దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే కరోనా పోతుందా?: సుంకర పద్మశ్రీ

ABN , First Publish Date - 2021-05-09T18:04:53+05:30 IST

కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సుంకర పద్మశ్రీ పూజలు నిర్వహించారు.

దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే కరోనా పోతుందా?: సుంకర పద్మశ్రీ

విజయవాడ: కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ పూజలు నిర్వహించారు. మూడు మతాలకు చెందిన గురువులతో ప్రార్ధనలు చేయించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా రక్కసితో పోరాడి అశువులు బాసిన ప్రతి ఒక్కరి మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే కరోనాకి ఇంతమంది బలైపోతున్నారని, కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా ప్రజలను పక్కదారి పట్టించి ఇంతమంది చావుకు కారణమవుతున్నారని ఆరోపించారు. దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి అని ప్రధాని చెప్పారని.. దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే కరోనా పోతుందా? అని ప్రశ్నించారు.


ముఖ్యమంత్రి జగన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా పోతుందని చెప్పారని సుంకర పద్మశ్రీ అన్నారు. ప్రజల జీవితాలు వెలిగిపోతున్నాయని ప్రధాని చెబుతున్నారని.. వెలిగిపోవడం కాదు.. మోదీ, జగన్ చేసిన పని వల్ల ప్రజల జీవితాలు కరోనా మంటల్లో కాలిపోతున్నాయన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు..ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కరోనా బారి నుంచి ప్రజలను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సుంకర పద్మశ్రీ కోరారు.

Updated Date - 2021-05-09T18:04:53+05:30 IST