తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-24T05:56:34+05:30 IST

తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంటి

మరిపెడ ట్రైబల్‌ గురుకుల స్కూల్లో ఘటన

మెరుగైన చికిత్స అందించండి : మంత్రి సత్యవతి

మరిపెడ రూరల్‌ (చిన్నగూడూరు), జూన్‌ 23: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో తొమ్మిదో తరగతి విద్యార్థి గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌.. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధి డక్నాతండాకు చెందిన బానోత్‌ నరేశ్‌-అరుణ దంపతుల కుమారుడు చంటి మరిపెడ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల తర్వాత సోమవారం గురుకులానికి చేరుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఆ విద్యార్థి గురువారం మధ్యాహ్నం డైనింగ్‌హాల్‌ వెనుక వైపునకు వెళ్లి కలుపు మందు తాగి .. నరేశ్‌ అనే టీచర్‌కు విషయం తెలిపాడు. వెంటనే ప్రిన్సిపాల్‌, టీచర్లు చంటిని మరిపెడ పీహెచ్‌సీకి తరలించారు. ఇక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మానుకోట ఏరియా ఆస్పత్రికి పంపించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు. తల్లి అరుణ ఫిర్యాదుతో మరిపెడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రిన్సిపాల్‌, టీచర్ల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు పురుగుల మందు తాగాడని తల్లిదండ్రులు నరేశ్‌-అరుణ బోరున విలపిస్తున్నారు. హాస్టల్‌ బయటికి వెళ్లి పురుగుమందు తెచ్చుకున్నా ఏ మాత్రం గుర్తించలేదని వారు ఆరోపించారు. కాగా బాలుడి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియల్సి ఉంది. 

Updated Date - 2022-06-24T05:56:34+05:30 IST