పక్కా ప్లాన్‌ ప్రకారమే ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-17T06:23:00+05:30 IST

హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన పల్లకొండ రాజు(30) కథ ముగిసింది. గత వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న రాజు... గురువారం ఉదయం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నష్కల్‌ శివారులో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే ఆత్మహత్య

మృతుడు పల్లకొండ రాజు.. చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడు
తమ కళ్ల ముందే   ఆత్మహత్య చేసుకున్నాడని  చెబుతున్న ప్రత్యక్ష సాక్షులు
స్టేషన్‌ఘన్‌పూర్‌-నష్కల్‌ రైల్వే స్టేషన్ల మధ్య ఘటన
8 రోజులుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న నిందితుడు
హైదరాబాద్‌ నుంచి నష్కల్‌కు రావడంపై పలు అనుమానాలు


జనగామ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి,  హత్యకు పాల్పడిన పల్లకొండ రాజు(30) కథ ముగిసింది. గత వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న రాజు... గురువారం ఉదయం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నష్కల్‌ శివారులో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒకపక్క రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, మరోపక్క అనేక అనుమానాలకూ తావిస్తోంది. హైదరాబాద్‌ నుంచి రాజు  నష్కల్‌కే ఎందుకువచ్చాడు..? ఎలా వచ్చాడు...? అనే అంశాలు అనుమానం కలిగిస్తున్నాయి. ఇక రాజు పూర్వీకులది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొడకండ్ల మండలం కావడం, అతడి బంధువులు ఇంకా స్థానికంగానే ఉంటుండటంతో తాజా ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే...

పక్కాప్లాన్‌ ప్రకారమే రాజు ఆత్మహత్య జరిగినట్టు  తెలుస్తోంది. పోలీసుల సీసీ కెమెరాలకు చిక్కకుండా రాజు రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా.. రాజు రోడ్డు వెంబడి కాకుండా ట్రాక్‌ వెంబడి వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం నష్కల్‌కు సమీపంలో  సికింద్రాబాద్‌-కాజీపేట(డౌన్‌ లైన్‌) రైల్వే పట్టాలపై 309 నంబర్‌ మైలురాయి వద్ద రాజు కూర్చొని ఉండగా  రైల్వేట్రాక్‌ విధుల్లో ఉన్న కీమ్యాన్‌ కూతాటి సారంగపాణి  గమనించి ‘ఎందుకు ఇక్కడ కూర్చున్నావు.. పట్టాల పక్కన కూర్చోవద్దు.. ఎవరు నీవు?’ అని ప్రశ్నించాడు. దీంతో రాజు తనపేరు చెప్పకుండా తాము ఎరుకల వాళ్లమని చెప్పాడు.  ఈ క్రమంలో సారంగపాణి అనుమానంతో అతడిని గమనించి  ‘నువ్వు రాజువు కదా’ అని నిలదీయగా..  ‘నీకెందుకురా..?’ అంటూ  దుర్భాషలాడుతూ  కాజీపేట వైపు 200 మీటర్ల దూరం పరిగెత్తాడు.  దీంతో  సారంగపాణి అక్కడే పొలంలో యూరియా చల్లుతున్న భూక్యా రాంసింగ్‌, గేమ్‌సింగ్‌, భూక్యా సురేశ్‌కు విషయం చెప్పడంతో వారు పరుగెత్తుకు వచ్చి రాజును పట్టుకోవడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో రాజు ఇవతలి వైపు నుంచి అవతలి వైపు ఉన్న పట్టాలు దాటి చెట్లపొదల్లోకి వెళ్లి దాక్కున్నాడు.  సదరు యువకులు వెళ్లి చెట్ల పొదల్లోకి కంకర రాళ్లు విసరగా రాజు బయటకు రాలేదు. యువకులు కొద్దిసేపు చూసి వెళ్లిపోతుండగా పొదల్లోంచి రాజు బయటకు వచ్చి పట్టాల పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళ్తోంది. పట్టాలకు అడుగు దూరంలోనే నిల్చున్నాడని, ట్రైన్‌ దగ్గరకు రాగానే పట్టాల మీదకు వచ్చాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. చూస్తుండగానే రైలు ఢీకొని రాజు చనిపోయాడని తెలిపారు.  ఎలాగైనా దొరికిపోతానన్న భయంతోనే ట్రైన్‌ కిందపడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ప్రత్యక్షసాక్షులు, పోలీసులు చెబుతున్నారు.

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌- నష్కల్‌ రైల్వే స్టేషన్ల మధ్య 309/1-3 కిలో మీటర్‌ మైలురాయి సమీపంలో ఉన్న రాజవరం బ్రిడ్జివద్ద రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీపేట-సికింద్రాబాద్‌ అప్‌లైన్‌ మార్గంలో ఘటన జరిగిన స్థలం నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌ స్టేషన్‌ 4 కి.మీ, నష్కల్‌ స్టేషన్‌ 2.5 కి.మీ దూరం ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్యలో రాజవరం గ్రామం నుంచి వచ్చే వాగుపై బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి వద్దే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎదురుగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడడంతో రాజు మొహం మొత్తం నుజ్జునుజ్జయింది. రైలు చక్రాల కింద పడడంతో కుడి చేతి వేళ్లు చితికిపోయాయి. ఎడమ కాలు మోకాలి మడమ మధ్య భాగంలో విరిగింది. ఇవి తప్ప మారే గాయాలు లేకపోవడం గమనార్హం.  కాగా, 100 నెంబర్‌  ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి ఎడమ చేతిపై తెలుగులో, కుడిచేతిపై ఇంగ్లీ్‌షలో మౌనిక అని పచ్చబొట్టు ఉండడంతో సైదాబాద్‌ నిందితుడు రాజుగా నిర్ధారణకు వచ్చారు.  కాగా, మృతుడు రాజు నుంచి పోలీసులు రెండు సెల్‌ఫోన్లు, ఇంటి తాళం చెవి, నగదును  స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్‌లో సిమ్‌ కార్డు ఉండగా.. మరో ఫోన్‌లో సిమ్‌ లేకుండా ఖాళీగా ఉంది. ఒక ఫోన్‌కు బ్యాక్‌ సైడ్‌ క్యాప్‌ కూడా లేదు.  

పరిశీలించిన సీపీ..

రాజు ఆత్మహత్య చేసుకున్న స్థలాన్ని వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి, వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడు ఇక్కడి దాకా ఎలా వచ్చాడు? అనే విషయంపై పూర్తిసాయిలో విచారణ చేస్తామని విలేకరులకు సీపీ తరుణ్‌జోషి తెలిపారు. ఆయన వెంట స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ రఘునాథ్‌ వైభవ్‌గైక్వాడ్‌, జనగామ ఏసీపీ వినోద్‌కుమార్‌, ఎస్సైలు రమేశ్‌నాయక్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

పచ్చబొట్టుతో నిర్ధారణ

పల్లకొండ రాజు ఉదయం 6.30కు పట్టాల పక్కనే ఉండగా ప్రత్యక్ష సాక్షి సురేశ్‌ గమనించాడు. పట్టాల వెంబడి మానసిక వికలాంగులు నడుచుకుంటూ వెళ్లడం సాధారణం కావడంతో, పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 8.30కు కీమ్యాన్‌ సారంగపాణి (రైల్వే ఉద్యోగి) చూశాడు. వెంటనే రాజు పరుగెత్తి పొదల్లో దాక్కోవడం, ప్రత్యక్ష సాక్షులు రాళ్లు విసరడం జరిగిన తర్వాత.. ట్రాక్‌ మీదకు వచ్చి 8.45కు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని నిర్ధారణ చేసుకోవడం కోసం స్థానిక పోలీసులు ప్రత్యక్ష సాక్షులను ఫోన్లోనే మృతదేహం మీద గుర్తులు చెప్పమన్నారు. మృతదేహంపై మౌనిక అనే పచ్చబొట్టు ఉందని చెప్పడంతో రాజుగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి 9.53 అయింది. మృతదేహాన్ని అక్కడి నుంచి ఎంజీఎంకు 12.30కు తరలించారు.

హడావిడిగా రాజు అంత్యక్రియలు

పోతననగర్‌ శ్మశానవాటికలో తలకొరివి పెట్టిన తల్లి
మీడియాతో మాట్లాడనివ్వని పోలీసులు


మట్టెవాడ (వరంగల్‌), సెప్టెంబరు 16: 
పల్లకొండ రాజు మృతదేహానికి  వరంగల్‌ పోతననగర్‌ శ్మశాన వాటికలో గురువారం రాత్రి 8.40 గంటలకు  భారీ పోలీసు బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. రాజు భార్య మౌనిక, తల్లి నీలమ్మ, బావమరుదులు కేదిరి మహేశ్‌, సురేశ్‌, సోదరి, తొమ్మిది నెలల కూతురు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాజు తల్లి  తలకొరివి పెట్టింది. అంతకుముందు సాయంత్రం 4 గంటలకు మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, జీఆర్‌ పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం 7.30 గంటలకు రాజు తల్లి, భార్య, సోదరి, ప్రత్యేక పోలీస్‌ వాహనంలో ఎంజీఎం మార్చురీ వద్దకు వచ్చి విలపించారు.

హడావిడిగా అంత్యక్రియలు..

పోస్టుమార్టం తర్వాత రాజు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం మొదట నల్గొండ జిల్లాకు తరలిస్తారని అనుకున్నప్పటికీ భద్రతా కారణలతో చివరి నిమిషంలో వరంగల్‌లోనే నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఎంజీఎం మార్చురీకి సమీపంలో ఉన్న పోతననగర్‌ శ్మశాన వాటికకు ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. అక్కడ 10 నిమిషాల్లోనే హడావిడిగా దహన సంస్కారాలు పూర్తి చేయించారు. అంత్యక్రియలు జరిగిన వెంటనే ప్రత్యేక పోలీసు వాహనంలో వారిని నల్గొండకు తరలించారు. కాగా, రాజు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు.

ఆత్మహత్య కేసు నమోదు...

రాజు మృతి ఘటనను ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్టు జీఆర్‌పీ ఎస్సై కె.అశోక్‌ కుమార్‌ తెలిపారు. నష్కల్‌ రైల్వే స్టేషన్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ హరిశంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎంజీఎం మార్చురీ వద్ద ఉద్రిక్తత

హనుమకొండ అర్బన్‌:
  పల్లకొండ రాజు గురువారం ఉదయం నష్కల్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించగా, అతడి మృతదేహాన్ని పోలీసులు మధ్యాహ్నం ఎంజీఎం మార్చురీకి తరలించారు. రాజు మృతదేహం ఉన్న అంబులెన్సు మార్చురీ వద్దకు చేరుకుంటుండగా, కొందరు స్థానికులు ఆవేశంతో చెప్పులు విసిరారు. చిన్నారిని అమానుషంగా పొట్టనపెట్టుకున్న కిరాతకుడికి తగిన శిక్షే పడిందని శాపనార్థాలు పెట్టారు. అయితే వారిని  సాయుధ పోలీసులు అడ్డుకొని శాంతపరిచారు.  మృతదేహాన్ని భారీపోలీసు బందోబస్తు మధ్య మార్చురీ గదికి తరలించారు.









Updated Date - 2021-09-17T06:23:00+05:30 IST