Big Twist: బ్యాంకు దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్.. బంగారం ఎవరింట్లో దొరికిందో తెలిసి..

ABN , First Publish Date - 2022-08-18T23:02:27+05:30 IST

స్థానిక అరుంబాక్కంలోని ఫెడ్‌ బ్యాంక్‌ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడిలో ఒక పోలీసు పాత్ర కూడా ఉందని తెలిసి..

Big Twist: బ్యాంకు దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్.. బంగారం ఎవరింట్లో దొరికిందో తెలిసి..

చెన్నై: స్థానిక అరుంబాక్కంలోని ఫెడ్‌ బ్యాంక్‌ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడిలో ఒక పోలీసు పాత్ర కూడా ఉందని తెలిసి కేసు విచారణ చేసిన ఖాకీలు అవాక్కయ్యారు. అచరపక్కం ఇన్‌స్పెక్టర్ అమల్‌రాజ్ ఇంట్లో చోరీకి గురైన బంగారంలో 3.5 కిలోలు దొరికింది. పోలీసులు ఈ బంగారాన్ని సీజ్ చేశారు. అంతేకాదు.. అమల్‌రాజ్ చోరీ చేసిన దొంగలతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు కూడా విచారణలో తేలింది. ఈ బ్యాంకు దోపిడీ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, మరొకరిని కూడా అదుపులోకి తీసుకుని, అతడి నుంచి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


ఈ దోపిడీ జరిగిన వెంటనే సూర్య అనే వ్యక్తి 14 కేజీల బంగారు నగలతో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి ఆర్‌ఎస్‌పురంలోని ఓ నగల దుకాణంలో వాటిని కరిగించాడని పోలీసుల దర్యాప్తులో తేలడంతో సత్వరం స్పందించిన పోలీసులు.. ఆ నగల దుకాణం యజమానిని అరెస్టు చేశారు. సూర్య నుంచి 14 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దోపిడీకి గురైన మొత్తం నగలు స్వాధీనమైనట్లు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ ప్రకటించారు.



ఈ దోపిడీ కేసును సమర్థవంతంగా విచారణ జరిపి అతి తక్కువ సమయంలోనే ప్రధాన నిందితులందరినీ అరెస్టు చేసిన ప్రత్యేక దళాన్ని ఆయన అభినందించారు. ఒకటి రెండు రోజుల్లోగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం అరెస్టయిన బ్యాంక్‌ దోపిడీ సూత్రధారి మురుగన్‌ను పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. ఈ దోపిడీలో ఏడుగురే కాకుండా ఇంకా ఎవరికైనా సంబంధాలున్నాయేమోనని ఆరా తీస్తున్నారు.

Updated Date - 2022-08-18T23:02:27+05:30 IST