సీతానగరం, మార్చి 27: ఇనుగంటివారి పేట గ్రామానికి చెందిన సిద్దే చంటి గాజుముక్కలు మింగి సీతానగరం పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆత్మహత్యాయత్నం చేసాడు. గ్రామానికి చెందిన సిద్దే సురేంద్ర, సిద్దే చంటి అన్నదమ్ములు. ఇద్దరూ మద్యం తాగి సొమ్ముల విషయమై తగువుపడ్డారు. సురేంద్ర.. భార్యతో 100కు కాల్ చేయడంతో ఫిర్యాదు చేయమని పోలీసులు తెలపడంతో చంటిపై వదిన కేసుపెట్టింది. అన్నదమ్ములను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని, ఇది పదిమందికి తెలియాలనే ఉద్దేశంతో దండోరా వేసే వ్యక్తిని తీసుకువచ్చి సీతానగరం బస్టాండ్‌సెంటర్‌లో చంటి దండోరా వేయించాడు. చంటి మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పి స్టేషన్ సమీపంలో ఉన్న వాహనంలోని గాజుముక్కలు తీసుకుని నోట్లో పోసుకుని మంచినీళ్లు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతనిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ విషయమై సీఐ పవన్‌కుమార్‌ను వివరణ కోరగా అన్నదమ్ములు మద్యం తాగి గొడవపడ్డారని, వదిన కేసుపెట్టడంతో తనకు అన్యాయం జరిగినట్టు భావించి దండోరా వేయించగా ఇద్దరినీ ఆదుపులోకి తీసుకున్నామన్నారు. తర్వాత చంటి స్టేషన్ సమీపంలో ఉన్న కారు అద్దాల ఫైబర్ ముక్కలు మింగాడని ప్రాణాపాయం లేదని అన్నారు. ఎస్ఐ శుభశేఖర్ కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు.