Rajinikanth: టార్గెట్ 2024

Published: Fri, 12 Aug 2022 08:48:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Rajinikanth: టార్గెట్ 2024

- లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ వ్యూహం

- రంగంలోకి పలువురు సినీ ప్రముఖులు

- నేతృత్వం వహించనున్న రజనీ?


వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పలు స్థానాలను సాధించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం రచించిందా?.. అందులో భాగంగానే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గవర్నర్‌తో భేటీ అయి రాజకీయాలపై చర్చించారా?.. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ నుంచి పలువురు ప్రముఖ సినీ నటులు కూడా రంగంలోకి దిగనున్నారా?.. అవుననే అంటున్నాయి ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు. 

                  

 (ఆంధ్రజ్యోతి - చెన్నై)  

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చేందుకు ముచ్చటపడిన రజనీ.. చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అటు బీజేపీతోనూ, ఇటు డీఎంకేతోనూ సన్నిహితంగా వుంటున్నారు. మొదటి నుంచి ప్రధాని మోదీ(Prime Minister Modi)తో పాటు పలువురు సీనియర్‌ బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ నేతలతో సన్నిహితంగా ఉండే రజనీ.. వారితో వివిధ సందర్భాల్లో సమావేశమవుతుండడం సహజమే. అయితే ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్‌’లో పాల్గొనేందుకు వెళ్లిన రజనీ.. అక్కడ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం చెన్నై రాగానే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అవడంతో పాటు ఆయనతో తాను రాజకీయాలపై చర్చించినట్లు మీడియా ముందు బహిరంగంగా ప్రకటించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో పాటు పలు విమర్శలకు దారి తీసింది. రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్‌తో రజనీ రాజకీయాలపై ఎలా చర్చించారంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు, డీపీఐ వంటి పార్టీలు తూర్పారబట్టాయి. అయితే బీజేపీ మాత్రం సూపర్‌స్టార్‌ను వెనుకేసుకొచ్చింది. అయితే ఈ వ్యవహారం సంగెతలాగున్నా.. దీని వెనుక బీజేపీ పెద్ద వ్యూహమే వుందని తెలుస్తోంది. 


గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించడం ఆ పార్టీలో ఉత్సాహం నింపింది. ప్రతిపక్షం బలహీనంగా ఉండడం, అధికార పక్షానికి సరైన ప్రత్యామ్నాయం లేదన్న భావన ప్రజల్లో నెలకొనడం తదితరాల నేపథ్యంలో ఆ శూన్యాన్ని భర్తీ చేయాలని బీజేపీ కేంద్ర పెద్దలు గట్టిగా యోచిస్తున్నారు. రాష్ట్రంలో బలీయంగా ఎదిగేందుకు ఇదే సరైన సమయమని వారు భావిస్తున్నారు. కుమ్ములాటలతో కుదేలవుతున్న అన్నాడీఎంకేను నమ్ముకుంటే లాభం లేదని భావిస్తున్న కమలనాధులు రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు వ్యూహం రచిస్తున్నారు. అందుకే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja)ను రాజ్యసభకు పంపడం, ప్రతి నెలా ప్రధానమంత్రి(Prime Minister) రేడియోలో ప్రసంగించే ‘మన్‌ కీ బాత్‌’లో మాటిమాటికీ తమిళనాడు ప్రస్తావన చేయడం వంటివి చేపడుతున్నారని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. నిజానికి మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై(Annamalai is a former IPS officer) నేతృత్వంలో పార్టీ గతం కంటే గణనీయంగా విస్తరిస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. కేంద్రం పెద్దల ప్రత్యేక దృష్టి, రాష్ట్రస్థాయి నేతల వ్యూహం అమలు తీరు కలగలిపి ఆ పార్టీ పలు నియోజకవర్గాల్లో క్యాడర్‌ను పెంచుకుంటోంది. నిజానికి ఈ వ్యవహారం పట్ల బీజేపీ ఢిల్లీ పెద్దలు సైతం కొంత సంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇదే సమయంలో అభిమానులు అధికంగా ఉన్న సినీ ప్రముఖులను రంగంలోకి దింపితే పార్టీ మరింత దృఢపడుతుందని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. కేవలం గ్లామర్‌నే నమ్ముకోకుండా, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలందుకున్న సినీ ప్రముఖులను బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తుండగా దీనికి రజనీకాంత్‌ నేతృత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన గవర్నర్‌తో భేటీ అనంతరం తాను రాజకీయాల గురించి ఆయనతో చర్చించానంటూ ప్రకటించారని బీజేపీనేతలు చెబుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రజనీని ప్రత్యక్షంగా బరిలోకి దింపకపోయినా, అతడిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు రజనీ కూడా అంగీకరించినట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే ఆదినుంచి రజనీతో సాన్నిహిత్యంగా ఉండే డీఎంకే నేతలు ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరించాలనే తలంపులో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడే విమర్శలు మొదలుపెడితే, తామే ఈ వ్యవహారానికి ఎనలేని ప్రచారం కల్పించినట్లవుతుందన్న భావనతో డీఎంకే నేతలు గుంభనంగా వున్నట్లు తెలుస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.