Advertisement

అప్పులకు బలైపోయిన అన్నదాత

Sep 16 2020 @ 00:53AM

ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం

బొజ్జన్నపేటలో విషాదం


నర్సింహులపేట, సెప్టెంబరు 15:  అప్పుల బాధతో మరో రైతు ఉసురు తీసుకున్నాడు.  మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామానికి చెందిన రైతు ఇస్సంపెల్లి వీరమల్లు(35) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ నెల 10న పురుగుల మందు తాగాడు.   కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడు.  వీరమల్లు తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ సంవత్సరం ఎకరంన్నరలో పత్తి, అర ఎకరంలో వరి, మరో అర ఎకరంలో మిర్చి సాగు చేశాడు. అనేక సంవత్సరాలుగా వ్యవసాయంలో ఆశించిన దిగుబడి లేకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారి అప్పులు చేశాడు. దీనికి తోడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.


ఈ క్రమంలో అతడు చేసిన అప్పులు రూ.6.50 లక్షలకు చేరుకున్నాయి.  ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం తోడుకావడంతో తీవ్ర మనస్తాపం చెందిన వీరమల్లు ఈనెల 10న ఇంటివద్ద పురుగుల మందు తాగాడు.  ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే  ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొదుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు  ఎస్సై లావూడ్య నరేష్‌  తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement