అగ్గి

ABN , First Publish Date - 2022-05-25T06:09:49+05:30 IST

అగ్గి

అగ్గి
బందరులో నిర్మానుష్యంగా రహదారి

జిల్లావ్యాప్తంగా మండుటెండలు, వేడిగాలులు

రెండు రోజులుగా 40 డిగ్రీల కంటే అధికంగా..

మంగళవారం మచిలీపట్నంలో 43.2 డిగ్రీలు నమోదు

రాత్రి ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలకు చేరిక

నేటి నుంచి రోహిణీ కార్తె 

జూన్‌ 7 వరకూ ఇదే పరిస్థితి


రోహిణీ కార్తెలో వేడికి రోళ్లు కూడా పగిలిపోతాయని నానుడి. కానీ, రోహిణీ రాకముందే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండగా, రోహిణీ ప్రవేశంతో బుధవారం నుంచి పరిస్థితి ఏమిటా..? అని జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. 

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : అధిక ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అత్యవసర పనులపై రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  గాలులు నలువైపుల నుంచి వీస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు  తట్టుకోలేకపోతున్నారు. రాత్రి సమయంలోనూ ఉష్ణోగ్రతలు 29 నుంచి 30 డిగ్రీల వరకు నమోదవుతుండగా, రాత్రి పది గంటలకు కూడా వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి.  బుధవారం నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుండటంతో ఎండల తీవ్రత మరింత అధికమవుతుందనే భయం జిల్లావాసులను వెంటాడుతోంది. 

నేటి నుంచి మరింత అధికం

రోహిణీ కార్తె బుధవారం నుంచి ప్రారంభమైౖ జూన్‌ 7వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ పది రోజులు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెనుమలూరులో బుధవారం 43.9, గురువారం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉంగుటూరులో బుధవారం 44.2, గురువారం 44 డిగ్రీలు, ఉయ్యూరులో బుధవారం 44.3, గురువారం 44.1 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొవ్వ, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంక, గూడూరు, మచిలీపట్నం, పామర్రు, పెదపారుపూడి, నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగత్రలు నమోదవుతాయని తెలిపింది.

జిల్లావ్యాప్తంగా అధిక ఉష్ణ్ణోగ్రతలు

రెండు రోజులుగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 42 డిగ్రీలు నమోదు కాగా, మంగళవారం 43.2కు చేరింది. గుడివాడలో 42, పెనుమలూరు, కంకిపాడులో 43, పెడనలో 43, గన్నవరంలో 43, పామర్రు, అవనిగడ్డలో 42 నుంచి 43 డి గ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటికి తోడు గాలులు వేడిగా వీచాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెండు రోజులుగా ఉదయం 10 గంటల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో సాయంత్రం 5 గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 




Updated Date - 2022-05-25T06:09:49+05:30 IST