సోనియా, రాహుల్‌కు సమన్లు

ABN , First Publish Date - 2022-06-02T08:14:03+05:30 IST

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) సమన్లు జారీ చేసింది.

సోనియా, రాహుల్‌కు సమన్లు

మనీ లాండరింగ్‌ కేసులో ఇద్దరినీ ప్రశ్నించనున్న ఈడీ

నేడు రాహుల్‌ గాంధీ, 8న సోనియాగాంధీ విచారణ

బూటకపు కేసులతో ఏమీ సాధించలేరు

సమన్లకు భయపడే ప్రసక్తే లేదు: కాంగ్రెస్‌

విచారణ సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయ్‌

తప్పు చేయకుంటే భయపడొద్దు: బీజేపీ


న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) సమన్లు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో వారిద్దరినీ ప్రశ్నించనున్నట్టు బుధవారం జారీ చేసిన ఆ సమన్లలో ఈడీ పేర్కొంది. రాహుల్‌ గురువారం, సోనియా ఈనెల 8వ తేదీన ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని అందులో స్పష్టం చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద వారిద్దరి వాంగ్మూలాలూ నమోదు చేయనున్నట్టు తెలిపింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నించనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. కాగా, ఈ చర్యను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి సమన్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు తలవంచబోమని పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఇతర సమస్యల నుంచి దేశం దృష్టి మళ్లించేందుకే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి అసహ్యకరమైన, పిరికిపంద కుట్రను పన్నిందని ఆక్షేపించింది. పార్టీ మొత్తం, కార్యకర్తలందరూ నాయకత్వం వెంట ఉన్నారని తెలిపింది. కాగా, తప్పు చేయకపోతే భయపడవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయని పేర్కొంది. మరోవైపు నేరస్థుడు ఎప్పటికీ నేరస్థుడినని చెప్పడని బీజేపీ ఎద్దేవా చేసింది. 



సోనియా ఓకే.. రాహుల్‌కు తేదీ మార్చాలి!

ఈడీ పేర్కొన్న తేదీన సోనియా విచారణకు హాజరవుతారని, రాహుల్‌గాంధీ ప్రస్తుతం దేశంలో లేనందున గురువారం ఈడీ ఎదుట హాజరుకాలేరని కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వీ, రణదీప్‌ సూర్జేవాలా ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 5 తర్వాత ఏదైనా తేదీని నిర్ణయించాలని కోరుతూ ఈడీకి రాహుల్‌ లేఖ రాశారని పేర్కొన్నారు. 


ఏమిటీ కేసు..?

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఆస్తులను ఆయాచితంగా పొందారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. మాజీ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇతర స్వాతంత్ర సమరయోధులు కలిసి 1938లో ఈ పత్రికను స్థాపించారు. దీని ప్రచురణ సంస్థ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌)కు హిందీ, ఉర్దూలలోనూ మరో రెండు పబ్లికేషన్లు ఉన్నాయి. రూ.90 కోట్లకు పైగా అప్పులు పేరుకుపోవడంతో 2008లో ఈ పత్రిక మూతపడింది. ఒక పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ(ఏజేఎల్‌)ని ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ(యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌-వైఐఎల్‌) ద్వారా సొంతం చేసుకున్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఏజేఎల్‌ బకాయి పడిన రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందడానికి వైఐఎల్‌ ద్వారా రూ.50 లక్షలు చెల్లించి.. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగానికి వీరు పాల్పడ్డారన్నారు. ఇదే కేసులో కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్‌ బన్సల్‌లను ఈడీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రశ్నించింది. ఖర్గే వైఐఎల్‌కు సీఈవో కాగా, బన్సల్‌ ఏజేఎల్‌కు ఎండీగా ఉన్నారు. కాగా, ఇలాంటి బూటకపు, కల్పిత కేసులు నమోదు చేయడం ద్వారా ఏమీ సాధించలేరనే విషయాన్ని మోదీ ప్రభుత్వం తెలుసుకోవాలని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ పేర్కొన్నారు. 2015లోనే ఈ కేసును ఈడీ మూసివేసిందని, అయితే, అప్పటి అధికారులను ప్రభుత్వం తొలగించి, కొత్త అధికారులను తీసుకొచ్చి, కేసును తిరిగి తెరిపించిందన్నారు. కాగా, 1942లో ఈ పత్రికను ప్రారంభించారని, ఆ సమయంలో బ్రిటిష్‌ పాలకులు ఆ పత్రికను అణచివేసేందుకు యత్నించారని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈడీ ద్వారా అదేపని చేస్తోందని రణదీప్‌ సూర్జేవాలా విమర్శించారు. అదో బోగస్‌ కేసు అని జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు. రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌ కూడా కేంద్ర ం తీరును ఖండించారు. కాగా, విచారణ సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయని, ప్రతిపక్షం తప్పు చేయకపోతే భయపడవద్దని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. తప్పు చేయకపోతే సోనియా, రాహుల్‌ ఎందుకు భయపడుతున్నారని మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘నేరస్థుడు నేను నేరస్థుడినని చెప్పడం ఎప్పుడైనా విన్నారా? నేరం చేయలేదనే చెబుతారు’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.  


ప్రతిపక్షాలపై ఈడీ ఉచ్చు..

రెండు రోజుల క్రితం ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కుమారుడు కార్తీ చిదంబరం, కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌, మహారాష్ట్రలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌, ఆ రాష్ట్ర మంత్రి అనిల్‌, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌, జమ్మూకశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ లపైనా ఈడీ కేసులు సాగుతున్నాయి. 

Updated Date - 2022-06-02T08:14:03+05:30 IST