
సాయంత్రం వరకు వేడి వాతావరణం
ఆనందపురంలో 42.2 డిగ్రీలు
విశాఖపట్నం, మే 28 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రతకు నగర వాసులు ఠారెత్తిపోయారు. రెండు రోజుల నుంచి చల్లగా వున్న వాతావరణం శనివారం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉంది. దానికి ఉక్కపోత కూడా తోడైంది. ఇళ్లలో ఉన్న వారు కూడా ఇబ్బందిపడ్డారు. సాధారణంగా సాయంత్రానికి చల్లబడే నగరంలో శనివారం వేడిగాలులు వీచాయి. ఆనందపురంలో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మరో రెండు, మూడు రోజులు వుంటాయని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి. నగరంలో వాహన, పారిశ్రామిక కాలుష్యం పెరగడం కూడా రానురాను వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.