రైల్వే ట్రాక్‌లపై ‘ఆత్మహత్య విన్యాసాలు’... యూట్యూబర్ అరెస్ట్...

ABN , First Publish Date - 2021-07-25T19:00:41+05:30 IST

బాంద్రా గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆదివారం

రైల్వే ట్రాక్‌లపై ‘ఆత్మహత్య విన్యాసాలు’... యూట్యూబర్ అరెస్ట్...

ముంబై : బాంద్రా గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆదివారం యూట్యూబర్‌ ఇఫ్ఫీ ఖాన్‌ను అరెస్టు చేశారు. రైల్వే ట్రాక్‌లపై ‘ఆత్మహత్య విన్యాసాల’ను ప్రేరేపించే వీడియోలను ఆయన ప్రమోట్ చేస్తున్నట్లు ఆరోపించారు. బాంద్రా-ఖార్ రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు పట్టాలపై ఈ వీడియోను శుక్రవారం చిత్రీకరించారని, శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారని తెలిపారు. 


ఓ సోషల్ మీడియా యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేయడంతో గవర్నమెంట్ రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇఫ్పీ ఖాన్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు జీఆర్‌పీ కమిషనర్ కైజర్ ఖలిద్ చెప్పారు. తన ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలకు పాల్పడటం, ఆదేశాలను ఉల్లంఘించడం, రెచ్చగొట్టే ఉద్దేశంతో ఏదైనా స్టేట్‌మెంట్‌ను ప్రచురించడం లేదా సర్క్యులేట్ చేయడం వంటి ఆరోపణలను నమోదు చేసినట్లు తెలిపారు. 


ఇఫ్పీ ఖాన్ మాట్లాడుతూ, తాను ఇటువంటి స్టంట్ వీడియోను తొలిసారి చేశానని, తన ఆన్‌లైన్ ఫాలోయర్లను పెంచుకోవడం కోసం దీనిని రూపొందించానని తెలిపారు. తనపై కేసు నమోదుకావడంతో ఆయన ఈ వీడియోను డిలీట్ చేసి, పోలీసులకు, తన ఫాలోయర్లకు క్షమాపణ చెప్తూ ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు. 


Updated Date - 2021-07-25T19:00:41+05:30 IST