
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఫ్రాంచైజీలన్నీ తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కొత్తగా వచ్చి చేరాయి. దాదాపు అన్ని జట్లు బలంగా కనిపిస్తున్నాయి.
ప్రతీ జట్టులోని మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారు. జట్టు స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేయగల క్రికెటర్లు అన్ని జట్లలోనూ ఉన్నారు. అయితే, ఒక్క జట్టులో మాత్రం అలాంటి ఆటగాళ్లు ఎవరూ లేరని, ఆ జట్టు పోటీలో నిలవడం కష్టమేనని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు మరేదో కాదని, పంజాబ్ కింగ్స్ అని చెప్పకనే చెప్పాడు.
ఈసారి టోర్నీ గెలిచే సత్తా పంజాబ్ కింగ్స్‌కు లేదని ‘స్పోర్ట్స్ తక్’తో మాట్లాడుతూ గవాస్కర్ తేల్చి చెప్పాడు. ఆ జట్టులో ప్రతిభావంతుడైన ఆటగాడు ఉన్నాడని తాను అనుకోవడం లేదన్నాడు. అయితే, ఇది కూడా ఆ జట్టుకు కొంత మేలు చేస్తుందని చెప్పుకొచ్చాడు.
అంచనాలు లేనప్పుడు, ఆ జట్టుపై ఒత్తిడి కూడా ఉండదని, ఒత్తిడి ఉండనప్పుడు ఆటగాళ్లు చాలా స్వేచ్ఛగా ఆడతారని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కొంతమేరకు ఆశ్చర్యపరిచే ప్రదర్శన కూడా చేస్తుందని పేర్కొన్నాడు. అయితే, అంతమాత్రాన ట్రోఫీ గెలిచే అవకాశం లేదని మాత్రం కచ్చితంగా చెప్పగలనన్నాడు.
ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ.. జానీ బెయిర్‌స్టో, కగిసో రబడ, లియామ్ లివింగ్‌స్టోన్, షారూఖ్ ఖాన్ తదితర ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అలాగే, శిఖర్ ధవన్ వంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్ ఉన్నాడు. ఈ సీజన్లో పంజాబ్ జట్టును మయాంక్ అగర్వాల్ నడిపించనున్నాడు.
ఇవి కూడా చదవండి