పీడిస్తున్న రక్తహీనత

ABN , First Publish Date - 2022-06-28T05:43:57+05:30 IST

ఏజెన్సీ వ్యాప్తంగా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తున్నది.

పీడిస్తున్న రక్తహీనత
చింతపల్లి సీహెచ్‌సీలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణికి రక్తం ఎక్కిస్తున్న దృశ్యం

ఎనీమియాతో గిరిజనులు సతమతం

గణనీయంగా పెరుగుతున్న బాధితుల సంఖ్య

పాడేరు డివిజన్‌ పరిధిలో నెలలో సగటున 102- 115 మంది బాధితులు

అశ్రద్ధ చేస్తే ప్రమాదమని వైద్యుల హెచ్చరిక


జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రక్తహీనత(ఎనీమియా) బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బాలికలు, గర్భిణులు, బాలింతల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తున్నది. చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం, పాడేరు జిల్లా ఆస్పత్రి, అరకు ఏరియా ఆస్పత్రి పరిధిలో నెలకు 102 నుంచి 115 మంది బాధితులు రక్తహీనతతో చికిత్స పొందుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


చింతపల్లి, జూన్‌ 27: ఏజెన్సీ వ్యాప్తంగా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తున్నది. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో 12.5 గ్రాముల హిమోగ్లోబిన్‌ శాతం ఉండాలి. ఏజెన్సీలో 20 మంది ఆదివాసీ గర్భిణులు, బాలింతలకు రక్త పరీక్షలు నిర్వహిస్తే ఎనిమిది మంది మహిళల్లో హిమోగ్లోబిన్‌ శాతం 7 గ్రాములకంటే తక్కువగా ఉంటున్నదని వైద్యులు చెబుతున్నారు. కొంత మందిలో ఆరు, ఐదు, నాలుగు గ్రాముల హిమోగ్లోబిన్‌ శాతం ఉంటుంది. గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నప్పటికీ రక్తహీనత సమస్య అధిగమించడంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. గర్భిణులు ప్రసవం అనంతరం రక్తహీనతకు గురవుతున్నారు. గిరిజన ప్రాంతంలో బాలింత మృతుల్లో రక్తహీనత ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. 


సమతుల్య ఆహారం అందక..

గిరిజన ప్రాంతంలో ఆదివాసీలకు సమతుల్య పోషకాహారం అందకపోవడం వల్లే రక్తహీనతకు గురవుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా మహిళలు, పురుషులు అధికంగా శ్రమిస్తారు. అయితే శరీరానికి అవసరమైన క్యాలరీల ఆహారాన్ని ప్రతి రోజు తీసుకోవడం లేదు. ఈ కారణంగా రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. అవగాహన లోపం వల్ల కూరగాయలు, పప్పుధాన్యాలను కూడా పూర్తి స్థాయిలో ఆహారంగా తీసుకోవడం లేదు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులను కూడా ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పాలి. 


బాధితులు ఎందరో..

గత నెలలో చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ కోరాపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ      కోరాబు మల్లేశ్వరి తీవ్ర అనారోగ్యంతో చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు కేవలం రెండు గ్రాముల హెచ్‌బీ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆమెకు రక్తం ఎక్కించి, మెరుగైన చికిత్స కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల కిందట ధారకొండ పంచాయతీ టోకరాయి గ్రామానికి చెందిన గిరిజన గర్భిణి లైలా రక్తహీనతతో బాధపడుతూ ప్రసవం పొందింది. ఆమెకు ఆరు కంటే తక్కువ హెచ్‌బీ శాతం ఉంది. ప్రసవం అనంతరం బలహీనంగా జన్మించిన శిశువు మరణించగా, బాలింతను మెరుగైన చికిత్స కోసం చింతపల్లి తీసుకొచ్చారు. చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల రక్తహీనతతో(హెచ్‌బీ 7శాతం కంటే తక్కువగా ఉన్న గిరిజనులు) బాధపడుతూ 20-30 మంది చికిత్స పొందుతున్నారు. సీహెచ్‌సీలో 2021లో 200మంది రక్తహీనత బాధితులకు చికిత్స అందించగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 105మంది బాధితులకు రక్తం ఎక్కించి చికిత్స అందించారు. రెండు మండలాల్లో ఉన్న 11 పీహెచ్‌సీలోనూ ప్రతి నెల మూడు నుంచి ఐదుగురు గిరిజనులు రక్తహీనతతో చికిత్స కోసం వస్తున్నారు. 


సకాలంలో గుర్తించకపోవడం వల్ల..

రక్తహీనత లక్షణాలను సకాలంలో గుర్తించలేకపోవడం వల్ల ఏజెన్సీ వ్యాప్తంగా ఈ సమస్య తీవ్రంగా ఉంది. రక్తహీనత కారణంగా ఆదివాసీల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో వివిధ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కారణంగా రక్తహీనతతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, బాలికలు మృత్యువాత పడుతున్నారు. గిరిజనులు రక్తహీనత లక్షణాలను గుర్తించి ఆస్పత్రిలో హెచ్‌బీ పరీక్షలు చేయించుకోవడం చాలా అరుదు. వ్యాధి తీవ్రమైన సందర్భంలోనూ, గర్భందాల్చిన తరువాత ఆస్పత్రిలో వైద్యులు హెచ్‌బీ పరీక్షలు నిర్వహించి రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తిస్తున్నారు. 


అశ్రద్ధ చేస్తే ప్రమాదం

రక్తహీనత మనిషిని కుంగదీసే వ్యాధుల్లో రెండోది. డబ్ల్యూహెచ్‌వో వారు మన రక్తకణాలలో హిమోగ్లోబిన్‌ 11గ్రాములుకంటే తక్కువగా వుంటే దానిని ఎనీమియాగా నిర్వచించారు. రక్తహీనత కలిగిన వ్యక్తిలో తీవ్ర అలసట కనిపిస్తుంది. కాలేయం, గుండె, మెదడు, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. కాలేయం సరిగా పనిచేయక ఆకలి ఉండదు. కాళ్లు, శరీరం పొంగుతుంది. ఇన్‌ఫెక్షన్లకు గురై తరచూ జ్వరం, ఇతర వ్యాధులు వ్యాప్తిచెందుతాయి. 


సకాలంలో గుర్తించి చికిత్స పొందాలి

రక్తహీనత సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలి. ప్రతీ మనిషిలోనూ మలం ద్వారా రోజు(రక్తకణాలకు అవసరమైన ఇనుపధాతువు) 0.6మిల్లీ గ్రాములు పోతుంది. ఆడవారిలో రక్తం రుతుక్రమం ద్వారా మరికొంత పోతుంది. దీని వల్ల రక్తహీనత పలు రకాలుగా బయటపడుతుంది. రక్తహీనత కలిగిన వారిలో అజీర్తి, జిగటవిరేచనాలు, కాళ్లులాగడం, ఆకలి తగ్గడం, చర్మం, ముఖంపాలిపోవడం, విపరీతమైన నీరసం, ఆయాసం, బీపీ, గుండెదడ, రంగుమారటం లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యలు కనిపించిన వెంటనే వైద్యాఽధికారిని సంప్రతించాలి. హెచ్‌బీ పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి.

- డాక్టర్‌ డి.మహేశ్వరరావు, సూపరింటెండెంట్‌, సీహెచ్‌సీ, చింతపల్లి



Updated Date - 2022-06-28T05:43:57+05:30 IST