విజయం మనదే

ABN , First Publish Date - 2022-05-21T05:13:58+05:30 IST

రానున్న ఎన్నికల్లో విజయం మనదేనని.. వైసీపీ పాలనపై ప్రజలు విసుగుచెందారని.. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం టీడీపీ సీనియర్‌ నాయకుడు కొల్ల అప్పలనాయుడు కుమార్తె వివాహానికి లోకేష్‌ హాజరయ్యారు. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం, పొందూరు మీదుగా రోడ్డు మార్గంలో రాజాం చేరుకున్నారు. లోకేష్‌కు దారిపొడవునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

విజయం మనదే
టీడీపీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతున్న నారా లోకేష్‌

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యం

వైసీపీ ప్రభుత్వానికి ప్రజాగుణపాఠం తప్పదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

సీనియర్‌ నేత కొల్ల కుమార్తె వివాహానికి హాజరు

రాజాం పట్టణంలో భారీ రోడ్‌ షో

మూడు జిల్లాల నుంచి హాజరైన టీడీపీ శ్రేణులు

రాజాం/రాజాం రూరల్‌, మే 20: రానున్న ఎన్నికల్లో విజయం మనదేనని.. వైసీపీ పాలనపై ప్రజలు విసుగుచెందారని.. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం టీడీపీ సీనియర్‌ నాయకుడు కొల్ల అప్పలనాయుడు కుమార్తె వివాహానికి లోకేష్‌ హాజరయ్యారు. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం, పొందూరు మీదుగా రోడ్డు మార్గంలో రాజాం చేరుకున్నారు. లోకేష్‌కు దారిపొడవునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాజాం పట్టణంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. పాలకొండ రోడ్డులోని సీతారామ థియేటర్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లోకేష్‌ మాట్లాడారు. దారి పొడవునా నాయకులు, కార్యకర్తల అభిమానం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్న నమ్మకం మరింత పెరిగిందన్నారు. వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. టీడీపీ బలోపేతంపై దృష్టిసారించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గడపగడపకూ ప్రభుత్వం పేరిట వెళ్తున్న వైసీపీ నాయకులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారని.. బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరవుతున్న టీడీపీ నేతలకు నీరాజనం పడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అందుకే ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయని చెప్పారు. వారికి సమాధానం చెప్పలేక వైసీపీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సీనియర్‌ నాయకులు కిమిడి కళా వెంకటరావు, అచ్చెన్నాయుడులపై కేసులు పెట్టి ఏం పీకారని లోకేష్‌ ప్రశ్నించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. తనపై 14 కేసులు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. శ్రేణులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, కూన రవికుమార్‌, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ద్వితీయ శ్రేణి నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. అనంతరం లోకేష్‌ కొల్ల అప్పలనాయుడు కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

కార్యకర్తపై చేయిచేసుకున్న సీఐ

లోకేష్‌ రోడ్‌ షోలో హాజరయ్యేందుకు వెళుతున్న రాజాం పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త అంపోలు శ్రీనుపై సీఐ శ్రీనివాసరావు చేయి చేసుకోవడం కలకలానికి దారితీసింది. స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో బైక్‌పై వెళుతున్న శ్రీనును ఆపి చేయిచేసుకోవడంతో చొక్కా చిరిగిపోయింది. శ్రీను పరిస్థితిని చూసి లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యకర్తలపై జులుం కాదు.. నేరుగా రండి.. తేల్చుకుందామంటూ సవాల్‌ విసిరారు. 

మూడు జిల్లాల నేతలతో సమావేశం

రాజాంలోని మాజీ మంత్రి కళా వెంకటరావు నివాసంలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల నాయకులతో లోకేష్‌ సమావేశమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. పార్టీ బలోపేతం గురించి చర్చించారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహించాలని నాయకులకు సూచించారు. అధికార పార్టీ దాడులు తెగబడుతున్న దృష్ట్యా.. బాధితులకు అండగా నిలవాలన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను చురుగ్గా చేపట్టాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై ఆరాతీశారు. 



Updated Date - 2022-05-21T05:13:58+05:30 IST