పండక్కి పంచదార లేనట్టే..!

ABN , First Publish Date - 2021-11-01T06:28:48+05:30 IST

పండక్కి పంచదార లేనట్టే..!

పండక్కి పంచదార లేనట్టే..!

దీపావళికి కోటా పంచదారకు కోత

జిల్లాకు 40 శాతం కోటా మాత్రమే విడుదల 

మొత్తం 6వేల టన్నులకు 2,400 టన్నులే దిగుమతి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఈ దీపావళి కార్డుదారులకు చేదు అనుభవమే మిగల్చనుంది. నవంబరు కోటాకు కేవలం 40 శాతం మాత్రమే పంచదార రావడంతో ప్రస్తుతం కొరత ఏర్పడింది. జిల్లాలో 12 లక్షల మంది తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరికి 6వేల మెట్రిక్‌ టన్నుల పంచదార అవసరం. ప్రస్తుతం 40 శాతం అంటే.. 2,400 మెట్రిక్‌ టన్నుల పంచదార వచ్చింది. ఇంకా 3,600 మెట్రిక్‌ టన్నుల పంచదారను ప్రొక్యూర్‌ చేయాల్సి వస్తోంది. పండక్కి ముందు పంచదార ను అందించలేక సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చతికిలపడింది. బయట మారె ్కట్‌లో పంచదార ధర ఎక్కువగా ఉన్నందున, కార్డుదారులు రేషన్‌ పంచదారకే ప్రాధాన్యతనిస్తారు. ఇలా ఇచ్చే అరకేజీ పంచదారను కూడా ప్రొక్యూర్‌ చేయలేకపోవటం అధికారుల వైఫల్యమేనని చెప్పొచ్చు. పంచదార కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించకపోవటం వల్ల వారి నుంచి సహకారం లోపిస్తోందని అంటున్నారు. చేయలేకపోతే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. పంచదార కొరత కారణంగా కృష్ణా జిల్లాలో 12 లక్షల కార్డు దారులలో కేవలం 40 శాతం మంది మాత్రమే పంచదారను అందుకోనున్నారు. ఈ నలభై శాతం మంది కూడా పండగ ముందు  పూర్తి స్థాయిలో పంచదారను అందుకునే పరిస్తితి లేకుండా పోయింది. నవంబరు 4 వ తేదీన దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. పంచదార కోటాను ఒక రోజు ముందు ఇస్తేనే సార్ధకత ఉంటుంది. అంటే కేవలం మూడు రోజులలో పంచదారను కనీసం 15 శాతం మందికి కూడా ఇచ్చే పరిస్తితి ఉండదు. 

కష్టసాధ్యంగా రేషన్‌ పంపిణీ

ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ నేపథ్యంలో మొదటి వారంలో ఒక వార్డులో కానీ, ఒక గ్రామంలో కానీ 30 శాతం మించి పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒక ఎండీయూ ఆపరేటర్‌కు నాలుగైదు గ్రామాలు, డివిజన్లు అప్పగించటం వల్ల మొదటి వారంలో అందుకునే నిత్యావసరాల శాతం తక్కువగా ఉంటోంది. పండక్కి కేవలం మూడు రోజుల సమయమే ఉండటం వల్ల అందులో సగం.. అంటే.. 15 శాతం మాత్రమే నిత్యావసరాలను అందుకోగలుగుతున్నారు. సాధారణ కార్డుల పరిస్థితి ఇలా ఉంటే అంత్యోదయ అన్న యోజన రేషన్‌ కార్డులు జిల్లాలో 10వేల వరకు ఉన్నాయి. ఈ ఏఏఐ కార్డుదారులకు కిలో లెక్కన పంచదారను ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 10వేల కార్డులకు 10వేల కేజీల పంచదారను అందించాల్సి ఉండగా, ఈనెలలో ఆ పరిస్థితి లేదు. 

Updated Date - 2021-11-01T06:28:48+05:30 IST