉంటుంది. ఆధునిక కాలంలో నిర్వాసితుల సమస్య వాటిలో ఒకటి. నీటిపై ఆనకట్ట కట్టే విధానం సింధూ నాగరికతలో, ఆర్య నాగరికతలో, బుద్ధుని కాలంలో కూడా కనిపిస్తుంది. ఆనకట్టలనూ, మహా నగరాలనూ నిర్మించే క్రమంలో - అప్పటిదాకా అక్కడ ఉన్న స్థానికులను బలవంతాన ఖాళీ చేయించకుండా... వారికి తగిన సదుపాయాలు అందించడం, సహాయాలు చేయడం సామాజిక బాధ్యత, నైతిక నియమం. సమాజ హితం కోసం జీవనాధారాన్ని పోగొట్టుకున్న వారికి సంతృప్తికరంగా సదుపాయాలను కల్పించడం కనీస బాధ్యత. అలాంటి జీవనాధారాలు ఎలా ఉండాలో తెలిపే కథ ఇది. వారణాసి సమీపంలో ఒక అడవి ఉంది. దానిలో ఒక ఏనుగు ఉంది. అది మహా బలం కలిగిన ఏనుగు. ఒక రోజు అది నదీ తీరానికి వెళ్ళి, అడవిలోకి తిరిగి వస్తూండగా... ఎండిపోయిన పాలచెట్టు మోడు మీద దాని పాదం పడింది. దాని పాదంలో పదునైన ఆ మోడు దిగి, విరిగిపోయింది. ఆ బాధ క్రమేపీ పెరిగింది. చివరకు నడవడం కూడా సాధ్యపడలేదు. ఏం చెయ్యాలో ఆ ఏనుగుకు పాలుపోలేదు. 


కొన్నాళ్ళకు వారణాసి నుంచి కొందరు వడ్రంగులు మంచి కలప కోసం అడవికి వచ్చారు. ఏనుగు వారికి ఎదురుగా వెళ్ళింది. కన్నీరు పెట్టుకుంది. వెంటనే వడ్రంగులు దాని పాదంలో ఉన్న మోడు ముక్కను బయటకు లాగారు. ఆకు పసర్లు నూరి కట్టు కట్టారు. అది తొండం ఎత్తి వారికి మొక్కి, తన బిడ్డను వారి చెంత వదిలి, అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగు గున్న కూడా తల్లికి మించిన బలశాలి. కొదమ వయసులో ఉండడం వల్ల ఎంతటి దుంగనైనా అవలీలగా ఎత్తి, వడ్రంగులు పెట్టమన్న చోట పెట్టేది. వారందరూ ఆ గున్న ఏనుగుకు కావలసిన సదుపాయాలు చూస్తూ ఉండేవారు. అలా కొన్నాళ్ళు గడిచింది. వడ్రంగులు ఆ ఏనుగు సహాయంతో పెద్ద పెద్ద చెట్లు కొట్టి, ఖరీదైన వస్తువులు తయారు చేసి, అధిక ఆదాయాన్ని పొందారు. ఆ ఏనుగు వారి దృష్టిలో సాధారణ ఏనుగు మాదిరిగానే ఉంది కానీ, నిజానికి అది ఉత్తమ జాతికి చెందిన భద్ర గజం. 


ఒక రోజు, రాజ పరివారానికి చెందిన వారొకరు ఆ ఏనుగును చూసి, ఈ విషయం కాశీ రాజుకు చెప్పారు. రాజు మావటి వాళ్ళను పంపాడు. వారు దాన్ని చూసి వచ్చి, ‘‘మహారాజా! అది భద్ర గజం. రాజ్యాన్ని కాపాడగల శక్తి సామర్థ్యాలు కలిగినది. దాన్ని వెంటనే మన రాజ్య హస్తిశాలకు రప్పించండి అని చెప్పారు. రాజు అడవికి వెళ్ళి, దాన్ని పట్టి తీసుకురావడానికి అనేక రకాలుగా ప్రయత్నించాడు. కానీ దాన్ని లొంగదీసుకోవడం సాధ్యం కాలేదు. చేసేది లేక చివరకు వడ్రంగులతో బేరసారాలు సాగించాడు. వారు అందుకు అంగీకరించలేదు. ఆ ఏనుగు అక్కడినుంచి కదలలేదు.‘‘మహారాజా! ఈ ఏనుగు వల్లనే మా జీవనం గడుస్తోంది’’ అన్నారు వడ్రంగులు.


‘‘మంచిది’’ అని రాజు ఆ ఏనుగు నాలుగు పాదాలకూ, తొండానికీ లక్ష నాణేలున్న సంచులను తగిలించాడు. వాటన్నిటినీ వడ్రంగుల ముందు ఆ ఏనుగు కుప్ప పోసింది. కదలకుండా అక్కడే నిలబడింది. ఏనుగు ఉద్దేశం రాజుకు అర్థమయింది. వడ్రంగుల కుటుంబాలలోని పిల్లలకూ, పెద్దలకూ, మహిళలకూ, పురుషులకూ... అందరికీ విలువైన వస్త్రాలు ఇచ్చాడు. అయినా ఆ ఏనుగు కదలలేదు.‘‘వడ్రంగులారా! మీ పోషణ భారం మాదే! మీకు మా ప్రాంగణంలో గృహాలు నిర్మించి ఇస్తాను. మీ పిల్లల పోషణ భారాన్ని కూడా మేమే చూసుకుంటాం’’ అని ప్రకటించాడు రాజు. వారికి విలువైన రత్నాలు సమర్పించాడు. ‘‘మా రాజమందిరాల్లో పనులన్నీ మీరే చూడాలి. కలపను మీరే సమకూర్చాలి’’ అని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పుడు, వడ్రంగుల వైపు తిరిగి, తొండం ఎత్తి ఘీంకరించి, కన్నీరు పెట్టుకొని... రాజు వెంట కదిలింది భద్రగజం.ఒకరి దగ్గర నుంచి జీవనాధారాన్ని తీసుకొనేటప్పుడు వారికి అంతకుమించిన ఆధారం చూపించాలని బుద్ధుడు ఇచ్చిన గొప్ప సందేశం ఈ కథ.

బొర్రా గోవర్ధన్‌

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.