నిప్పుల కొలిమే!

ABN , First Publish Date - 2022-05-23T06:15:20+05:30 IST

గతవారం నుంచి వేసవి తీవ్రత తారాస్థాయికి చేరుకోవడంతో ఎండలు అదిరిపోతున్నాయి.

నిప్పుల కొలిమే!

 వడదెబ్బతో ప్రాణాలకు హాని

  వేసవిలో జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు 

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) 

గతవారం నుంచి వేసవి తీవ్రత తారాస్థాయికి చేరుకోవడంతో ఎండలు అదిరిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగభగమండుతూ తన ప్రతాపాన్ని చూపిస్తుండంతో బయట వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది.  మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో ఏసీలు, కూలర్లు వంటివి పెట్టుకోలేని సామాన్యులు వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. మండే ఎండలతోపాటు వడగాడ్పులు కూడా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఎండలో పనిచేసే కూలీలు, తప్పనిసరి పరిస్థితుల్లో బయట తిరిగేవారు, ప్రయాణికులు పడు తున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఎండలో తిరిగి వడదెబ్బకు గురైతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిర ్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్ని సందర్భాల్లో వడ దెబ్బకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  

వేడివల్ల అనారోగ్య సమస్యలు 

అధిక ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో తేమశాతం బాగా పెరిగిపోతుంది. ఎండలోకి వెళితే శరీర ఉష్ణోగ్రతలు పెరిగేలా చేస్తుంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ దాటితే ప్రజలు అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉంది. వేసవి బారినపడినవారు సాధారణంగా తలనొప్పి, చర్మవ్యాధులు, మూత్రకోశ వ్యాధులతో బాధపడుతుంటారు. నాడీ వ్యవస్థ, రక్తనాళాలు సహజ స్థితిని కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో జీవక్రియలు పనిచేయకుండా పోతాయి. వేసవి ఉష్ణోగ్రతల వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వచ్చి అవిరైపోవడమే ఇందుకు కారణం. వేసవి వేడి వల్ల మనిషి త్వరగా అలసటకు గురవుతారు. కళ్లు తిరగడం, కాళ్లు లాగడం, కడుపునొప్పి, వికారం, వాంతులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఈ వేసవిలో ఎండ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ప్రయాణాల్లో జాగ్రత్త సుమా! 

వేసవిలో అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. నగరాలు, పట్టణాల్లో విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఇతర పనులపై తిరిగేవారు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. సామాన్యులు, పేదలు ఎక్కువగా కిక్కిరిసిన బస్సుల్లోను, రైళ్లలోను ప్రయాణం చేసేటప్పుడు నరకమే కనిపిస్తుంటుంది. రోడ్లపై ఆటోలు, ఇతర స్టేజి క్యారియర్లు, ఎండలో బైక్‌లపై ప్రయాణాలు చేసేవారు ఎండ బారిన పడకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. పగటి పూట ఎర్రటి ఎండలో తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సివస్తే.. ఏడాదిలోపు వయసున్న పిల్లలు, వృద్ధుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

వడదెబ్బకు గురైనప్పుడు.. 

వడదెబ్బకు గురైనవారిని తక్షణమే సమీపలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లి తక్షణ వైద్యసేవలందించాలి. వడగాల్పులు వీచేటప్పుడు ఎక్కువగా మంచినీళ్లు తాగడం చాలా అవసరం. వేసవిలో శరీరాన్ని అతిగా కష్టపెట్టే వ్యాయామాలు చేయకూడదు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు నీడలోకి లేదా చల్లని ప్రదే శాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి. వేసవిలో తేలికైన, లేదరంగు దుస్తులు ధరించాలి. సాధ్యమైనంత వరకు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందే చర్యలతో అనారోగ్య సమస్యల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.   పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల చాలా వ్యాధులు దూరమవు తాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

ఆహారం విషయంలో.. 

వేసవిలో ఆహారం విషయంలోనూ తగిన మార్పులు చేసుకుని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకునేందుకు వేసవిలో ఎక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఆయిల్‌ ఫుడ్‌ తినడం మంచిది కాదు. తేలికపాటి ఆహారం తిని మజ్జిగ, పళ్లరసాలు, కొబ్బరినీళ్లు వంటివి తరచూ తాగుతుండాలి. పెరుగు, మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు మంచి పౌష్టికాహారంగా పనిచేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. 


Updated Date - 2022-05-23T06:15:20+05:30 IST