14 ఏళ్లకే చదువుకు గుడ్‌బై.. ఫేక్ డాక్యుమెంట్స్‌తో ఫస్ట్ జాబ్.. ప్రస్తుతం భారతీయ కుబేరుల లిస్ట్‌లో..

ABN , First Publish Date - 2021-08-24T22:19:25+05:30 IST

14 ఏళ్లకే చదువు ఆగిపోయినా..చివరికి అపరకుబేరుడిగా మారిన ఓ యువభారతీయుడి స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది..

14 ఏళ్లకే చదువుకు గుడ్‌బై.. ఫేక్ డాక్యుమెంట్స్‌తో ఫస్ట్ జాబ్.. ప్రస్తుతం భారతీయ కుబేరుల లిస్ట్‌లో..

ఇంటర్నెట్ డెస్క్: అతడి చదువు పద్నాలుగేళ్లకే ఆగిపోయింది! ఏం చేయాలో తెలినీ అయోమయ స్థితి అది! చదువు లేదు.. భవిష్యత్తుపై అస్పష్టత.. ఏదో తెలియని భయం, బెంగ! తలుచుకుంటేనే దడపుట్టే పరిస్థితులు అవి. అటువంటి స్థితిలో తన ప్రయాణం ప్రారంభించిన ఓ టీనేజ్ కుర్రాడు ప్రస్తుతం భారత అపరకుబేరుల్లో ఒకడిగా మారాడు! అంతే కాదు.. భారత్‌లో అత్యంత పిన్నవయసున్న బిలియనీర్ కూడా అతడే!


తనపై తనకున్న నమ్మకం, కష్టించి పనిచేసే వ్యక్తిత్వమే పెట్టుబడిగా ముందడుగు వేసిన అతడు నేడో బిలియనీర్‌గా అవతరించాడు. మరో ఆసక్తి కరమై విషయం ఏంటంటే..అతడు తన తొలి ఉద్యోగాన్ని ఓ నకిలీ బర్త్ సర్టిఫికేట్ చూపించి పొందాడు! ఉపోద్ఘాతం సరే.. అసలు ఎవరా టీనేజర్.. అనుకుంటున్నారు కదూ..? అతడు ఇంకెవరో కాదు.. మనందరికీ తెలిసిన జెరోధా సంస్థ అధినేతే! పేరు..నిఖిల్ కామత్! యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న నిఖిల్ జీవన ప్రయాణం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి..!


పద్నాలుగేళ్లకే ఆగిపోయిన విద్యాభ్యాసం.. 

నిఖిల్ కామత్ అందరిలాగే చదువు మొదలు పెట్టాడు. కానీ.. అనుకోకుండా అతడి విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోయింది. కాలేజీలు, డిగ్రీలు చదువులు, ఉద్యోగావకాశాలు.. ఇలా అనేక మంది జీవితంలో సాధారణమైన విషయాలన్నీ అతడికి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయాయి. హాజరు శాతం తక్కువగా ఉండటంతో నిఖిల్ పరీక్ష రాయలేకపోయాడు. ఆ తరువాత.. విద్యాభ్యాసానికే శాశ్వతంగా దూరమయ్యాడు. ఇది జరిగే నాటికి నిఖిల్ వయసు కేవలం 14 ఏళ్లు. ఇది నిఖిల్‌కే కాదు.. అతడి కుటుంబానికి కూడా పెద్ద శరాఘాతంగా మారింది.


‘‘అప్పట్లో నా స్నేహితులందరూ చక్కగా స్కూళ్లకు వెళ్లేవారు. ఆ తరువాత కాలేజీ..ఉద్యోగాలు ఇలా వారి భవిష్యత్తు అంతా ముందే నిర్ణయమైపోనట్టు నాకు అనిపించేది. నేను మాత్రం జీవితంలో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండే వాడిని. నాకు నేనే మార్గదర్శనం చేసుకోవాల్సిన స్థితి అది. ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచిస్తుంటే అసలు నాకు అందరిలాగా చదువుకోవాలన్న ధ్యాసే లేదేమో అనిపిస్తుంది’’ అని నిఖిల్ పేర్కొన్నారు. 


అయితే.. నిఖిల్‌కు చిన్నప్పటి నుంచీ వ్యాపారంపై మక్కువ ఎక్కువ.  14 ఏళ్ల వయసులోనే అతడు తన మిత్రుడితో కలిసి..మొబైల్ ఫోన్ వ్యాపారం మొదలెట్టాడు. కానీ..ఈ విషయం నిఖిల్ తల్లికి తెలియడంతో ఆ వ్యాపారం మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. నిఖిల్ తల్లి ఆ ఫోన్లన్నిటీనీ తీసుకుని డ్రెయినేజీలో పారేశారు. ఇక నిఖిల్‌కు చదరంగం అంటే అమితమైన ఆసక్తి.  ఐదేళ్ల వయసప్పటి నుంచే అతడు చెస్ ఆడటం ప్రారంభించాడు. ఆ తరువాత ఆటపై అనురక్తి క్రమక్రమంగా పెరిగిపోయింది. గంటల తరబడి విసుగూ విరామం లేకుండా చదరంగంలో మునిగిపోయేవాడు. ఆటలో మరిన్ని నైపుణ్యాలు నేర్చుకుని ఒకానొక దశలో ప్రొఫెషనల్ స్థాయిలోనూ ఆడటం ప్రారంభించాడు. దేశంలో పేరుగాంచిన చదరంగం క్రీడాకారులతో అతడు పోటీ పడేవాడు.  


మొదటి ఉద్యోగం ఓ కాల్ సెంటర్‌లో..

ఇక చదువు పక్కనపెట్టేశాక నిఖిల్.. మొదటిసారిగా రూ. 8 వేల జీతానికి ఓ కాల్ సెంటర్‌లో పనికి కుదిరాడు. అప్పటికి అతడి వయసు 17 ఏళ్లు. అంటే మైనర్ అన్నమాట. అది ఉద్యోగం చేయాల్సిన వయసు కాదు. దయతలిచి అతడికి ఉద్యోగం ఇచ్చిన వాళ్లు కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే నిఖిల్.. నకిలీ జనన ధ‌ృవీకరణ పత్రంతో ఆ ఉద్యోగంలో చేరాడు. ‘‘నాకా కాలేజీ చదువు.. డిగ్రీ సర్టిఫికేట్లు లేవు. అటువంటి వాడికి ఉద్యోగం ఎవరిస్తారు. దీంతో.. డిగ్రీ చదువులు అవసరం లేనిదేదైనా చేయడమే మిగిలిన మార్గమని నాకనిపించింది’’ అని చెప్పాడు నిఖిల్. 


‘‘ఓ రోజు మా నాన్న గారు నా చేతిలో కొంత డబ్బులు పెట్టారు. ఆయన దాచుకున్న మొత్తంలోంచి ఆ డబ్బులు తీసి ఇచ్చారు. దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకో అని అన్నారు. ఆయనకు నాపై ఉన్న నమ్మకం అలాంటిది’’ అని చెప్పారు నిఖిల్. అలా అతడు స్టాక్ మార్కెట్‌లో తన తొలి అడుగులు ప్రారంభించాడు. 19 ఏళ్లకే నిఖిల్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే కామత్ అసోసియేట్స్‌ను స్థాపించాడు. 


2010లో టర్నింగ్ పాయింట్..

నిఖిల్, ఆయన సోదరుడు నితిన్ కలిసి 2010లో జెరోధాను ప్రారంభించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగించి.. ఈ మొత్తం ప్రక్రియ మరింత సులువుగా మార్చడమే కంపెనీ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సూచించేలా వారు కంపెనీ పేరును కూడా నిర్ణయించారు. జెరోధా అంటే జిరో, రోధా అనే రెండు పదాల కలయిక. జీరో అంటే సున్నా అని తెలిసిందే! ఇక ‘రోధా’ అంటే సంస్కృతంలో అడ్డంకులు అని అర్థం.  అంటే జెరోధా.. ఇన్వెస్టర్ల అడ్డంకులు తొలగిస్తుందన్నమాట.


‘జెరోధా’ తరువాత.. నిఖిల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సి అవసరమే లేకపోయింది. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన అతడు చివరికి భారత అపరకుబేరుల్లో ఒకడిగా మారారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఓ బిలియనీర్‌గా.. అత్యంత పిన్నవయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నిఖిల్ జెరోధాతో పాటూ ట్రూ బీకన్ అనే సంస్థనూ నెలకొల్పారు. ఇది ఓ హెడ్జ్ ఫండ్. ప్రత్యేకమైన పెట్టుబడి పథకాలు, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, కేపిటల్ మార్కెట్ సర్వీసులు, వ్యూహాత్మక ఇన్వెస్టర్ల అవసరాలమేరకు రూపొందించిన ప్రత్యేక ఉత్పత్తులు..ఇలా పెట్టుబడులకు సంబంధించి ఓ కొత్త ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడమే ఈ కంపెనీ ఉద్దేశ్యం. 


చదువు మధ్యలోనే ఆగిపోయి.. చిన్న కాల్‌సెంటర్ ఉద్యోగంతో వృత్తి జీవితం ప్రారంభమై.. చివరికి జెరోధా స్థాపించి..ఇలా ఎన్నో మజిలీలు దాటొచ్చిన నిఖిల్.. రెండు విషయాల్లో మాత్రం తాను ఇప్పటికీ మారలేదంటాడు. ‘‘ఇప్పటికీ నేను రోజులో 85 శాతం సమయాన్ని పనికే కేటాయిస్తాను. మరోవైపు.. నాలో నిత్యం ఏదో అభద్రత..ఇదంతా ఒక్కసారిగా కోల్పోవాల్సి వస్తే ఎలా..? అనే ప్రశ్న నన్ను తొలుస్తుంటుంది. నేను బిలియనీర్‌ను అయినా కూడా ఈ రెండు విషయాల్లో మాత్రం నాలో ఏ మార్పు రాలేదు’’ అని చెబుతాడు నిఖిల్.


యువతకు నిఖిల్ ఇచ్చే సందేశం ఇదే..

యువత ఎప్పుడూ కూడా తమపై తాము నమ్మకం కోల్పోకూడదని నిఖిల్ తరచూ చెబుతుంటాడు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తాను యువతకు చెప్పగలిగినది ఇదొక్కటే అని అంటాడు. ‘‘నేను చెప్పేది ఒకటే.. మీరు ప్రస్తుతం దేని గురించి అయితే తీవ్రంగా మథన పడుతున్నారో.. దాన్ని ఐదేళ్ల తరువాత మీరే పూర్తిగా మరిచిపోతారు. కాబట్టి.. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చేసే పనిని మాత్రం అలాగే కొనసాగించండి.. మనసు పెట్టి చేయండి! ఏదో ఒక రోజు అంతా మనకు అనుకూలంగా జరుగుతుంది అన్న బలమైన నమ్మకాన్ని ఉంచండి.’’ అని అంటారు నిఖిల్.  

Updated Date - 2021-08-24T22:19:25+05:30 IST