మంచిని నిలిపితేనే సాఫల్యం!

ABN , First Publish Date - 2020-12-04T05:34:46+05:30 IST

లోకంలో వెలుగూ చీకటీ ఉన్నట్టే సమాజంలో మంచీ చెడూ ఉంటాయి. మంచిని ఎంచుకొనే వారు దేవుని కృపకు పాత్రులవుతారు. మంచి మార్గంలో పయనించేవారి లక్షణాల గురించి అల్లాహ్‌ వివరిస్తూ ‘‘వారు పశ్చాత్తాపం చెందేవారై ఉంటారు.

మంచిని నిలిపితేనే సాఫల్యం!

లోకంలో వెలుగూ చీకటీ ఉన్నట్టే సమాజంలో మంచీ చెడూ ఉంటాయి. మంచిని ఎంచుకొనే వారు దేవుని కృపకు పాత్రులవుతారు. మంచి మార్గంలో పయనించేవారి లక్షణాల గురించి అల్లాహ్‌ వివరిస్తూ ‘‘వారు పశ్చాత్తాపం చెందేవారై ఉంటారు. ఆరాధనలు చేస్తారు. దైవస్తోత్రం చేస్తారు. దైవమార్గంలో సంచరిస్తారు. దైవ సమక్షంలో వినమ్రంగా వంగి ఉంటారు. సాష్టాంగ పడతారు. మంచి చెయ్యాలని ఆదేశిస్తారు. చెడును నిరోధిస్తారు. ఓ ప్రవక్తా! అలాంటి విశ్వాసులకు శుభవార్త వినిపించు’’  (దివ్య ఖుర్‌ఆన్‌ - అత్‌ తౌబా) అని పేర్కొన్నారు. అంతేకాదు ‘‘అలాంటి వ్యక్తి ఇతరులను మంచి చేయాల్సిందిగా ప్రోత్సహిస్తాడు. చెడు నుంచి నిరోధిస్తాడు. వారికోసం పరిశుద్ధమైన విషయాలను ధర్మసమ్మతమైనవిగా ఖరారు చేస్తాడు. అపరిశుద్ధమైన వాటిని అధర్మంగా నిర్ధారిస్తాడు. ప్రజలపై ఉన్న భారాలను దించుతాడు. వారిని పెనవేసుకున్న శృంఖాలాలను తెంచుతాడు. అతణ్ణి ఎవరైతే విశ్వసించి అండగా నిలుస్తారో, అతనికి సాయపడతారో, అతనితో పాటు అవతరించిన జ్యోతిని అనుసరిస్తారో అలాంటివారే సాఫల్యం పొందుతారు’’ అని అల్లాహ్‌ తెలిపారు. 


మంచిని పాటించేవారికి భూమి మీద సుస్థిరతను ప్రసాదిస్తే వారు నమాజును స్థాపిస్తారనీ, జకాత్‌ చెల్లిస్తారనీ, మంచిని చేయాలని ఆదేశిస్తారనీ, చెడును నిరోధిస్తారనీ దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. దైవ ప్రవక్త మహమ్మద్‌ను ఉద్దేశించి అల్లాహ్‌ సందేశమిస్తూ ‘‘మహమ్మద్‌! చెడును అత్యంత శ్రేష్టమైన పద్ధతిలో నిర్మూలించు. మంచీ , చెడూ ఒకటి కాజాలవు. కాబట్టి అత్యంత శ్రేష్టమైన మార్గం ద్వారా చెడును నిర్మూలించాలి. అప్పుడు నీ ఆగర్భ శత్రువు కూడా నీకు ప్రాణమిత్రుడైపోవడం నీవు చూస్తావు. సహనం కలిగినవారికి తప్ప ఈ సద్గుణం ఎవరికీ సంక్రమించదు. అదృష్టవంతులకు తప్ప ఆ భాగ్యం ఎవరికీ దక్కదు’’ అని స్పష్టం చేశారు. దేవుడి మార్గంలోకి రావాల్సిందిగా ఇతరులను వివేకవంతమైన, చక్కని ఉపదేశంతో ఆహ్వానించాలి. వారితో వాదించాల్సి వస్తే అత్యుత్తమమైన రీతిలో వాదించాలి. తన మార్గం నుంచి తప్పిపోయినవారెవరో, సన్మార్గం వైపు నడిచేవారెవరో దైవానికి తెలుసు. మంచి వైపు పిలిచేవారూ, మేలు చేయాలని ఆజ్ఞాపించేవారూ, చెడువైపు వెళ్ళకుండా ఆపేవారూ మానవుల్లో కొందరైనా తప్పనిసరిగా ఉండాలి. ఆ పని చేసేవారే సాఫల్యం పొందుతారు. ఇదే విషయాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ చాటి చెబుతోంది. 

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-12-04T05:34:46+05:30 IST