వేసవి నుంచి ఉపశమనం పొందడానికి.. తీసుకోవల్సిన జాగ్రత్తలు!

ABN , First Publish Date - 2022-04-09T16:51:43+05:30 IST

రోజురోజుకీ ఉష్ణతాపం పెరుగుతోంది. వేసవిలో శరీరం త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలెక్కువ. ఇసుమంత నిర్లక్ష్యం చూపించినా ఇబ్బందే. వేసవి బారి నుంచి ఉపశమనం పొందాలంటే...

వేసవి నుంచి ఉపశమనం పొందడానికి.. తీసుకోవల్సిన జాగ్రత్తలు!

రోజురోజుకీ ఉష్ణతాపం పెరుగుతోంది. వేసవిలో శరీరం త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలెక్కువ. ఇసుమంత నిర్లక్ష్యం చూపించినా ఇబ్బందే. వేసవి బారి నుంచి ఉపశమనం పొందాలంటే...


దప్పిక ఉంటే సరి మంచి నీరు తాగాలి. చెమట రూపంలో త్వరగా నీరు బయటకు పోతుంది కాబట్టి మిగతా కాలాలకంటే వేసవిలో నీరు శరీరానికి అవసరం. నీరు తాగకపోతే మూర్ఛపోవడం లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో నీటిశాతం తగ్గిపోతే డీహైడ్రేషన్‌కి గురవుతారు. అందుకే నీటిని తాగడంలో జాగ్రత్త వహించాలి.  అలాగని అతి చల్లని నీటిని తాగటం కూడా శ్రేయస్కరం కాదు. 


కలుషిత నీరు తాగితే డయేరియా, మలేరియా లాంటి వ్యాధులు వేసవి కాలంలో త్వరగా వ్యాపిస్తాయి. కూరగాయలు, పండ్లు మంచినీటితో కడిగి తినాలి. వేసవిలో శరీరానికి వేడి చేసే పదార్థాలు తినకూడదు. నాన్‌వెజ్‌తో పాటు మసాలా కూరలు తగ్గించాలి. పీచుపదార్థం ఉండే ఆహారం తీసుకోవాలి. అధికంగా ఆహారం తీసుకున్నా.. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే నీటిశాతం ఎక్కువ ఉండే వాటర్‌మెలన్‌, కర్భూజలాంటి సీజనల్‌ ఫ్రూట్స్‌ తినాలి. తాజా కూరగాయలు, మజ్జిగ, సిట్రస్‌ పండ్లు(నిమ్మరసం, నారింజ), పెరుగన్నం తినటం మంచిది.


కళ్లు ఎర్రబడటం, కళ్లు తిరగటం, శ్వాసకోస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే చక్కని డైట్‌తో పాటు చేపలు, కోడిగుడ్లు, ఆకుకూరలు తినాలి. కాఫీ, టీలను తగ్గించాలి. చర్మంపై పొక్కులు, చెమటకాయల సమస్య వేధించే అవకాశం ఉంది. ఏమాత్రం చర్మం అబ్‌నార్మల్‌గా అనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.


శరీరంలో వేడి అధికంగా ఉంటే తలతిరగడం, పల్స్‌ పడిపోవటం జరుగుతుంది. అందుకే వీలైనంత వరకూ ఎండలో తిరగకుండా ఉండటం మంచిది. ఎండలో తిరిగితే ఏమీ కాదని తక్కువ అంచనా వేస్తే వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రాణాలకే ముప్పు.


పసిపిల్లలు, వయసుపైబడిన వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మండుటెండలో ఇంటి నుంచి బయటకు కదలకపోవడమే మంచిది.


సూర్యకిరణాలు పడితే నాజూకు చర్మం ఎర్రబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యువి కిరణాల వల్ల చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. ఇలా చర్మం సన్‌బర్న్‌కి గురి కాకుండా ఉండాలంటే లోషన్స్‌ కచ్చితంగా వాడాలి. దీనివల్ల ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది.


చల్లని ప్రదేశంలో ఉండటంతో పాటు కాటన్‌ దుస్తులను ధరించాలి. తీవ్రమైన ఒత్తిడికి గురికాకుండా కూల్‌గా ఉండటానికి కూడా ప్రయత్నించాలి. అప్పుడే ఎండాకాలంలో ప్రశాంతమైన జీవితం గడుపుతాం. 

Updated Date - 2022-04-09T16:51:43+05:30 IST