బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యం

ABN , First Publish Date - 2021-12-03T05:29:06+05:30 IST

మండల మహిళా సమాఖ్య భవనం పూర్తి చేసి పదేళ్లయినా బిల్లులు చెల్లించడం లేదని వారంలోగా చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఓ కాంట్రాక్టరు మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.

బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యం
బిల్లులు చెల్లించాలని ఐటీడీఏ అధికారులను కోరుతున్న కాంట్రాక్టర్‌

మండల మీట్‌లో ఓ కాంట్రాక్టర్‌ ఆవేదన

కొత్తపల్లి, డిసెంబరు 2: మండల మహిళా సమాఖ్య భవనం పూర్తి చేసి పదేళ్లయినా బిల్లులు చెల్లించడం లేదని వారంలోగా చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఓ కాంట్రాక్టరు మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ కుసుమలత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్తపల్లికి చెందిన చంద్రమోహన్‌రెడ్డి అనే గుత్తేదారు 2011లో ఎంపీ నిధులతో భవనం నిర్మిస్తే నేటికీ బిల్లులు చెల్లించడం లేదంటూ జిల్లా ఐటీడీఏ ప్రత్యేకాధికారి కేజిన నాయక్‌పై ధ్వజమెత్తారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద గోకులం షెడ్లు నిర్మించుకున్నప్పటికీ నేటికీ బిల్లులు చెల్లించలేదని సభ్యులు తెలిపారు. గిరిజన గూడేలలో చెంచులకు ఉపాధి పనులు లేక పస్తులు ఉన్నారని, గతంలో చేసిన పనులకు కూలీలు ఇవ్వలేదని గువ్వలకుంట్ల సర్పంచ్‌ మశమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా మంది గిరిజనులకు నేటికీ ఆధార్‌ కార్డులు లేక ప్రభుత్వ పథకాలు పొందడం లేదని ఆమె తెలిపారు. అలాగే ముసలిమడు గులో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీసీ ముబీనాబేగం తహసీ ల్దార్‌ను కోరారు. జడ్పీటీసీ సోముల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలను ఆయా శాఖల అధికారులు పరి ష్కరించాలన్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సభలో వివరించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి భవాని శంకర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో చంద్రశేఖర్‌, పీఆర్‌ఏఈ రామచంద్రయ్య, వైద్యాధికారులు వినోద్‌కుమార్‌, జగదీష్‌కుమార్‌, శ్రీనివాసులు, ఏపీఎం ఉమా మహేశ్వరి, ఏపీవో మద్దిలేటి, ఎంఈవో శ్రీరాములు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సువర్చల, మత్స్య శాఖ అధికారి భరత్‌లాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:29:06+05:30 IST