గోడ వివాదం నేపథ్యంలో మనస్తాపం

ABN , First Publish Date - 2021-05-07T04:25:43+05:30 IST

ఇంటి పక్కన నిర్మిస్తున్న ప్రహరీ విషయంలో సింగరేణి అధికారులతో ఏర్పడిన వివాదం నేప థ్యంలో తన తండ్రి ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న భయంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్నది

గోడ వివాదం నేపథ్యంలో మనస్తాపం
ఆసుపత్రిలో బాలిక మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

తండ్రి ఉద్యోగం పోతుందేమోనని కూతురు మనోవేదన

బాత్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్య

రుద్రంపూర్‌లో ఘటన

చుంచుపల్లి, మే 6 : ఇంటి పక్కన నిర్మిస్తున్న ప్రహరీ విషయంలో సింగరేణి అధికారులతో ఏర్పడిన వివాదం నేప థ్యంలో తన తండ్రి ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న భయంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన చుంచుపల్లి మండలంలో గురువారం జరిగింది. కొత్తగూడెం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సైమన్‌ అనే వ్యక్తి చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో 40 ఏళ్లుగా నివసిస్తున్నాడు. వారి నివాస స్థలానికి పక్కనే ఉన్న ఖాళీ జాగాను కొనుగోలుచేసి ప్రహరీ నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఇది గమనించిన కొత్తగూడెం సింగరేణి ఏరియా ఎస్టేట్‌ అధికారులు, సిబ్బంది ఆ నిర్మాణాలను కూల్చివేయాలని, తమ స్థలంలో అక్రమ కట్టడాలు చేయొద్దని సూ చించారు. దీంతో ఇంటి యజమానికి, సింగరేణి అధికారులకు మధ్య వివాదం ఏర్పడింది. విషయం కాస్తా కొత్తగూడెం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లగా పోలీసులు ఇరు వర్గాలను వారం క్రితం స్టేషన్‌కు పిలిపించి సముదాయించి పంపించారు. ఇంతలోనే సింగరేణి ఎస్టేట్‌ అధికారి ఇదే విషయమై కొత్తగూడెం డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారని తెలుసుకున్న సైమన్‌ కూతురు షారోన్‌ (16) మనోవేదన చెందుతోంది. ఎక్కడ ఈ గోడ వివాదంలో తన తండ్రి, తా ము పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని, ఇదే విషయంలో తన తండ్రి ఉద్యోగం ఎక్కడ పోతుందోనని భయంతో గురువారం బాత్‌ రూమ్‌లో ఉరి వేసుకొందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారని తెలిపారు. ఈ సంఘటనపై టూ టౌన్‌ సీఐను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, వారం రోజుల క్రితం ఇరువర్గాలను పిలిపించి జరిగిన సంఘటనపై వివరాలు సేకరించి వారిని సముదాయించి పంపించామని తెలిపారు. ఇంతలో బాలిక ఆత్మహత్య చేసుకుందని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-05-07T04:25:43+05:30 IST