Political Heat in Husnabad: ఈసారి ముక్కోణపు పోటీ తప్పదా?

ABN , First Publish Date - 2022-09-08T04:16:22+05:30 IST

జిల్లాలో ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌కు ఏకపక్షంగా ఉన్న హుస్నాబాద్‌ (Husnabad) రాజకీయం ఒక్కసారిగా...

Political Heat in Husnabad: ఈసారి ముక్కోణపు పోటీ తప్పదా?

సిద్దిపేట: జిల్లాలో ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌కు ఏకపక్షంగా ఉన్న హుస్నాబాద్‌ (Husnabad) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏకపక్ష రాజకీయం నుంచి త్రిముఖ పోటీగా మారుతోంది. టీఆర్ఎస్ (Trs) నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి జంప్ కావడం, కాంగ్రెస్‌లో ఉన్న బొమ్మ శ్రీరాం చక్రవర్తి బీజేపీ (Bjp)లోకి వెళ్లడంతో హుస్నాబాద్ హస్తం శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి (RevanthReddy).. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ (Congress)లో చేర్పించిన రోజు నుంచే అసంతృప్తి మొదలైంది. 


హుస్నాబాద్‌ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోది. జిల్లాల విభజనతో నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, కోహెడ.. కొత్తగా ఏర్పడిన అక్కన్నపేట మండలాలు సిద్దిపేట జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాలు కరీంనగర్‌ జిల్లాలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలోకి వెళ్లాయి. కాగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలకు హుస్నాబాద్‌లో గట్టి పట్టుంది. కొత్తగా బొమ్మ శ్రీరాం చక్రవర్తి బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి కూడా బలం చేకూరినట్లయింది. దీంతో హుస్నాబాద్‌ రాజకీయ పరిణామాలు కరీంనగర్‌ జిల్లాలోనే కాకుండా సిద్దిపేట, హన్మకొండ జిల్లాలోనూ మార్పులకు కారణంకానున్నాయి.


ఇదిలావుంటే.. బొమ్మ శ్రీరాంచక్రవర్తి తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు ఐదు దశాబ్దాలపాటు హుస్నాబాద్‌లో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన శ్రీరాంచక్రవర్తి.. హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకొని నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేశారు. అయితే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ప్రవీణ్‌రెడ్డిని తిరిగి చేర్చుకోవడం, ఆయనకు హుస్నాబాద్‌ టికెట్‌ హామీ ఇచ్చారనే ప్రచారంతో శ్రీరాంచక్రవర్తి అనివార్యంగా కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది. హుస్నాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. 


మరోవైపు హుస్నాబాద్‌ నియోజకవర్గంలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి.. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్‌లో మళ్లీ టిక్కెట్‌ వచ్చే అవకాశం లేదని క్లారిటీకి వచ్చిన ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అయితే అంతకుముందు ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన నాటి నుంచి ఆ పార్టీకి అన్నీతానై కార్యకర్తలకు, నేతలకు అండగా ఉంటూ వచ్చారు బొమ్మ శ్రీరాం చక్రవర్తి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేశారు. కానీ ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ ప్రవీణ్‌రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో షాక్‌ అయ్యారు. టిక్కెట్ ఆశలు గల్లంతు కావడంతో శ్రీరాం చక్రవర్తి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాల్సి వచ్చింది.


ఇంతవరకూ బాగానే ఉన్నా.. హుస్నాబాద్ నియోజకవర్గంలో మెజార్టీ కాంగ్రెస్‌ నేతలు శ్రీరాంచక్రవర్తి వెంటే ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారింది. అయితే హుస్నాబాద్‌లో ప్రస్తుతం మారిన రాజకీయంతో బీజేపీ టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేత జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి టికెట్‌ ఆశిస్తున్నారు. శ్రీరాం కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో.. నిన్న, మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న హుస్నాబాద్ బీజేపీలో రానున్న రోజుల్లో పోటాపోటీ రాజకీయాలు తప్పేలా లేవని తెలుస్తోంది. 



Updated Date - 2022-09-08T04:16:22+05:30 IST