సండే సందడి...

ABN , First Publish Date - 2022-06-27T05:37:03+05:30 IST

తుంబురతీర్థం, గుండాలకోనల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.

సండే సందడి...
గుంజన జలపాతం

తుంబురతీర్థం, గుండాలకోనల్లో పర్యాటకులు 


రైల్వేకోడూరు, జూన్‌ 26: తుంబురతీర్థం, గుండాలకోనల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. కాలినడకన రైల్వేకోడూరు నియోజకవర్గంలోని వై.కోట, బాలిరెడ్డిపల్లె, కె.బుడుగుంటపల్లె తదితర అటవీ మార్గాల ద్వారా పర్యాటకులు అటవీ శాఖాధికారుల అనుమతులతో వెళుతుంటారు. గుండాలకోనకు సమీప అడవుల్లో 500 అడుగుల లోతు కనిపించే గుంజన జలపాతం ఉంది. గుంజననది జలపాతాన్ని నయాగరా జలపాతం అని కూడా ఇక్కడి ప్రాంతీయులు అంటుంటారు. గుండాలకోన ప్రాంతంలో కొట్రాల గుండం, చెంచమ్మ కోన, వాననీళ్లగుట్టలు, కమ్మపెంట, కుందేలుపెంట, ఏనుగులబావి, స్వామివారి పాదాలు ఉన్నాయి. ప్రసిద్ధిగాంచిన శేషాచలం కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లాలంటే ముందుగా రేణిగుంట-అన్నమయ్య జాతీయ రహదారి మీదుగా కుక్కలదొడ్డి గ్రామం నుంచి బాలపల్లె బంగ్లా క్యాంప్‌ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. గుండాల కోన సెలేళ్ల పైభాగాన పసుపు గుండం, గిన్ని గుండం, అక్క దేవతల గుండం ఇలా ఏడు గుండాలు ఉన్నాయి. గుండాలకోన నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో సలీంద్రకోన ఉంది. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతం గుండాలకోనగా ప్రసిద్ధి చెందిందని భక్తులు, పర్యాటకులు చెప్పుకుంటారు. పర్యాటకులు అందరూ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వై.కోట మీదుగా ఆర్టీసీ వారు బస్సులు శివరాత్రి సందర్భంలో నడుపుతారు. ఇక తుంబురతీర్థాలు చాలా ఉన్నాయి. అయితే తిరుమలకు సమీపంలో తుంబుర తీర్థం ప్రముఖమైంది. తుంబురనాథుడు ఇక్కడ తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అందమైన ప్రకృతి జంతువుల ఆవాస ప్రదేశం. తిరుమల పాపవినాశనం నుంచి 7.5 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి సెలవు రోజుల్లో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఇక్కడ ఉన్న తుంబురనాథుడ్ని దర్శించుకుని పూజలు చేస్తారు. కొండలు, వాగులు, గుట్టలు దాటుకుని వెళ్లాల్సి వస్తుంది. రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థంకు వెళ్లవచ్చు. సమీప గ్రామాల ప్రజలు వెళుతుంటారు. దట్టమైన అడవుల్లో తుంబుర తీర్థం ఉంది. ఇక్కడ పర్యాటకులు సందడి చేస్తున్నారు.



Updated Date - 2022-06-27T05:37:03+05:30 IST