ఆయిల్‌ పామ్‌ కాదు, చెరకు సాగు ముఖ్యం

ABN , First Publish Date - 2022-07-05T06:45:10+05:30 IST

ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిధిలో చెరకు బాగా పండేది. 1930 దశకంలోనే నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర ఆనాటికి ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ...

ఆయిల్‌ పామ్‌ కాదు, చెరకు సాగు ముఖ్యం

ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిధిలో చెరకు బాగా పండేది. 1930 దశకంలోనే నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర ఆనాటికి ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో నెలకొల్పారు. ఆ తర్వాత కాలంలో జహీరాబాద్, మెదక్, మెట్‌పల్లి ప్రాంతాలకు కూడా నిజాం షుగర్స్ లిమిటెడ్ విస్తరించింది.


1960 దశకంలో సహకార రంగంలోనూ అనేక షుగర్ ఫ్యాక్టరీలు వచ్చాయి. ప్రైవేట్ రంగంలో ఖండసారీ చక్కెర మిల్లులు ఉండేవి. లక్షలాది ఎకరాలలో రైతులు చెరకు పంట పండించేవారు. వేలాది శ్రమ జీవులకు కూలిపని దొరికేది. వేలమంది కార్మికులు చక్కెర పరిశ్రమలో ఉపాధి పొందేవారు. బెల్లం కూడా విస్తృతంగా తయారయ్యేది.


1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టాక తెలంగాణ రాష్ట్రంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. ఇప్పుడు అతి తక్కువ ఫ్యాక్టరీలు మాత్రమే మన రాష్ట్రంలో మిగిలాయి. అవి పూర్తిగా ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. నాటుసారా వినియోగానికి బెల్లం ఉపయోగిస్తున్నారనే పేరున రాష్ట్రంలో బెల్లం ఉత్పత్తిని నిషేధించారు. దశాబ్దాల పాటు చెరకు పండించిన రైతులు ఫ్యాక్టరీలు మళ్ళీ తెరవాలని సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి అలసిపోయి ఇతర పంటల వైపు మళ్లిపోయారు. కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.


ఇప్పుడు రాష్ట్ర ప్రజల గృహ అవసరాలకు, ఇతర వాణిజ్య అవసరాలకు చక్కెర, బెల్లం ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ, NAARM సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజల ఆహార ఉత్పత్తుల వినియోగాన్ని, వారి ఆహార అలవాట్ల ప్రాతిపదికన అధ్యయనం చేసి 2017లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున నెలకు 890 గ్రాములు చక్కెర వినియోగిస్తున్నారు. సగటున మనిషికి నెలకు కిలో చక్కెర వినియోగం అంచనా వేసుకుని చూస్తే, రాష్ట్ర ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో జనాభా 3,75,00,000 కాబట్టి, సంవత్సరానికి సుమారు 4,50,000 టన్నుల చక్కెర అవసరం. సుమారుగా టన్ను చెరకుకు 10 శాతం రికవరీ రేటు చొప్పున క్వింటాలు (100 కిలోల) చక్కెర వస్తుంది. అంటే 4,50,000 టన్నుల చక్కెర కోసం 45,00,000 టన్నుల చెరకు అవసరం.


కానీ మన రాష్ట్రంలో చెరకు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతున్నది. 2020–21 సంవత్సరంలో కేవలం 23,25,000 టన్నుల చెరకు మాత్రమే పండింది. రాష్ట్ర అవసరాల కోసం కనీసం రెండు లక్షల ఎకరాలలో చెరకు పంట పండించాల్సి ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో చెరకు వేసి, మనం ఎంత చక్కెర ఉత్పత్తి చేసినా, ఎగుమతి చేసే అవకాశాలు కూడా తక్కువే. అంతర్జాతీయ మార్కెట్‌లో క్వింటాలు చక్కెర ధర చాలా తక్కువగా 2500–3000 రూపాయల మధ్య మాత్రమే ఉంటున్నది.


నిజానికి చెరకు నుండి చక్కెర ఉత్పత్తితో చక్కెర కర్మాగారాలకు పెద్దగా మిగులు ఏమీ ఉండదు. చెరకు రైతులకు చెల్లించే ధర, ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులలో కొంత భాగం మాత్రమే చక్కెర అమ్మకాల ద్వారా వస్తుంది. చెరకు క్రషింగ్‌లో వెలువడే మొలాసిస్, చెరుకు పిప్పి, ప్రెస్‌మడ్ లాంటి ఉప ఉత్పత్తుల ద్వారా మాత్రమే కంపెనీలకు నిజంగా లాభం వచ్చేది. ఈ ప్రక్రియలో భాగంగానే ఇథనాల్ తయారీ యూనిట్లు కూడా చక్కెర ఫ్యాక్టరీలకు అనుబంధంగా ఉంటే మాత్రమే ఆ ఫ్యాక్టరీ నిర్వహణ నష్టాలు లేకుండా ఉంటుంది. అలా అని ఇథనాల్ ఉత్పత్తి కోసమే చెరకు పండించాలనుకున్నా, మన దగ్గర సాగు నీళ్ళు చాలా ఖరీదైనవి కాబట్టి అది కూడా సుస్థిరమైనది కాదు. అందుకే మనం పొదుపుగా మన రాష్ట్ర అవసరాల మేరకే చెరకు పండించుకోవాల్సి ఉంటుంది.


దేశ వ్యాప్తంగా సగటు చెరకు దిగుబడిలో కూడా తీవ్ర వ్యత్యాసాలున్నాయి. తమిళనాడులో అత్యధికంగా హెక్టారుకు 101.5 టన్నుల దిగుబడి ఉంటే, మధ్యప్రదేశ్‌లో కేవలం 59.5 టన్నులు మాత్రమే ఉంది. అఖిల భారత సగటు కూడా హెక్టారుకు 77.9 టన్నులు మాత్రమే. చక్కెర సగటు రికవరీలో కూడా వ్యత్యాసం ఉంది. ఒక క్వింటాలు చెరకు నుండి వచ్చే చక్కెర శాతాన్ని రికవరీ శాతం అంటారు. ఉత్తరప్రదేశ్‌లో సగటు రికవరీ 9.2 శాతం కాగా, బిహార్‌లో 6.1 శాతం మాత్రమే. అఖిల భారత సగటు 10.88 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో సగటు రికవరీ 7.1 శాతంగా ఉంది. చక్కెర రికవరీ ఆధారంగానే రైతులు సరఫరా చేసే చెరకుకు ధర చెల్లిస్తారు. 


ఉదాహరణకు 2021–22 సంవత్సరానికి 10 శాతం రికవరీ రేటు ఉన్న చెరకుకు క్వింటాలుకు 290 రూపాయలు FRP (fair and remunarative price)గా ప్రకటించారు. అంటే టన్ను చెరకుకు 100 కిలోల చక్కెర వస్తే అప్పుడు రైతుకు టన్నుకు 2900 రూపాయలు ధరగా చెల్లిస్తారు. రికవరీ రేటు పెరిగిన కొద్దీ ప్రతి 0.1 శాతానికి 2.90 రూపాయలు అదనంగా చెల్లిస్తారు. రికవరీ రేటు తగ్గిన కొద్దీ ప్రతి 0.1 శాతానికి ధరలో 2.90 రూపాయలు తగ్గుతుంది. ప్రస్తుతం జాతీయ సగటు 10.88 శాతం ఉంది కనుక, అంత రికవరీ రేటు వచ్చిన షుగర్ ఫ్యాక్టరీలలో రైతులకు క్వింటాలుకు 315.5 రూపాయలు, టన్నుకు 3155 రూపాయలు ధర వచ్చే అవకాశం ఉంది.


మన దేశంలో సాధారణంగా చెరకుకు ధర నిర్ణయించి చెల్లిస్తారు కానీ, కొన్ని దేశాలలో చక్కెర అమ్మకం, మొలాసిస్ అమ్మకం ద్వారా వచ్చే మొత్తం రెవెన్యూలో కూడా రైతులకు వాటా పంచుతారు. థాయిలాండ్‌లో చక్కెర అమ్మకం ద్వారా ఆదాయంలో 70 శాతం, ఫిలిప్పీన్స్‌లో 70 శాతం, ఇండోనేషియాలో 66 శాతం, ఆస్ట్రేలియాలో 67 శాతం రైతులకు చెల్లిస్తారు. అమెరికాలో చక్కెర, మొలాసిస్ కలిపి వచ్చే అమ్మకాల ఆదాయంలో 63 శాతం, దక్షిణాఫ్రికాలో 64 శాతం, ఫిజీ దేశంలో 75 శాతం రైతులకు చెల్లిస్తారు. బ్రెజిల్‌లో చక్కెర, ఇథనాల్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో – చక్కెర ఆదాయంలో 59.5 శాతం, ఇథనాల్ ఆదాయంలో 62.1 శాతం రైతులకు చెల్లిస్తారు. అటువంటి పద్ధతి మన దగ్గర కూడా అమలు చేయాలి.


ప్రతి సంవత్సరం చెరకు సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. అయితే ఎఫ్‌ఆర్‌పి ప్రకటించేటప్పుడు స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు సమగ్ర ఉత్పత్తి ఖర్చులు (సి2) కాకుండా పంట సాగు ఖర్చులు (ఏ2 +ఎఫ్‌ఎల్) ఆధారంగా ఎఫ్‌ఆర్‌పి ప్రకటిస్తున్నారు. దీని వల్ల రైతు సాగు భూమికి, రైతు పొలంపై స్థిర పెట్టుబడికి ఏ విలువా కట్టడం లేదు.


తెలంగాణ రాష్ట్రంలో చెరకు సాగు చేయడానికి అవసరమైన భూములు ఉన్నాయి. సాగు నీరు కూడా గతంలో కంటే ఎక్కువగా అందుబాటులో ఉంది. మన వాతావరణానికి అనువుగాని ఆయిల్ పామ్ లాంటి పంటల సాగును ప్రోత్సహించడం మానేయాలి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా చెరకు సాగును చేపట్టవచ్చు. మిగిలిన పంటలతో పోల్చినప్పుడు చెరకు సాగుకు ఎక్కువ నీరు అవసరమైనప్పటికీ, ఆయిల్ పామ్ సాగుకు అవసరమైనంత నీళ్ళు పట్టవు. పైగా చెరకు సంవత్సరం లేదా 16 నెలల పంట. మన రాష్ట్ర చక్కెర, బెల్లం అవసరాలకు అనుగుణంగా చెరకు పండించుకుని స్థానిక మార్కెట్‌లో ఒక బ్రాండ్‌గా అమ్ముకోవచ్చు.


దశాబ్దాల నాటి నుంచీ చెరకు పండుతున్న జిల్లాలలో రైతులను ప్రోత్సహించి మళ్ళీ చెరకు సాగుకు మళ్లించవచ్చు. రాష్ట్ర సలహా ధర, లేదా ఉప ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో రైతులకు తగిన వాటా ప్రాతిపదికన రైతులకు ధర చెల్లించవచ్చు. మన రాష్ట్రంలో చెరకు సాగుకు అవుతున్న సమగ్ర ఉత్పత్తి ఖర్చులను లెక్కించడం ద్వారా, రైతులు నష్టపోకుండా ధర ప్రకటించాలి. ప్రభుత్వ రంగంలో లేదా సహకార రంగంలో ఆయా జిల్లాలలో చెరకు ఫ్యాక్టరీలను నెలకొల్పాలి. జహీరాబాద్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొనసాగించాలి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ యంత్రాలు ఇప్పుడు చెరకు క్రషింగ్‌కు పనికి రాకపోవచ్చు. అదే ప్రాంతంలో మళ్ళీ కొత్త పరిశ్రమను నెలకొల్పాలి.


చక్కెర పరిశ్రమ రంగంలో వచ్చిన నూతన టెక్నాలజీని అంది పుచ్చుకుని కొత్త పరిశ్రమలను నెలకొల్పాలి. సారంగాపూర్ ఎన్‌సి‌ఎస్‌ఎఫ్‌ను సహకార రంగంలో ఆధునిక యంత్రాలతో పునరుద్ధరించాలి. అన్ని చోట్లా చెరకు నుండి వచ్చే ఉప ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పాలి. మొలాసిస్, ప్రెస్‌మడ్, బగాస్ (చెరకు పిప్పి) లాంటి ఉప ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధరలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో ఇథనాల్ ఉత్పత్తికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకుని పెట్రోలియం ఉత్పత్తుల కోసం సరఫరా చేయాలి. బెల్లం ఉత్పత్తిపై నిషేధం పూర్తిగా ఎత్తేయాలి. రైతులు బెల్లం వండి మార్కెట్ చేసుకునేలా ప్రోత్సహించాలి. చెరకు రైతుల సహకార సంఘాలను పునరుద్ధరించి, వాటి ఆధ్వర్యంలో రైతులు చెరకు సాగు చేయడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చాలి. చెరకు రైతులకు అవసరమైన పెట్టుబడులను బ్యాంకుల నుండి పంట రుణాలుగా ఇప్పించాలి.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2022-07-05T06:45:10+05:30 IST