వేసవి దుక్కులతో పంటలకు, రైతులకు ఎంతో మేలు

Published: Sun, 27 Mar 2022 22:59:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వేసవి దుక్కులతో పంటలకు, రైతులకు ఎంతో మేలుట్రాక్టర్‌తో వేసవి దుక్కులు దున్నుతున్న రైతు

- సాగుకు ముందస్తు ప్రణాళిక

- భూసార పరీక్షలు కీలకం

- అధిక ఎరువులతో అనర్ధాలు

వాంకిడి, మార్చి 27: మరో రెండు నెలల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. రైతాంగం ఇప్పటినుంచే సాగుకు సన్నాహాలు చేసుకుంటోంది. అయితే ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తే అధిక దిగుబడులు, మంచి లాభాలు పొందే అవకాశముంటుంది. భూసారపరీక్షలు, వేసవిదుక్కులు, చేను చదును, విత్తనాల ఎంపిక, విత్తనశుద్ధి, ఎరువుల వాడకం, పంటకు అనుగుణంగా భూమిని సిద్ధం చేయడం, తదితర ప్రణాళికలను ముందస్తుగా తయారు చేసుకుంటే పంట పండించడానికి అదే మంచి మందు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తొలకరి వర్షాలు పడేవరకు వేచిచూసి వానాకాలం పనులు ప్రారంభించుకునే కంటే ముందునుంచే సాగుకు సన్నద్ధమైతే సాగులో అధికదిగుబడులు సాధించవచ్చు. 

మొదళ్లను భూమిలో కలపడం

జిల్లాలో ఏటా పత్తి పంట దిగుబడి అనంతరం పత్తిమొదళ్లను కుప్పగా వేసి తగులబెడుతుంటారు. దీనిద్వారా సమయం వృథా కావడమే కాకుండా ఎటు వంటి లాభం లేకుండా పోతుంది. ఒక్కొక్క కర్రను పీకేస్తుంటారు. దీనికోసం కూలీలను సైతం పెడుతుంటారు. అయితే కూలీల సమస్య లేకుండా పత్తి మొదళ్లు వృథా పోకుండా చేయడానికి రోటవేటర్‌ సహాయంతో భుమిలో తేమఉన్నప్పుడు కలియదున్నాలి. తర్వాత మరోసారి రోటవేటర్‌తో దున్నాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమేకాకుండా పత్తి పంటకు కావాల్సిన కృత్రిమఎరువులను తగ్గించవచ్చు. ఈ పద్ధతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాత్రమే రైతులు ఆచరించి లాభం పొందు తున్నారు. 

లోతుగా దున్నడం మేలు

వానాకాలం సాగుకు ముందునుంచే పంట పొలాలను చదును చేసుకుని నెలరోజుల ముందు వేసవిదుక్కులు దున్నుకోవాలి. తొలకరికి ముందే పంట విత్తుకోవడానికి భూములను సిద్ధం చేసుకోవాలి. వేసవిలో లోతుదుక్కులు దున్నడం చాలా ఉపయోగం. 35-40సెంటీ మీటర్ల లోతుగా దుక్కి చేయడంవల్ల భూమిలో గట్టిపొర పగిలి నేల బాగా గుల్లబారుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. ఇంకిన నీరు భూమిలో నిలువ ఉండడంవల్ల పంట వేర్లు లోపలి పొరల్లో పెరిగి ఎక్కువ నీటిని, పోషకపదార్థాలను గ్రహించడానికి వీలవుతుంది. లోతు దుక్కి ప్రభావం 2-3 సంవత్సరాల వరకు ఉండడంతో పంటల దిగుబడులకు భూములు అనుకూలంగా ఉంటాయి.  

 భూసార పరీక్షలు

మనిషిలో వ్యాధి నిర్ధారణకు ఏ విధంగానైతే రక్త, మూత్రపరీక్షలు అవసరమో పంటకు కూడా భూసార పరీక్షలు అవసరమే. భూసార పరీక్షకు ముందు మట్టి నమూనాలు సరైన పద్ధతిలో తీసుకోవాలి. భూమిలో సారం ఎంతవరకు ఉంది. ఎలాం టి వ్తితనాలు, ఎంత మోతాదులో ఎరు వులు వాడాలి అనేది తెలుసుకోవడానికి భూసార పరీక్షలు కీలకం. అధిక దిగుబడికి పోటీ పడి ఎక్కువ మోతాదులో  ఎరువులు వేసి నష్టాలు కొనితెచ్చుకునే కంటే భూసార విలువలు తెలుకుని కాలానికి అనుగుణంగా పంటల సాగు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

సేంద్రియ ఎరువులు వాడకం

సేంద్రియ ఎరువులు నేలలో కుళ్లి ఖనిజ పొరలను అభివృద్ధిచేసి పంటకు అవసరమైన స్థూల,సూక్ష్మపోషకాలను అందిస్తాయి. రసాయనిక, భౌతిక,జీవగుణాలపై ప్రభావం చూపిస్తాయి. సేంద్రియఎరవుల్లో పశువులు, కోళ్లు, గొర్రెలు, వానపాముల ఎరువులను వేసి భూమిలో కలియదున్నాలి. సేంద్రియ పదార్థం వేయడంవల్ల భూమిగట్టి పడ కుండా గుల్లగా ఉంటుంది. నీరుబాగా ఇంక డం వల్ల భూమిలో తేమ గణనీయంగా పెరిగి విత్తనం బాగా మొలకెత్తుతుంది.

ప్రణాళికతో సాగుచేయాలి

- మిలింద్‌, వ్యవసాయ అధికారి

రైతులు ప్రణాళికతో సాగుచేస్తే అధికదిగుబడులు సాధించవచ్చు. వేసవిలో భూములను లోతుగా దున్నుకోవడంవల్ల పంటలను నాశనం చేసే క్రిములు చనిపోతాయి. ఖరీఫ్‌ ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే వేసవి దుక్కులు దున్నుకోవాలి. కొంత మంది రైతులు వర్షాకాలం సమీపించే వరకు పంటలను ఉంచుతున్నారు. వేసవి దుక్కులు దున్నడం లేదు. దీంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటలుసాగు చేసి అధికదిగుబడులు సాధించుకోవాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.