బుగ్గి

ABN , First Publish Date - 2022-05-25T06:12:20+05:30 IST

బుగ్గి

బుగ్గి

జిల్లాలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు

గుడివాడలో గోదాము దగ్ధం

రూ.4.5 లక్షల ఆస్తినష్టం

చాగంటిపాడు లంకలో మొక్కజొన్న, అరటి నాశనం

మండుటెండలకే మంటలు చెలరేగాయని అనుమానం


మండుతున్న ఎండలకు తోడు అగ్ని ప్రమాదాలు కూడా భారీగా జరుగుతున్నాయి. జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల మంగళవారం అగ్ని ప్రమాదాలు సంభవించాయి. గుడివాడలోని ముబారక్‌ సెంటరులో ఉన్న పాత ఎలకా్ట్రనిక్‌ సామాన్ల గోదాములో జరిగిన ప్రమాదంలో రూ.4.5 లక్షల ఆస్తినష్టం జరగ్గా, తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు లంకల్లో జరిగిన ప్రమాదంలో మొక్కజొన్న, అరటి పంటలు బూడిదయ్యాయి. 


గుడివాడ/తోట్లవల్లూరు, మే 24 : గుడివాడలోని ముబారక్‌ సెంటరులో ఉన్న పాత ఎలక్టా్ట్రనిక్స్‌ గోదాముకు నిప్పు అంటుకోవడంతో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రూ.లక్షల్లో ఆస్తినష్టం సంభవించిందని అంచనా. గోదాము సమీపంలోని రెండు గడ్డివాములు, రెండు ఇళ్లకు నిప్పంటుకుంది. మంటలను అదుపు చేసేందుకు ఏడీఎఫ్‌వో ఆంజనేయులు నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేసి మంటలను అదుపు చేశారు.

చాగంటిపాడు లంకల్లో పంటలు నాశనం

తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు లంకల్లో మంగళవారం మిట్ట మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న బూడిదైపోయింది. 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం దావానలంలా కళ్లంవారిపాలెం లంక వరకు వ్యాపించింది. ఎక్కడ, ఎలా మంటలు           వ్యాపించాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వేడిగాలులకు తోడు లూజు కరెంటు తీగల నుంచి నిప్పురవ్వలు చెలరేగటం కానీ, లేక ఎవరైనా సిగరెట్‌ కాల్చి పడేయడం వల్ల కానీ ప్రమాదం జరిగి ఉండొచ్చని రైతులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో చాగంటిపాడు, కళ్లంవారిపాలెం ఎస్సీ సొసైటీల రైతుల పంటలు బూడిదయ్యాయి. 80 సెంట్లలో మొక్కజొన్న తోట పూర్తిగా కాలిపోయిందని రైతు పాముల శ్రీనుబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే, 80 సెంట్ల మొక్కజొన్న, 40 సెంట్ల అరటి తోటలు కాలిపోయి రూ.వేలల్లో నష్టం జరిగిందని రైతు గూడపాటి కోటేశ్వరరావు ఆవేదన చెందాడు. సమాచారం తెలుసుకుని వచ్చేలోపు మంటలు ఎగసిపడ్డాయని, తామేమి చేయలేకపోయామని వాపోయారు. ఇంకా చెరుకు, బొప్పాయి తోటలు సైతం కాలిపోయాయి. 

కనిపించని అధికారులు

నష్టాన్ని అంచనా వేయటానికి అధికారులెవరూ రాలేదు. దీంతో ఎన్ని లక్షల నష్టం జరిగిందనే విషయం లెక్క తేలలేదు. అధికారులు వచ్చి కాలిపోయిన పంటలను నమోదు చేసి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. 





Updated Date - 2022-05-25T06:12:20+05:30 IST