భారీ వర్షాలకు అతలాకుతలం

ABN , First Publish Date - 2022-10-07T06:23:09+05:30 IST

జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం పడింది. దీంతో కొన్ని మండలాల్లో ప్రధాన రోడ్లు చప్టాపై నీరు పొంగి ప్రవహించింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు కాలనీలు జలదిగ్భంధంలో ఉన్నాయి.

భారీ వర్షాలకు అతలాకుతలం
నీట మునిగిన మిరప

నీటమునిగిన మిరప 

పొంగిపొర్లిన వాగులు

రాకపోకలకు అసవస్థలు 

జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం పడింది. దీంతో కొన్ని మండలాల్లో ప్రధాన రోడ్లు చప్టాపై నీరు పొంగి ప్రవహించింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు కాలనీలు జలదిగ్భంధంలో ఉన్నాయి.

బేస్తవారపేట, అక్టోబరు 6 : బేస్తవారపేట నుంచి  ఒంగోలు వెళ్లే రహదారిలోని పాపాయిపల్లె వాగు పొంగడంతో రాకపోకలు రెండు గంటలపాటు నిలిచిపోయాయి. బీసీ కాలనీలో డ్రైనేజీ లేక రోడ్లుపై నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంభం చెరువుకు వెళ్లే దారిలోని వాగు పొగింది. రైతులు సాగు చేసిన అరటి, వరి పంటలపై నీరు ప్రవహించాయి. సూరుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు చెరువును తలిపించి మూడు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. రావిపాడు గ్రామం దారిలోని గృహాల్లోని నీరు చేరింది. వర్షంతో చెరువులు కుంటలు నిండాయి. దీంతో భూగర్భజలాలు పెరిగాయి. కంది తదితర మెట్ట పంటలకు ఈ వర్షం జీవం పోసింది.

రాచర్ల : వర్షం ప్రభావంతో మండలంలోని గంగంపల్లి, అనుమలవీడు, సోమిదేవిపల్లి, సంగపేట గ్రామాలలో పత్తిపంటలోకి నీరు వచ్చి చేరింది. వ్యవసాయశాఖ అధికారి షేక్‌ రఫిక్‌ నీటమునిగిన పత్తిపంటలను పరిశీలించారు. నీరు నిల్వ లేకుండా బయటకు వెళ్ల్లే చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. నెమలిగుండం నుంచి వర్షం నీరు వస్తుండగా గుండ్లకమ్మ మీదుగా కంభం చెరువుకు నీరు చేరుతోంది.

గిద్దలూరు టౌన్‌ : బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం గురువారం తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు భారీగా కురిసింది. ఇప్పటికే ఖరీఫ్‌లో సాగైన పత్తి, మిరప, టమోటా లాంటి పంటలు వర్షం కారణంగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలలో సాగులో ఉన్న కూరగాయలు కూడా ఈ వర్షానికి దెబ్బతిన్నట్లు, కెఎస్‌పల్లె, బురుజుపల్లె ప్రాంతానికి చెందిన రైతులు పేర్కొంటున్నారు.  గిద్దలూరు నుంచి ప్రవహించే సగిలేరు నదికి ఓ మోస్తారు నీరుపారుతుండడంతో భూగర్భజలాలు పెరగనున్నాయి.

తర్లుపాడు : అధిక వర్షాలతో పలుచోట్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఎక్కువగా మిర్చి పంట దెబ్బతింది. సీతానాగులవరం, నాయుడుపల్లి, తర్లుపాడు, తుమ్మలచెరువు, కలుజువ్వలపాడు  ప్రాంతాల్లో మిర్చిపంట దాదాపుగా 600 ఎకరాలు దెబ్బతింది. మూడు నెలల క్రితం సాగుచేసిన మిర్చి పంట ప్రస్తుతం పూత, పిందె, కాయదశలో ఉంది. ముందుగా వేసిన మిర్చి పంట దెబ్బతింది. నెల రోజుల క్రితం దాదాపుగా వెయ్యి ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. లేతగా వేసిన మిర్చి పంటకు పెద్దగా నష్టం లేదని రైతులు పేర్కొంటున్నారు. ముదురు పంటకు ఎకారికి రూ.60 వేలు నష్టం వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. పత్తి పంట ప్రస్తుతం కాయలు పాడై తీవ్రనష్టం వాటిల్లింది. జూటు పంట కూడా దెబ్బతిన్నది. తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారిలో సీతానాగులవరం వద్ద వాగు పొర్లింది. దీంతో ఉదయం 3 గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాయుడుపల్లె వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ గ్రామానికి రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. 

పొదిలి రూరల్‌ : మండలంలో గత రెండు రోజులుగా  కురిసిన వర్షాలకు 20 సంవత్సరాల తరువాత పొదిలి పెద్దచెరువుకు నీరు చేరింది. చెరువుకు అనుసందానంగా ఉండే పరివాహక ప్రాంతాలైన చినారికట్ల, పెదారికట్ల, ఇరసలగుండం, బచ్చలకురపాడు, కంభాలపాడు గ్రామాల్లో బుధవారం కురిసిన వర్షాలకు పల్లెకంటేరు వాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో చెరువుకు నీరు చేరుతోంది. మండలంలోని నందిపాలెం, పోతవరం గ్రామాల మధ్యన ఈ వాడు పొంగడం ఇంత వరకు చూడలేని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పట్టణంలో కర్నూల్‌, ఒంగోలు రహదారిపైకి నీరు చేరింది. చిన బస్టాండ్‌, పాతపోస్టాఫీస్‌ కూడలి, ఆంధ్రాబ్యాంక్‌ సందు, తదితర కాలనీల్లో సైడు కాలువలు నిండి మురుగు నీరు రోడ్లపై ప్రవహించింది. తహసీల్దార్‌ కార్యాలయ ఆవర ణలో, ఉపఖజానా ఆవరణలో భారీగా నీరు చేరింది. 

కనిగిరి : కనిగిరి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా పడింది. జిల్లాలోని అత్యధికంగా వర్షం కురిచింది. పట్టణంలోని పామూరురోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉన్న వాగు పొంగి పొర్లింది. కందుకూరు రోడ్డులోని ఫైర్‌స్టేషన్‌ వద్ద ప్రధానరోడ్డుపైకి మోకాలిలోతు నీరు చేరింది. బీసీకాలనీ, శివనగర్‌కాలనీలోని వాగులు పొంగాయి. దీంతో రోడ్లపైకి మురుగునీరు చేరుకుని లోతట్టు ఇళ్ల ముందు నిలిచింది. పట్టణ సమీపంలోని కంభం రోడ్డు అర్బన్‌కాలనీల్లో ఇళ్ల మధ్యకు నీరు చేరుకుంది. శివారు పొలాల పక్కన ఈ కాలనీ ఉండటంతో నిలిచిన వర్షపు నీటిలోకి విషసర్పాలు వస్తున్నాయని ప్రజలు భయపడుతున్నారు. మరోపక్క పట్టణంలోని దొరువుబజారులోని ప్రధాన డ్రైనేజిలోని వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించటంతో అందులో పేరుకుపోయిన చెత్తపైకి వచ్చి ఇళ్లముందుకు చేరుకుంది.  

విద్యుత్‌ అంతరాయంతో  రోగులకు ఇబ్బందులు

ఎడతెరిపి లేకుండా పడిన వర్షం కారణంగా కనిగిరి పట్టణంలో బుధవారం రాత్రి 3గంటలకు ఆగిపోయిన విద్యుత్‌ గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు రాలేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మరోపక్క ప్రభుత్వాసుపత్రిలోని రోగులు అవస్థలు పడ్డారు.  ప్రభుత్వాసుపత్రిలో రోజూ మాదిరి డయాలసిస్‌ చేయించుకునేందుకు వచ్చిన రోగులు విద్యుత్‌ అంతరాయం కారణంగా ఇబ్బంది పడ్డారు. 10 మందికి పైగా డయాలసిస్‌ చేయించుకోలేకపోయారు. 

దొనకొండలో విస్తారంగా వర్షం 

దొనకొండ, అక్టోబరు 6 : మండలంలోని గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు వర్షం ఆగకుండా విస్తారంగా కురిచింది. పొలాల్లో వర్షం నీరు నిలిచి పంటలకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ఆందోళనలు చెందుతున్నారు. పలు గ్రామాల్లో రహదారులపై నీరు నిలచి ప్రజలు రాకపోకలుకు తీవ్ర ఇబ్బందులు కల్గించాయి. 

అధిక వర్షాలకు రైతులు జాగ్రత్తలు పాటించాలి

ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలను రక్షించుకునేందుకు అవసరమైన తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏవో లక్ష్మీనారాయణ చెప్పారు. దొనకొండ సచివాలయంలో రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గూర్చి గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో వివరించారు. అనంతరం ఈ క్రాప్‌ నమోదును తనిఖీ చేశారు.


Updated Date - 2022-10-07T06:23:09+05:30 IST