ltrScrptTheme3

సూక్ష్మం.. ఎప్పుడు మోక్షం..?

Oct 26 2021 @ 00:14AM

  1.  రెండేళ్లుగా అందని డ్రిప్‌ పరికరాలు
  2.  పాత బకాయిలు చెల్లించని ప్రభుత్వం
  3.  టెండర్లు పిలిచినా స్పందించని కంపెనీలు
  4. ఏపీఎంఐపీ కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణ


 కర్నూలు, ఆంధ్రజ్యోతి: రాయలసీమలో వర్షపాతం చాలా తక్కువ. దీని ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. వందల అడుగుల లోతు బోర్లు తవ్వినా చుక్కనీరు దొరకడం గగనం. వచ్చే అరకొర నీటిని సద్వినియోగం చేసుకుని పంటలు పండించేందుకు రైతులు చెమటోడుస్తారు. ఇక్కడి రైతులు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు బిందు, తుంపర సేద్య పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో చాలామంది రైతులు ఈ తరహా సూక్ష్మ సేద్యం వైపు మళ్లారు. గత ప్రభుత్వాలు సూక్ష్మ సేద్య పరికరాలను రైతులకు సబ్సిడీపై అందించాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం అటకెక్కింది. రెండు సంవత్సరాల క్రితం సూక్ష్మ సేద్య పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి మూడు నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క రైతుకూ పరికరాలు అందించలేదు. టెండర్లు పిలిచామని, త్వరలోనే సబ్సిడీ పరికరాలను అందిస్తామని అధికారులు చెబుతున్నారు. 


కేంద్రం తోడ్పాటు


సూక్ష్మ సేద్యానికి కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇస్తోంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన(పీఎంకేఎస్‌) కింద ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవాలనే లక్ష్యంతో నిధులు ఇస్తోంది. కేంద్ర వాటా, రైతు వాటా మినహా మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. పథకం అమలుకు నోచుకోని గత సంవత్సరానికి కూడా కేంద్రం నిధులు ఇస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీంతో రైతులు ఏపీఎంఐపీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 


ప్రకటనలకే పరిమితం


2021-22 సంవత్సరానికి సూక్ష్మసేద్యం పథకం అమలుకు ఆర్థిక, పాలనాపరమైన ఆమోదాన్ని ప్రభుత్వం జూలై 7న ఇచ్చింది. రైతులకు సబ్సిడీ పరికరాలు అందిస్తామని, సెప్టెంబరు 1 నుంచి ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపింది. కానీ మార్గదర్శకాలను విడుదల చేయలేదు. దీంతో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయలేకున్నారు. నిధుల విషయంలో మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జిల్లాలో దాదాపు 15 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యానికి రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. 


రాయితీలో కోత


సూక్ష్మ సేద్య పరికరాలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ ఇచ్చేవారు. ప్రస్తుతం 90 శాతానికి కుదించారు. రెండు నుంచి నాలుగు హెక్టార్లలోపు పొలం ఉన్న రైతులకు గతంలో 90 శాతం రాయితీని ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు 70 శాతానికి కుదించారు. రెండు హెక్టార్లలోపు పంట సాగు చేసే చిన్న, సన్నకారు రైతాంగానికి 90 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో కేంద్రం వాటా 33 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 57 శాతం, మిగిలిన 10 శాతాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. తుంపర సేద్యం పరికరాలను మాత్రం 50 శాతం రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


కంపెనీలకు బకాయిలు


సూక్ష్మ సేద్యానికి గతంలో పరికరాలు అందించిన కంపెనీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంది. రూ.కోట్లలో ఉన్న బకాయిలను చెల్లిస్తేనే పరికరాలు సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం గత నెలలోనే టెండర్లను పిలిచింది. కానీ కంపెనీల నుంచి స్పందన పెద్దగా రాలేదు. దీంతో మరోసారి టెండర్లను పిలించింది. ఈనెల 18తో ఆ గడువూ ముగిసింది. బకాయిలు చెల్లించకుండా టెండర్లు పిలిచినా, కంపెనీలు సహకరించేది అనుమానమే అని రైతులు అంటున్నారు. 


త్వరలోనే అందిస్తాం..


ప్రభుత్వం ఇప్పటికే రాయితీ ఉత్తర్వులిచ్చింది. పెండింగ్‌ బిల్లులను పై అధికారులకు పంపించాము. మొదటిసారి టెండర్లకు అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మళ్లీ పిలిచాం. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మరో పదిరోజుల్లో పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అర్హులైన రైతులందరికీ సూక్ష్మసేద్య ఫలాలు అందేలా చూస్తాం. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నాం.


- ఉమాదేవి, పీడీ, ఏపీఎంఐపీ, కర్నూలు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.