మార్చి నుంచే మంటలు!

ABN , First Publish Date - 2022-05-02T08:38:49+05:30 IST

ఏటా వేసవిలో ఏప్రిల్‌ చివరి నుంచి మే నెలాఖరు వరకు అధిక ఎండలు, వడగాడ్పులు సాధారణమే! అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా..

మార్చి నుంచే మంటలు!

ఈ వేసవి సీజన్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు

రెండు నెలల్లో నాలుగు దశలుగా వడగాడ్పులు

పశ్చిమ సంక్షోభాల బలహీనతతో తీవ్ర వర్షాభావం

పశ్చిమ అరేబియాలో యాంటీ సైక్లోన్‌తో పెరిగిన వేడి


విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): ఏటా వేసవిలో ఏప్రిల్‌ చివరి నుంచి మే నెలాఖరు వరకు అధిక ఎండలు, వడగాడ్పులు సాధారణమే! అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఎండలు మండిపోయాయి. ఈ రెండు నెలల కాలంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు తీవ్ర వడగాడ్పులతో విలవిల్లాడుతున్నాయి. రాజస్థాన్‌, మహారాష్ట్ర, విదర్భ, తదితర ప్రాంతాల్లో రోజుల తరబడి వడగాడ్పులు వీచాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకు పైబడి నమోదవడంతో ఆయా ప్రాంతాలు అగ్ని గుండంలా మారాయి. సాధారణంగా మార్చిలో శీతాకాలం పోయి ఎండాకాలం ప్రవేశించే వాతావరణ పరిస్థితులు ఉంటాయి. దీంతో ఎండలు మోస్తరుగానే ఉంటాయి. అయితే ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే ఎండ తీవ్రత మొదలైంది. ఇప్పటి వరకూ ఈ ఏడాది నాలుగు దశల్లో అంటే.. మార్చి 11, 27, ఏప్రిల్‌ 17, 24 తేదీల్లో వడగాడ్పులు ప్రారంభమయ్యాయి.


ఈ ఏడాది ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులకు పలు కారణాలున్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తుంటాయి. ఉత్తరాది మీదుగా పయనించే పశ్చిమ సంక్షోభాల ప్రభావంతో జమ్ముకశ్మీర్‌ నుంచి మధ్యప్రదేశ్‌ వరకు, ఒక్కోసారి ఉత్తర కర్ణాటక వరకు వర్షాలు కురుస్తుంటాయి. అలాంటిది ఈ ఏడాది పశ్చిమ సంక్షోభాలు అత్యంత బలహీనంగా ఉండడంతో కేవలం హిమాలయ పర్వత ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రదేశాల్లో తప్ప దేశంలో ఎక్కడా వర్షాలు కురవలేదు. అదే విధంగా గత కొద్ది రోజులుగా అరేబియా సముద్రంలో ఏర్పడిన యాంటీ సైక్లోన్‌ ప్రభావంతో పశ్చిమ భారతం పూర్తిగా పొడిబారింది. దీనికితోడు గతేడాది అక్టోబరు నుంచి కరోనా తగ్గుముఖం పట్టడంతో వాహన రాకపోకలు పెరిగాయి. వీటన్నింటితో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పులకు ఈ ఏడాది పెరిగిన ఎండలు ఒక ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-05-02T08:38:49+05:30 IST