ఓ ద్రౌపదీ.. నిన్ను నీవే కాపాడుకో: ప్రియాంక పిలుపు

ABN , First Publish Date - 2021-11-18T02:17:07+05:30 IST

'మహిళలారా మేల్కోండి.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఇందుకు నడుం బిగించండి' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ..

ఓ ద్రౌపదీ.. నిన్ను నీవే కాపాడుకో: ప్రియాంక పిలుపు

చిత్రకూట్: 'మహిళలారా మేల్కోండి.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఇందుకు నడుం బిగించండి' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పిలుపునిచ్చారు. ''ఓ ద్రౌపదీ ఆలకించు. పిడికిలి బిగించు. గోవిందుడు వచ్చే కాలం కాదిది. వార్తాపత్రికల నుంచి న్యాయం జరుగుతుందని ఎంతకాలం వేచిచూస్తావు. ఇప్పటికే అమ్ముడుపోయాయి. దుశ్సాసనుల కోర్టులో మీరెలాంటి న్యాయం ఆశించగలరు?'' అంటూ ప్రియాంక నిలదీశారు.


యూపీలోని మందాకినీ నది ఒడ్డున్న ఉన్న రామ్‌ఘాట్ వద్ద సుమారు 5000 మంది మహిళలతో ప్రియాంక గాంధీ బుధవారంనాడు ముఖాముఖీ జరిపారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు, లాయర్లు, సెల్ఫ్ హెల్చ్ గ్రూప్స్ సభ్యులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇంటా బయటా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా వారిని అడిగి తెలుసుకున్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని ప్రియాంక వారికి భరోసా ఇచ్చారు.


50 శాతం సీట్లలో మహిళలు పోటీ చేయాలి...

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 శాతం టిక్కెట్లు మహిళలకు కేటాయించడం అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. 2024 నాటికి ఉత్తరప్రదేశ్ జనాభాలోని 50 శాతం మహిళలు పోటీలో ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ''మీ భద్రత కోసం మొబైల్, చదువులకు స్కూటీ ఉపయోగపడతాయి. ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. ప్రభుత్వ పోస్టుల్లో మహిళలకు 40 శాతం ప్రొవిజన్ ఉంది'' అని ప్రియాంక అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, లఖింపూర్‌లో రైతులను మంత్రి కుమారుడు కాన్వాయ్‌తో తొక్కించాడని, కానీ ప్రభుత్వం అతనికి సాయంగా నిలిచిందని ఆరోపించారు. ఇదే సమయంలో తమ డిమాండ్ల కోసం అడిగిన ఆశా సిస్టర్లను అధికార యంత్రాంగం చితకబాదిందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం అడిగితే నిరంతరం వంచన, వేధింపులే ఎదురవుతున్నాయని అన్నారు. ''మీ  హక్కుల కోసం మీరు పోరాడండి. ప్రభుత్వం మీకు ఏమీ చేయనప్పడు ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం మీకేముంది?" అని ప్రియాంక సూటిగా ప్రశ్నించారు. దీనికి ముందు, చిత్రకూట్‌లోని ప్రఖ్యాత శివాలయంలో ప్రియంక ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2021-11-18T02:17:07+05:30 IST