డీఎంహెచ్‌వో నువ్వా..నేనా!

ABN , First Publish Date - 2021-07-30T04:48:03+05:30 IST

సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో ఎవరు? అంటే ఆ శాఖ సిబ్బందే చెప్పలేని విచిత్ర పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఈ దుస్థితి ఏర్పడింది. ఒకపక్క కరోనా మూడోదశ ముంచుకొస్తున్న నేపథ్యంలో కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారి నియామకం విషయంలో ప్రభుత్వ అశ్రద్ధ విమర్శలకు తావిస్తున్నది. నాలుగు నెలలుగా డీఎంహెచ్‌వో పోస్టుపై అనిశ్చితి నెలకొన్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆ శాఖ ఉద్యోగులే అంటున్నాయి.

డీఎంహెచ్‌వో నువ్వా..నేనా!
సంగారెడిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం

సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి కుర్చీపై నాలుగు నెలలుగా సందిగ్ధత

మొదట గాయత్రీదేవికి ఇన్‌చార్జి బాధ్యతలు 

కొద్ది రోజులకే లక్షణ్‌సింగ్‌ నియామకం

విధుల్లో చేరేందుకు అనుమతించని కలెక్టర్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 29 : సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో ఎవరు? అంటే ఆ శాఖ సిబ్బందే చెప్పలేని విచిత్ర పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఈ దుస్థితి ఏర్పడింది. ఒకపక్క కరోనా మూడోదశ ముంచుకొస్తున్న నేపథ్యంలో కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారి నియామకం విషయంలో ప్రభుత్వ అశ్రద్ధ విమర్శలకు తావిస్తున్నది. నాలుగు నెలలుగా డీఎంహెచ్‌వో పోస్టుపై అనిశ్చితి నెలకొన్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆ శాఖ ఉద్యోగులే అంటున్నాయి. 


ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ గాయత్రీదేవి 

ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా ఉన్న డాక్టర్‌ సునీల్‌కుమార్‌ మార్చి 19న వరంగల్‌ జోనల్‌ మలేరియా అధికారిగా బదిలీ అయ్యారు. ఆయన రిలీవ్‌ కాగానే సంగారెడ్డి మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్‌ గాయత్రీదేవికి ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగిస్తు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరావు ఉత్తర్వులు జారీచేశారు. మార్చి 30 నుంచి ఆమె ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.


పూర్తిస్థాయి అధికారి నియామకంతో వివాదం

పూర్తిస్థాయి డీఎంహెచ్‌వో నియామకం సమయంలో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న గాయత్రీదేవిని కాదని మరొకరికి పోస్టింగ్‌ ఇచ్చారు. డాక్టర్‌ బి.లక్ష్మణ్‌సింగ్‌ను రెగ్యులర్‌ డీఎంహెచ్‌వోగా నియమిస్తూ ఏప్రిల్‌ 3న  ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు విధుల్లో చేరేందుకు సంగారెడ్డికి వచ్చిన డాక్టర్‌ బి.లక్ష్మణ్‌సింగ్‌కు కలెక్టర్‌ హనుమంతరావు అనుమతి ఇవ్వలేదు. అయినా ఆయన రోజూ డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. కలెక్టర్‌ మాత్రం ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న డాక్టర్‌ గాయత్రీదేవినే గుర్తిస్తూ అధికారిక సమావేశాలకు పిలుస్తున్నారు. డీఎంహెచ్‌వోగా నియమితులైన బి.లక్ష్మణ్‌సింగ్‌ నాలుగు నెలలు ఎదురుచూసినా బాధ్యతలు మాత్రం స్వీకరించలేకపోయారు. గతనెలలో ఆయనను బదిలీ చేసినా వెళ్లకుండా సంగారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికే వస్తున్నారు. జీతం రాకపోయినా ఆయన ఇక్కడి నుంచి వెళ్లడానికి సుముఖంగా లేకపోవడం విశేషం.


బదిలీ అయినా ఇక్కడే!

 సంగారెడ్డి డీఎంహెచ్‌వోగా నియమితులైనా బాధ్యతలు చేపట్టని బి.లక్ష్మణ్‌సింగ్‌ను గతనెల 15న నారాయణపేట జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా నియమిస్తూ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరావు మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. అయినా లక్ష్మణ్‌సింగ్‌ నారాయణపేటకు వెళ్లకుండా సంగారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికే వస్తున్నారు. వారంలో రెండు, మూడుసార్లు వచ్చి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తున్నారు. ఏప్రిల్‌లో ఇక్కడ డీఎంహెచ్‌వోగా పోస్టింగ్‌ పొందినప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలుగా లక్ష్మణ్‌సింగ్‌కు వేతనం కూడా రావడం లేదని తెలిసింది. అయినా డైరెక్టర్‌ ఉత్తర్వులను కాదని లక్ష్మణ్‌సింగ్‌ సంగారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి ఎందుకు వస్తున్నారు? అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసేందుకు అనుమతిస్తున్నదెవరు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఇలా ఇద్దరు అధికారులు డీఎంహెచ్‌వో కార్యాలయానికి వస్తున్నా ఎవరూ ఆ సీటులో కూర్చోవడం లేదు. పక్క గదుల్లో కూర్చుని వెళ్తున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సమావేశాలను మాత్రం డాక్టర్‌ గాయత్రీదేవి నిర్వహిస్తుండడం గమనార్హం.

Updated Date - 2021-07-30T04:48:03+05:30 IST