ఆకస్మిక జ్ఞానోదయం

ABN , First Publish Date - 2021-03-26T05:43:59+05:30 IST

గదాధర్‌ (రామకృష్ణ పరమహంస) ఒక రోజు ఉదయం పొలాల గట్ల మీద నడుస్తున్నారు. చేతిలో ఉన్న బుట్టలో

ఆకస్మిక జ్ఞానోదయం

గదాధర్‌ (రామకృష్ణ పరమహంస) ఒక రోజు ఉదయం పొలాల గట్ల మీద నడుస్తున్నారు. చేతిలో ఉన్న బుట్టలో బొరుగులను తింటూ, ఆకాశంలో ఎగురుతున్న కొంగల బారును చూస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు అపూర్వమైన తన్మయత్వం కలిగింది. భావ సమాధి స్థితిని పొందారు. ఈ ఘటన ఆయన జీవిత చరిత్రలో ప్రస్తావితమయింది. గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్‌ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగినట్టు చెబుతారు. జెన్‌ గురువు హ్యూనెంగ్‌ జీవితంలోనూ అత్యంత ఆశ్చర్యకరమైన ఇటువంటి అనుభవమే కలిగింది.


హ్యూనెంగ్‌ పూర్తి పేరు డజియన్‌ హ్యూనెంగ్‌. ఆయన నిరక్షరాస్యుడు, అత్యంత సామాన్యుడు. కట్టెలు కొట్టి, అమ్మి జీవించేవాడు. ఒక రోజు సంతలో ఉన్న ఒక వ్యక్తికి కట్టెలు ఇవ్వడానికి వెళ్ళాడు. అది సూర్యాస్తమయ సమయం. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరో పండితుడు బుద్ధ భగవానుడి బోథలు ఉన్న ‘రతన సుత్త’ను పారాయణం చేస్తున్నాడు. దానిలో కేవలం నాలుగు వాక్యాలు హ్యూనెంగ్‌ చెవిన పడ్డాయి.


ఆ వాక్యాలలోని శక్తి ప్రభావమో... ఆయన పూర్వ సంస్కారాల బలమో కాని హ్యూనెంగ్‌ బాహ్య స్మృతిని కోల్పోయాడు. రాతి విగ్రహంలా నిలబడి పోయాడు. చీకటి పడింది. బజారులో అంగళ్ళన్నీ మూతపడ్డాయి. అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. రాత్రి గడిచింది. సూర్యోదయమయింది. అంగళ్లు తెరుచుకున్నాయి. అందరూ బేరసారాలు చేస్తున్నారు. అయినా హ్యూనెంగ్‌ కదలలేదు. ఆయనకు నిద్రాహారాలు లేవు. కళావిహీనం కావలసిన ఆయన ముఖం తేజస్సుతో ప్రకాశించింది. మెల్ల మెల్లగా బాహ్య స్మృతి కలిగింది.




ఆ ‘రతన సుత్త’ను ఏళ్ళ తరబడి పారాయణ చేస్తున్న పండితుడు... పండితుడిగానే మిగిలిపోయాడు. కానీ అది విన్న హ్యూనెంగ్‌లో జ్ఞాన జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆయనలో ఊహకు అందని ప్రశాంతత నెలకొంది. ఆయన కళ్ళు జ్యోతుల్లా వెలిగాయి. కంఠ స్వరం తియ్యదనాన్ని సంతరించుకుంది. వాక్కులు శాంతిమయాలయ్యాయి. హృదయం కరుణాపూరితమయింది. 


ఇది గమనించిన పండితుడు ‘‘ఏరా! హ్యూనెంగ్‌! ఏమయింది నీకు? ఎందుకలా నిలబడ్డావు?’’ అని అడిగాడు.


హ్యూనెంగ్‌ నోరు విప్పాడు. ‘రతన సుత్త’లో తాను విన్న వాక్యాలను గొంతెత్తి పాడాడు. వాటి గురించి వ్యాఖ్యానం ఆయన నోటి నుంచి వరదలా ప్రవహించింది.


అక్షరం ముక్కయినా రాని హ్యూనెంగ్‌ నోటి నుంచి వచ్చిన జ్ఞాన ప్రవాహం ఆ పండితుణ్ణి ఆశ్చర్యపరచింది. ‘‘నువ్వు వెళ్ళి, నా గురువు డామన్‌ హోంగ్రెన్‌ను కలువు’’ అని సూచించాడు. 

అక్కడి నుంచి హ్యూనెంగ్‌ నేరుగా డామన్‌ ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు ‘రతన సుత్త’ మొత్తం బోధించాలనీ, శిష్యునిగా చేసుకోవాలనీ అడిగాడు.

‘‘దక్షిణ ప్రాంతానికి చెందిన అనాగరికుడివి. నిన్ను నా శిష్యుడిగా చేసుకోవాలా?’’ అని మొదట ఎగతాళిగా మాట్లాడిన డామన్‌ ఆ తరువాత హ్యూనెంగ్‌ మాటలనూ, వ్యాఖ్యానాన్నీ విని ముగ్ధుడైపోయాడు. తన ఉత్తరాధికారిగా హ్యూనెంగ్‌ను ప్రకటించాడు.

ఈర్ష్యాపరులు ఇది సహించలేక హ్యూనెంగ్‌కు హాని తలపెట్టారు. ఈ సంగతి డామన్‌ గ్రహించాడు. హ్యూనెంగ్‌ను ఒక రాత్రి బయటకు తీసుకువెళ్ళి, తెప్పలో కూర్చోబెట్టి, నదీ మార్గాన్ని చూపించి, సురక్షిత ప్రాంతానికి పంపాడు. అర్హులకు జ్ఞాన బోధ చేయాలని సలహా ఇచ్చాడు.

సురక్షిత ప్రదేశానికి చేరిన హ్యూనెంగ్‌ ‘ఆకస్మిక జ్ఞానోదయం’ అనే విధానాన్ని ప్రబోధించారు. హ్యూనెంగ్‌కు హాని చేయదలచిన హ్యూమింగ్‌ చివరకు ఆయన అనుచరుడయ్యాడు. అనుంగు శిష్యుడయ్యాడు. టాయూ పర్వతం మీద ఆశ్రమం ఏర్పాటు చేసిన హ్యూనెంగ్‌ తన డెబ్భై రెండవ సంవత్సరంలో... వందలాది శిష్యుల కన్నీటి వీడ్కోలు మధ్య తనువు చాలించాడు.


హ్యూనెంగ్‌ ‘ఆకస్మిక జ్ఞానోదయం’ అనే విధానాన్ని ప్రబోధించారు. హ్యూనెంగ్‌కు హాని చేయదలచిన హ్యూమింగ్‌ చివరకు ఆయన అనుచరుడయ్యాడు.


 రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2021-03-26T05:43:59+05:30 IST