సూర్యరశ్మితో కీళ్ళ నొప్పులకు చెక్‌

ABN , First Publish Date - 2020-02-08T18:57:19+05:30 IST

పిల్లలకు ఎండ ముఖం తెలియకుండా పెంచుతున్నామని కొందరు తల్లిదండ్రులు గొప్పగా చెబుతారు. అయితే అలా ఎండ తగలకుండా పెంచడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో అది కీళ్ళ నొప్పులకు, ముఖ్యంగా

సూర్యరశ్మితో కీళ్ళ నొప్పులకు చెక్‌

      పిల్లలకు ఎండ ముఖం తెలియకుండా పెంచుతున్నామని కొందరు తల్లిదండ్రులు గొప్పగా చెబుతారు. అయితే అలా  ఎండ తగలకుండా పెంచడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో అది కీళ్ళ నొప్పులకు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. 

చర్మం కాంతివంతగా ఉండటానికి, ఎముకల పటిష్ఠతకు విటమిన్‌ డి ఎంతో కీలకం. డి విటమిన్‌ మూడు రకాలుగా లభిస్తుంది. పండ్లు, ఆహారం ద్వారా విటమిన్‌ డి సమృద్ధిగా లభిస్తుంది. సప్లిమెంట్లు విటమిన్‌ మాత్రల రూపంలో కూడా దీనిని విటమిన్‌ను పొందే వీలుంది. మూడో విధానంలో ప్రకృతి రూపంలో అంటే సూర్యకిరణాల ద్వారా శరీరానికి విటమిన్‌ డి పుష్కలంగా  లభిస్తుంది. ఎండ ముఖం తెలియకుండా పెంచడం అంటే పిల్లలకు డి విటమిన్‌ ఉచితంగా పొందే అవకాశాన్ని కోల్పోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.


కీళ్ళ నొప్పులు

కొందరు కీళ్ళ జాయింట్లలో ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. ఒకప్పుడు 60 ఏళ్ళు దాటిన వారికే అటువంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు నలభై ఏళ్ళు కూడా రాకుండానే పలువురు ఆ పరిస్థితికి చేరుకుంటున్నారు. మారుతున్న జీవనశైలే ఇందుకు ప్రధాన కారణం. సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు సక్రమంగా లభించడం లేదు. మరోవైపు ఉదయం సూర్యుడు రాకముందే స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు అంటూ ఉరుకులు పరుగులతో వెళ్ళి సూర్యుడు అస్తమించిన తర్వాత తిరిగి ఇళ్ళకు చేరడం. దీంతో శరీరానికి ఎండపొడ తగిలే అవకాశం కూడా ఉండటం లేదు. పర్యవసానంగా దీర్ఘకాలంలో కీళ్ళ నొప్పుల బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.


విటమిన్‌ డి అంటే 

హార్మోన్‌ రూపంలో ఉండే విటమిన్‌ డి అనేది కాల్షియం, పాస్ఫరస్‌ జీవక్రియలో కీలకం. దీనిలో రకాలు ఉన్నాయి. విటమిన్‌ డి3 అంటే జంతువుల ద్వారా లభిస్తుంది. జంతువుల మాంసంతో తయారు చేసే ఆహార ఉత్పత్తులలో డి3 ఉంటుంది. దుడ్డు చేపలు, సముద్ర ఉత్పత్తుల ఆహారం, పుట్టగొడుగులు, గుడ్డులో పసుపు సొనలో ఇది సమృద్ధిగా ఉంటుంది. విటమిన్‌ డి2 అనేది మొక్కల ద్వారా లభిస్తుంది. అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లలో ఇది సమృద్ధిగా ఉంటుంది. అరటి పండులో డి2 విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక అరటి పండులో 0.5 మిల్లీగ్రాముల విటమిన్‌ బీ6, 0.3 మిల్లీగ్రాముల మాంగనీస్‌ కూడా ఉంటుంది. అరటిపండ్లు కొవ్వు, కొలెస్టరాల్‌, సోడియం రహితంగా ఉంటాయి. విటమిన్‌ డి3తో పోలిస్తే విటమిన్‌ డి2 పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆహారం ద్వారా సమకూరే డి విటమిన్‌ తగినంతగా లేనప్పుడు ఆ లోపాన్ని అధిగమించేందుకు సూర్యకిరణాలు తోడ్పడతాయి. 


సూర్య కిరణాలతో సాధ్యమేనా?

విటమిన్‌ డి ని ‘సన్‌షైన్‌ విటమిన్‌’ అని కూడా అంటారు. చర్మానికి ఎండ తగిలేలా కొద్దిసేపు ఉన్నట్లయితే,  సూర్యరశ్మి కొలెస్టరాల్‌ నుంచి విటమిన్‌ డి ని ఉత్పత్తి చేస్తుంది. చర్మకణాల్లో ఉండే కొలెస్టరాల్‌కు సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయొలెట్‌ బి (యూవీబీ) కిరణాలు తగలడం ద్వారా విటమిన్‌ డి సంయోగానికి తోడ్పడుతుంది. సూర్యరశ్మి నుంచి శక్తిని పొందడానికి చర్మంలో ఒక హార్మోన్‌ సహజంగా ఉత్పత్తి అవుతుంది. 


విటమిన్‌ డి లోపిస్తే

చర్మంలో విటమిన్‌ డి ఉత్పత్తికి కారణమయ్యే అణువులు ఉంటాయి. వాటిని సూర్యకిరణాలు ఉత్తేజితం చేస్తాయి. అందువల్ల శరీరానికి ఎండ తగిలేలా కొద్దిసేపు ఉండటం అత్యంత అవసరం. విటమిన్‌ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడటం, కాల్షియం లోపించడం, చర్మ వ్యాధులు, జుట్టు రాలిపోవడం, మెదడు, ఊపిరితిత్తులు, దంతాలు. గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. తరచూ ఆనారోగ్యం, ఇన్‌ఫెక్షన్‌లు రావడం. త్వరగా అలసిపోవడం, ఎముకలు, కీళ్ళలో నొప్పులు, వెన్ను నొప్పి, కుంగుబాటు, గాయాలు త్వరగా మానకపోవడం, పళ్ళు విరగడం, ఊడిపోవడం, జుట్టు రాలడం, కండరాల్లో నొప్పులు వంటివి విటమిన్ డి లోపాన్ని గుర్తించే కొన్ని లక్షణాలు.


సరైన సమయం ఎప్పుడు?

సూర్యరశ్మి ద్వారా అవసరమైనంత డి విటమిన్‌ను ఉత్పత్తిచేసుకోడానికి వీలుగా మన దేహం రూపొందించబడింది. శరీరానికి ఎండ తగిలేలా చూసుకుంటే చాలు. ఒక రోజుకు సరిపడే స్థాయిలో అత్యంత సహజమైన రీతిలో శరీరానికి డి విటమిన్‌ అందుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సూర్యరశ్మి ఏ సమయంలో అయినా ఫర్వాలేదు. కనీసం 40 శాతం శరీరంపై సూర్యకిరణాలు ప్రసరించేలా చూసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం వేళలో సూర్యకిరణాల వల్ల చక్కటి నిద్రతో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. క్యాన్సర్‌ రాకుండా కూడా సూర్యరశ్మి తోడ్పడుతుంది. 


సన్ స్క్రీన్‌ రాసుకున్నా

కొందరు చర్మానికి ముఖ్యంగా ముఖం, కాళ్లు, చేతులకు సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటారు. అలా రాసుకుని ఉన్నా సూర్యరశ్మి వల్ల డి విటమిన్‌ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సన్ స్క్రీన్‌ రాసుకోవడం వల్ల సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన కిరణాల నుంచి రక్షణ ఏర్పడుతుంది. అయితే విటమిన్‌ డి ఉత్పత్తికి ఉపయోగపడే అల్ట్రావయొలెట్‌ బి (యూబీబీ) కిరణాలకు ఆ లోషన్‌ ఆటంకం కల్పించదని నిపుణులు అంటున్నారు. కిటికీ అద్దాల గుండా వచ్చే సూర్యకిరణాలతో చర్మం విటమిన్‌ డీని ఉత్పత్తి చేసుకోజాలదని వారు చెబుతున్నారు. నల్లటి, లేత నీలం, ఆకుపచ్చ రంగు కిటీకీ అద్దాల తయారీలో యూవీబీ కిరణాలను అడ్డుకునే రసాయనాలను వినియోగిస్తారు. అందువల్ల డి విటమిన్‌ సంయోగానికి ఉపయోగపడే యూవీబీ కిరణాలు చర్మానికి తగలవు. అయితే సాధారణ అద్దాల గుండా ప్రసరించే సూర్యకాంతులు మాత్రం డి విటమిన్‌ ఉత్పత్తికి దోహదపడతాయి. 


ఎంతసేపు కూర్చోవాలి?

సహజంగా దేహానికి సరిపడినంతగా విటమిన్‌ డి ని ఉత్పత్తి చేసుకోవాలంటే శరీరానికి నిత్యం సూర్యకిరణాలు తగిలేలా  చూసుకోవాలి. రక్తం స్థాయిలు ఆరోగ్యకరంగా ఉండాలంటే రోజూ మధ్యాహ్నం వేళ 10 నుంచి 30 నిమిషాలపాటు సూర్యకాంతి శరీరంపై పడేలా చూసుకోవాలి. అయితే ఎంత సేపు ఎండలో ఉండాలనేది ఆయా వ్యక్తుల చర్మం సున్నితత్వాన్ని బట్టీ ఆధారపడి ఉంటుంది. చర్మం సున్నితంగా, లేతగా ఉన్నట్లయితే ఎక్కువ సేపు ఎండలో ఉండకూడదు. కొన్ని దేశాల్లో కెనడా, అమెరికా, రష్యా, ఇగ్లాండ్‌, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ తదితర దేశాల్లో చలి, మంచు ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎండ వేడిమి మన దేశంలో కన్నా తక్కువ. దీంతో ఆయా దేశాల ప్రజలు వారాంతంలో సముద్రతీరాలకు వెళతారు. ‘సన్‌ బాత్‌’ (సూర్య స్నానం) పేరిట లోదుస్తులు ధరించి శని, ఆదివారాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీచ్‌లలోనే గడుపుతారు. దీంతో శరీరంలో అధిక భాగానికి నేరుగా సూర్య కిరణాలు సోకుతాయి. డి విటమిన్‌ సమృద్ధిగా లభించడంతో మిగతా వారమంతా మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మన దేశంలో గోవా బీచ్‌ వంటి ప్రాంతాల్లో ‘సన్‌ బాత్‌’ వెసులుబాటు ఉంది.


ఎంత మోతాదులో కావాలి?

ఆరోగ్యంగా ఉన్నవారికి రోజుకు 1,000 ఐయూ (25 మైక్రోగ్రాములు) నుంచి 2,000 ఐయూ (50 మైక్రోగ్రాములు)  విటమిన్‌ డి అవసమవుతుంది. ఇంత మొత్తంలో డి విటమిన్‌ పొందాలంటే ఎటువంటి సన్‌ స్క్రీన్‌ లోషన్లు రాసుకోకుండా రోజుకు 20 నిమిషాల నుంచి 30 నిముషాల చొప్పున వారంలో మూడు రోజులు ఎండలో ఉంటే సరిపోతుంది. దుస్తులు ధరించినా చర్మానికి రవికిరణాలు తగిలితే చాలు, వాటిని సంగ్రహించి తగినంతగా డి విటమిన్‌ను ఉత్పత్తి చేసుకునేలా దేహ నిర్మాణం రూపొందించబడింది. 


సూర్య నమస్కారాలు

మన సంప్రదాయంలో సూర్య నమస్కారాలు ఒక భాగం. ఒక్కో రాశిలో 30 రోజుల చొప్పున మొత్తం 12 రాశుల్లో సూర్య గమనం ఉంటుంది. అందువల్ల సూర్య నమస్కారాలు చేసేటప్పుడు 12 మంత్రాలు చదువుతారు. ఒక్కో రాశికి ఒక్కో ఆసనం వేస్తూ ఒక్కో మంత్రాన్ని పఠిస్తారు. అంటే ద్వాదశ రాశులకు, 12 ఆసనాలు, అదే సంఖ్యలో మంత్రాలు అన్నమాట. ఇలా మంత్రాలను పఠిస్తూ 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలని పెద్దలు చెబుతారు. సూర్యోదయం వేళ ఇలా చేయడం వలన జీర్ణాశయం, గుండె, కీళ్ళు, ఊపిరితిత్తులు, మెడ, వెన్నుకు సంబంధించిన సమస్యలు రావని వందల సంవత్సరాల విశ్వాసం.


ఎండతో జుత్తుకు ఆరోగ్యం 

వాతావరణ కాలుష్యానికి తోడు ఎండలు, వర్షాలు, చలి నుంచి శరీరాన్ని కాపాడేందుకు, మూడు కాలాల్లోనూ చిన్నాపెద్దా తేడాలేకుండా స్త్రీపురుషులందరూ తల నుంచి పాదాల వరకూ దుస్తులు, స్క్వార్ఫ్‌లు, స్వెట్టర్లు, రెయిన్‌కోట్లు ధరించడం సర్వసాధారణంగా మారింది.  ప్రయాణాల్లో హెల్మెట్లు, ఏసీ కార్లు, బస్సుల వినియోగం కూడా పెరిగిపోయింది. దీంతో శరీరంలో ఏ భాగానికీ పొరపాటున కూడా ఎండ తగిలే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే డి విటమిన్‌ లోపం తీవ్రంగా మారుతుంది. ఫలితంగా ఇతర సమస్యలతో పాటు స్త్రీలకు పొడవైన శిరోజాలు తీరని కలగా మారిపోతుంది. పురుషుల్లో బట్టతల, బోడిగుండు సర్వసాధారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డి విటమిన్‌ ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉంచటానికే కాదు శిరోజాల పెరుగుదలకు కూడా తోడ్పడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. కేశాలు కొత్తగా రావడానికి వీలుగా డి విటమిన్‌ కొత్త ఫోలికల్స్‌ (కేశ కూపాలు) సృష్టిస్తాయంటూ స్టెమ్‌ సెల్స్‌ (మూల కణాలు) చికిత్సకు సంబంధించిన జర్నల్‌లో పరిశోధకులు ప్రకటించారు. వీటి ద్వారా కొత్త జుత్తు వస్తుందని ఆ అధ్యయనం వెల్లడించింది. అందువల్ల ప్రయాణంలో ఎలాగూ కుదరదు కాబట్టి మిగతా సమయంలో శరీరానికి, తలకు కూడా తగినంతగా ఎండ తగిలేలా చూసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నిడుమోలు వసుధ


Updated Date - 2020-02-08T18:57:19+05:30 IST