అకాల వర్షంతో అవస్థలు

ABN , First Publish Date - 2021-04-24T05:17:57+05:30 IST

అకాల వర్షంతో అవస్థలు

అకాల వర్షంతో అవస్థలు
గొల్లపూడి మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యం

జిల్లావ్యాప్తంగా వర్షాలు

కొన్నిచోట్ల వడగళ్లతో వాన

భారీ గాలులు, మెరుపులు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నూజివీడులో మామిడి పంటకు స్వల్పనష్టం 

విజయవాడ, ఆంధ్రజ్యోతి/గొల్లపూడి : మండువేసవిలో ఎండలకు అలమటిస్తున్న జిల్లావాసులపై శుక్రవారం భారీవర్షం చల్లదనాన్ని చిలకరించింది. జిల్లావ్యాప్తంగా భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. బందరు తప్ప అన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. భారీ మెరుపులకు తోడు బలమైన గాలులు వీచాయి. దాదాపు అరగంట పాటు వర్షం పడింది. గాలివానకు నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్‌ పునరుద్ధరించినా ఓల్టేజీ సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గన్నవరం ప్రాంతంలోని వెంకటనరసింహాపురంలో చెట్లు విరిగి పడ్డాయి. గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. చిన్నరాయి సైజు వడగళ్లు పడ్డాయి. చాలాచోట్ల చెట్లు విరిగిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కాగా, అకాల వర్షం మామిడి రైతులను ఇబ్బంది పెట్టింది. నూజివీడు డివిజన్‌ పరిధిలో మామిడి తోటలకు స్వల్పనష్టం సంభవించింది. కోత దశకు చేరుకుంటున్న సమయంలో మామిడికాయలు రాలిపోయాయి.

గొల్లపూడి మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యం

గొల్లపూడి మార్కెట్‌ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు ధాన్యంపై పట్టాలు కప్పే సమయం కూడా లేకపోయింది. జిల్లాలోని చాలాచోట్ల ధాన్యం పొలాల్లోనే ఉందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.







Updated Date - 2021-04-24T05:17:57+05:30 IST