విజయీభవ

ABN , First Publish Date - 2022-10-05T04:35:28+05:30 IST

దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

విజయీభవ
నర్సాపూర్‌ చౌరస్తాలో రావణ దహనానికి ఏర్పాట్లు

దసరా పండుగకు ఘనంగా ఏర్పాట్లు

పలుచోట్ల రావణ దహనానికి ఏర్పాట్లు పూర్తి 

ముస్తాబైన ఆలయాలు..


సిద్దిపేట కల్చరల్‌, అక్టోబరు 4: దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీగా ఉండే నర్సాపూర్‌ చౌరస్తా, రంగధాంపల్లి చౌరస్తా, బూరుగుపల్లి చౌరస్తా, తదితర ప్రాంతాల్లో స్టేజీలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం కల్పించారు. షమీ పూజకు సంబంధించి జమ్మి చెట్లను నాటారు. బారీకెడ్లను ఏర్పాటు చేశారు. లైటింగ్‌, మెడికల్‌ క్యాంప్‌, ఎలక్ట్రిసిటీ, తదితర సౌకర్యాలను కల్పించారు.


ఆలయాలు ముస్తాబు 

పట్టణంలోని కోటిలింగాల ఆలయం, మోహినిపుర వేంకటేశ్వర ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయం, నాగదేవత ఆలయం, రేణుకా ఎల్లమ్మ ఆలయం, తదితర దేవాలయాల్లో భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా, రంగధాంపల్లి చౌరస్తా , రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ చౌరస్తాల్లో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కడవెర్గు రాజనర్సు, కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, ఏసీపీ దేవారెడ్డిలు పర్యవేక్షించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రంగధాంపల్లిలో గ్రౌండ్‌లో రావణ దహనం, స్టేజ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.


విజయదశమి శుభాకాంక్షలు 

 మంత్రి హరీశ్‌రావు

 సిద్దిపేట క్రైం, అక్టోబరు4: విజయదశమి (దసరా) పర్వదినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి విజ యం సాధించడమే విజయదశమి ప్రత్యేకత అన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాక్షించారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో, దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం అన్నింటా మరిన్ని విజయాలు సాధించాలని ఈ పర్వదినాన అమ్మవారిని వేడుకుంటున్నట్లు  పేర్కొన్నారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని కోరారు. 



Updated Date - 2022-10-05T04:35:28+05:30 IST