హైదరాబాద్‌లో సునెరాటెక్‌ సీడీఏ కేంద్రం

ABN , First Publish Date - 2022-05-17T06:04:06+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన మల్టీ-క్లౌడ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ సునెరాటెక్‌..

హైదరాబాద్‌లో సునెరాటెక్‌ సీడీఏ కేంద్రం

ఏడాదిన్నరలో 1,000 మంది నియామకం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన మల్టీ-క్లౌడ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ సునెరాటెక్‌.. దేశ, విదేశాల్లోని ఖాతాదారులకు మరిన్ని సేవలందించడానికి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంగణంలో కొత్త సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ యాక్సిలరేషన్‌ (సీడీఏ) కేంద్రాన్ని ప్రారంభించింది. కంపెనీకి ఇది మూడో సీడీఏ అవుతుందని, ఇప్పటికే రెండు సీడీఏలు ఉన్నాయని సునెరాటెక్‌ ఎండీ, వ్యవస్థాపకుడు మారెడ్డి సుధీర్‌ తెలిపారు. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి పెద్ద కంపెనీలకు సొంత ఇన్నోవేషన్‌ కేంద్రాలు ఉంటాయి. చిన్న,మధ్య స్థాయి కంపెనీలకు ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకునే స్తోమత ఉండదు. అటువంటి కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీల ప్రయోజనాలను పొందడానికి సునెరాటెక్‌ క్లౌడ్‌ సొల్యూషన్లను అందిస్తోందని చెప్పారు. కొద్ది రోజుల్లోనే సీడీఏలో చిన్న కంపెనీలు ఇన్నోవేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. 

రూ.720 కోట్ల పెట్టుబడులు: దేశ,విదేశాల్లో ఉన్న ఖాతాదారు కంపెనీలకు సృజనాత్మక సొల్యూషన్లను అభివృద్ధి చేయడానికి వాటితో కలిసి 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.720 కోట్లు) పెట్టబడులు పెట్టే యోచన ఉందన్నారు. అంతర్జాతీయంగా సునెరాటెక్‌లో 2,200 మంది పని చేస్తున్నారు. వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో మరో 1,000 మందిని నియమించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో 500 మంది నిపుణులకు విశ్వవిద్యాలయాల నుంచి తీసుకోనున్నట్లు సుధీర్‌ తెలిపారు. వచ్చే మూడేళ్లలో 1,000 కంపెనీలలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 

Updated Date - 2022-05-17T06:04:06+05:30 IST