వేసవిలోనూ.. దోమల దాడి

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

పట్టణమైనా.. గ్రామమైనా మురుగు నీరు మాత్రం ముందుకు కదలటం లేదు. దీంతో దోమలు ప్రబలుతున్నాయి. సహజంగా వర్షాకాలంలోనే దోమలు ఎక్కువగా ఉంటాయి.

వేసవిలోనూ.. దోమల దాడి
చిలకలూరిపేట : ఎన్టీఆర్‌ కాలనీ ప్రత్తిపాటి బైపాస్‌ రోడ్డు పక్కన కాల్వలో పేరుకున్న వ్యర్థాలు

ముందుకు పారని మురుగే కారణం

కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం 

పడకేసిన పారిశుధ్యం

విజృంభిస్తున్న దోమలు 

అంటువ్యాధులకు గురవుతున్న ప్రజలు 

మూడు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి


సాధారణంగా వర్షాకాలంలో దోమల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వలు, కుంటలు నీటితో నిండి అవి దోమలకు ఆవాసాలుగా మారి వాటి సంతతి పెరుగుతుంది. వేసవి వచ్చేసరికి అలాంటి మురుగు కుంటలలో నిల్వలు ఎండిపోయి దోమల సంతతి, ఉత్పత్తి.. దోమల తీవ్రత తగ్గుతుంది. కానీ మూడు జిల్లాల్లో ప్రజానీకానికి వేసవిలోనూ దోమల దాడి తప్పడం లేదు. ఇందుకు పారిశుధ్యం పడకేయడమే ప్రధాన కారణం. ఏ పట్టణంలో చూసినా చెత్తకుప్పలు పేరుకుపోయి ఉంటున్నాయి. ప్రధాన రోడ్లలో సైతం కొబ్బరి బొండాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. కాలువల్లో పూడికతీత లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో దోమలు ప్రబలుతున్నాయి. మలేరియా సిబ్బంది ఇటీవల మలేరియా మాసోత్సవాలు, డెంగ్యూ నివారణ దినం నిర్వహించి ఫొటోలకు ప్రదర్శనలు ఇచ్చారే తప్ప ఇంటింటికీ తిరిగి ప్రజలకు దోమల నివారణ చర్యలపై అవగాహన కలిగించిన దాఖలాలు లేవు.

 

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, మే22: పట్టణమైనా.. గ్రామమైనా మురుగు నీరు మాత్రం ముందుకు కదలటం లేదు. దీంతో దోమలు ప్రబలుతున్నాయి.  సహజంగా వర్షాకాలంలోనే దోమలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎనీటైమ్‌ దోమల ఉత్పత్తి పెరుగుతోంది.  కాల్వలలో నిలిచిన మురుగునీటి నిల్వలలో దోమలు వృద్ధిచెంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఫాగింగ్‌ చేపట్టిన దాఖలాలు కూడా లేవు. కాల్వలలో పూడికలు తొలగించి బ్లీచింగ్‌ కూడా చల్లడంలేదు. కాల్వలలో మలాథియాన్‌ స్ర్పేయింగ్‌ కూడా చేయడం లేదు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలను మెరక చేయించడం, పిచ్చికంప తొలగించి ముందస్తుగా దోమల నివారణ చర్యలు చేపట్టడంపై అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులలోనే వర్షాకాలం రానుంది. ఇప్పటికే అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికైనా దోమల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది. గత ప్రభుత్వం వర్షాకాలానికి ముందే దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టి దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోగా ఇప్పుడు మాత్రం కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తీసేందుకు కూడా కష్టమైంది.   


నరసరావుపేటలో..

నరసరావుపేట పట్టణంలో సాధారణ వర్షానికే ప్రధాన రహదారులు సైతం మురికి కుపాలుగా మారుతున్నాయి. చిలకలూరిపేట రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి సెంటర్‌ నుంచి పాత చెక్‌పోస్టు వరకు ప్రధాన మురుగు కాలువ పూర్తిగా పూడిపోయింది. ఈ కాలువలో నీరు ప్రవహించే పరిస్థితిలేదు. పల్నాడు రోడ్డు నుంచి కత్తవ చెరువు వరకు ఉన్న ప్రధాన వరద నీటి కాలువ కూడా వివిధ ప్రాంతాల్లో పూడిపోయింది. క్లాప్‌ పథకాన్ని మునిసిపాల్టీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీని వలన పారిశుధ్యం మెరుగుపడిన దాఖలాలు లేవు.


బాపట్లలో..

బాపట్ల పట్టణంలో నిధులు ఉన్నప్పటికి కావాల్సినంత మంది శానిటరీ సిబ్బంది లేరు. 167మంది కాంట్రాక్ట్‌ కార్మికులు, 26మంది పర్మినెంట్‌ కార్మికులు మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. వీరిలో సగానికి మందికి జిల్లా కార్యాలయాల వద్ద, ప్రభుత్వ ఆఫీస్‌ల వద్ద, పట్టణంలో విలీనమైన పంచాయతీలలో పనులు చేయటానికి వెళుతున్నారు. ఫలితంగా పట్టణంలో అరకొరగానే శానిటేషన్‌ పనులు చేస్తున్నారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో తగినన్ని నిధులు లేకపోవటంతో శానిటేషన్‌ పనులు మొక్కుబడిగా చేస్తున్నారు. 


గుంటూరు నగరంలో...

 గుంటూరు నగరంలో పారిశుధ్యం పడకేసింది. రోడ్లు, డ్రైన్లు, కాలువల్లో చెత్తా, చెదారం పేరుకుపోతున్నాయి. పారిశుధ్యం అధ్వాన్నంగా మారడంతో దోమలు మరింతగా విజృంభిస్తున్నాయి. రోడ్ల కంటే డ్రైన్లు, కల్వర్టులు, పుట్‌పాత్‌లు ఎత్తులో నిర్మించడం వలన వర్షపునీరు పారుదల కాక ఆగిపోతున్నాయి. ఈ ఏడాది రూ.1.80 లక్షలు ప్రధాన డ్రైన్లలో పూడిక తీసేందుకు టెండర్‌ ప్రక్రియలో నిలిచిపోయాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డ్రైన్లు, కల్వర్టులలో చెత్తా చెదారం నిండి ఉండటంతో దోమల ఆవాస కేంద్రాలుగా అవి ఏర్పడ్డాయి. దీంతో దోమలు నానాటికి వృద్ధి చెందుతున్నాయి. గుంటూరు నగరంలో రెండు మలేరియా యూనిట్లు ఉండగా ఆయా యూనిట్లలో దోమల నివారణకు చేపడుతున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.  

 



- పొన్నూరు పట్టణంలోని శాంతి నగర్‌లో మురుగు నీటి పారుదల కాలువ పూడిక దశకు చేరుకుంది. డ్రైయిన్‌లో చెత్త చెదారాలు పేరుకుపోయి ఎక్కడ  నీరు అక్కడే నిలిచి ఉంటుంది. దీంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు విష జ్వరాలు బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.  

- రేపల్లె పట్టణంలో 28 వార్డులు ఉండగా కొన్ని వార్డులలో డ్రెయినేజీల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పూడుకుపోయి ఉన్నాయి. పట్టణంలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు గుంతలవద్ద కనీసం మున్సిపల్‌ అధికారులు బ్లీచింగ్‌, దోమల నివారణకు ఫాగింగ్‌ చేసిన దాఖలాలు లేవంటూ పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. 

- మాచర్ల పట్టణంలో చాలా వార్డులు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సైడు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం లేదు. గృహ అవసరాలకు వినియోగించిన నీరు రోడ్లపై చేరుతోంది.  ప్రధానంగా 14, 15, 16, 18, 21 తదితర వార్డుల్లో మురుగునీరు సమస్య అధికంగా ఉంది. 

- గురజాల నియోజకవర్గ పరిధిలో ఉన్న పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి పురపాలక సంఘాల్లో సైడ్‌ డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించటానికి సిబ్బంది సరిపడినంత లేకపోవటం వల్ల కాల్వల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థపదార్థాలతో నిండిపోతున్నాయి. పిడుగురాళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న సైడ్‌డ్రైన్లలో చెత్తాచెదారం పూర్తిగా తొలగించకపోవటంతో ఆ దారిగుండా వెళ్లేవారిపై దోమలు దండయాత్ర చేస్తాయి.  

- వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అధికభాగం గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రెయినేజీ కాలువలు నిండి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్నాయి. కాలువ పూడికతీత లేకపోవడంతో మురుగునీరు పారుదల ఎక్కడికక్కడే నిలిచిపోయి మురికికూపాలుగా దర్శనమిస్తున్నాయి.  వినుకొండ మున్సిపాలిటీలో పలువార్డుల్లో సందర్శిస్తే డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

- తెనాలి పట్టణంలో కాలువల్లో ఎక్కడి మురుగక్కడే ఉంటుంది. ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు పేరుకు పోయి ఉంటున్నాయి. ప్రధాన రోడ్లలో సైతం కొబ్బరి బొండాల గుట్టలు దోమలకు నిలయంగా మారుతున్నాయి. దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.దీని నివారణకు కనీసం కాలువల్లో ఏమన్నా మందులు పిచికారి చేస్తున్నారా అంటే అదీ లేదు. దోమల నివారణకు పిచికారి చేసే మందులు డబ్బాలు తగిలించుకున్న పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడా కనిపించడం లేదు.

- సత్తెనపల్లి పట్టణంలో మొత్తం 31 వార్డులకు గానూ 65వేలకు పైగా జనాభా ఉన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చిచెట్లు మొలిచి చెత్తాచెదారం ఉండటంతో అవి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. పురపాలక సంఘంలో దోమల నిర్మూలనకు రెండు పాగింగ్‌ మిషన్లు మాత్రమే ఉన్నాయి.   

- అద్దంకి పట్టణంలో మురుగు కాల్వల్లో పూడిక తీతపై పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో చిన్నపాటి వర్షం పడ్డా మురుగు మొత్తం రోడ్లపై గుండా ప్రవహిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నంబూరివారిపాలెం, సంజీవనగర్‌, పాతగాంధీబొమ్మసెంటర్‌, నగరపంచాయతీ కార్యాలయం రోడ్డు, రామ్‌నగర్‌ తదితర ప్రాంతాలలో మురుగు కాలువలు పొంగి ఇళ్ళలోకి, రోడ్లపై ప్రవహించింది. అద్దంకి పట్టణంలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని అద్దంకి మేజర్‌ కాలువలో గుండా ప్రవహించే మురుగుతో పలు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్లీచింగ్‌ కూడా ఎప్పుడో కార్యక్రమాలు జరిగితే మాత్రమే మొక్కుబడిగా చల్లుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  అత్యధిక గ్రామాలలో మురుగు కాలువలలో పూడిక తీత ఏడాదిలో ఒకటి రెండు సార్లు తీయటమే  గగనంగా మారింది. 


- చీరాల మున్సిపాలిటీలో సుమారు 24వేల గృహాలు ఉన్నాయి. సుమారు లక్ష మంది జనాభా ఉన్నారు. 33 వార్డుల్లోని ఆవాస ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 35 టన్నుల చెత్తవస్తుంది. ఈ చెత్తను వేటపాలెం మండలం రామాపురం శివారులోని సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కు తరలిస్తారు. వనరులు పుష్కలంగా ఉన్నప్పటికి శివారు ప్రాంతాలైన బలహీనవర్గాలకాలనీ, కుందేరు వెంట ఉంటే  నివాసాల ప్రాంతంలో పూర్తిస్థాయిలో పారిశుధ్య చర్యలు చేపట్టం లేదనే విమర్శలు ఉన్నాయి. కారంచేడు రోడ్డులో రోడ్డు మార్జిన్‌లలో చెత్తను పడేస్తున్నారు.  




Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST