పని ప్రదేశంలో టెంటు సౌకర్యం లేకపోవడంతో చెట్ల కింద కూర్చున్న ఉపాధి కూలీలు
ఉపాధి కూలీలకు తప్పని వేసవి తిప్పలు
ఏడేళ్లుగా పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువు
మెడికల్ కిట్ మాట లేదు.. వేసవి భత్యం ఊసేలేదు
జహీరాబాద్, మార్చి27: జాతీయ ఉపాధిహామీ పథకంలో పనిచేసే కూలీలకు పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 5.44 లక్షల మంది కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ప్రభుత్వాలు ఉపాధి కూలీల కోసం పనిప్రదేశంలో ఎండ నుంచి ఉపశమనం పొందడానికి టెంట్లు ఏర్పాటు చేసింది. ఏడేళ్లుగా ఆ సౌకర్యాన్ని కల్పించడం లేదు. ఉపాధి కూలీలు పని చేసే ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కల్పించాలి. గతంలో తాగునీటిని అందుబాటులో ఉంచడానికి నలుగురు కూలీలను ప్రత్యేకంగా కేటాయించేవారు. ప్రస్తుతం అలా చేయకపోవడంతో కూలీలకు కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండడం లేదు.
మెడికల్ కిట్ జాడే లేదు..
ఉపాధి కూలీలు పనిచేసే సమయంలో ఎవరన్నా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపడిపోతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఏడేళ్లుగా పనిప్రదేశాల్లో మెడికల్ కిట్ సౌకర్యం లేదు. వాస్తవానికి పని ప్రదేశాల్లో ప్రతి శ్రమశక్తి సంఘానికి మెడికల్ కిట్‌ను సమకూర్చాలి. ఆ మెడికల్ కిట్లులో ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్స్ గాయాలైతే కట్టు కట్టేందుకు ప్రత్యేకంగా ఆయింట్మెంట్, కాటన్ ఉండాలి. ప్రస్తుతం అలాంటి సౌకర్యాలు లేవు.
సంగారెడ్డి జిల్లాలో ఉపాధి కూలీల వివరాలు
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 647 గ్రామపంచాయతీలకు 2.77 లక్షల జాబ్ కార్డులు మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5.44లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో నిత్యం 2.56 లక్షల మంది ఉపాధి పనులు చేస్తున్నారు.
వేసవి భత్యం లేదు
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ కూలీలకు ప్రతి వేసవిలో అదనపు భత్యం చెల్లించేంది. ప్రస్తుతం ఉపాధి కూలీలకు ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు వేసవిభత్యం ప్రకటించలేదు. యేటా వేసవిలో అదనంగా ఇచ్చే భత్యం వివరాలు ప్రభుత్వం జనవరిలోనే ప్రకటిస్తుంది. ఈసారి మార్చి పూర్తయినా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. అధికారులకు ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్యను పెంచాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. భత్యం పెంచకపోవడం వల్ల కూలీలు పనులకు రావడానికి ఇష్టపడటం లేదు. ఆర్థికసంవత్సరం ముగుస్తున్నా లక్ష్యం సాధించడం కష్టంగా మారింది. వేసవిలో ప్రభుత్వం అదనంగా ఇచ్చే భత్యాన్ని ఇవ్వకపోవడంతో పనులకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది.
సాఫ్ట్వేర్ మార్పు వల్లే
వేసవిలో ఉపాధి పనిదినాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు భత్యా న్ని అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒకరోజుకు గరిష్ఠంగా రూ.247 కూలి ఇస్తుంది. పనిచేసిన కూలీలు ఆరోజు పొందే కూలిలో ఫిబ్రవరిలో 20శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్, మేలో 30శాతం, జూన్‌లో 20శాతం అదనపు భత్యాన్ని చెల్లిస్తుంది. అయితే ఉపాధిహామీ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వరకు వినియోగించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో వేసవిలో అదనంగా ఇచ్చే భత్యం ఆటోమెటిక్‌గా అప్డేట్ చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఉత్తర్వులు వెలువరించలేదని ఉపాధి హామీ అధికారులు చెబుతున్నారు.
సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాం
- రాజు ఉపాధి కూలీ, పైడిగుమ్మల్ గ్రామం
ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతాల్లో నీటి సౌకర్యం నీడ సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కూలీలకు నీడ, తాగునీటి సమస్య ప్రధానంగా ఏర్పడుతుంది. దీంతో ఉపాధి పనులు చేయలేక పోతున్నారు. ప్రభుత్వం సఁందించి ప్రత్యేకంగా ఉపాధి పని ప్రదేశాలలో నీడ సౌకర్యంతో పాటు నీటి సౌకర్యాన్ని సమకూర్చాలి. అలాగే మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచితే బాగుంటుంది.