కస్టమర్ల నుంచి రూ.40 కోట్లు దోచుకున్న సూపర్ మార్కెట్ ఓనర్

ABN , First Publish Date - 2022-02-20T05:38:28+05:30 IST

అతనొక సూపర్ మార్కెట్ ఓనర్. తన వద్ద రోజూ వచ్చే కస్టమర్లను ప్రేమగా పలకరించేవాడు. బిజినెస్ బాగా జరుగుతుండడంతో మరిన్ని సూపర్ మార్కెట్ల బ్రాంచీలు స్థాపించాడు. దీంతో తనకు మరింత డబ్బు అవసరమని తనకు సన్నిహితంగా ఉన్న కస్టమర్లను అప్పు అడిగాడు...

కస్టమర్ల నుంచి రూ.40 కోట్లు దోచుకున్న సూపర్ మార్కెట్ ఓనర్

అతనొక సూపర్ మార్కెట్ ఓనర్. తన వద్ద రోజూ వచ్చే కస్టమర్లను ప్రేమగా పలకరించేవాడు. బిజినెస్ బాగా జరుగుతుండడంతో మరిన్ని సూపర్ మార్కెట్ల బ్రాంచీలు స్థాపించాడు. దీంతో తనకు మరింత డబ్బు అవసరమని తనకు సన్నిహితంగా ఉన్న కస్టమర్లను అప్పు అడిగాడు. 15 శాతం వడ్డీ కలిపి సంవత్సరంలోగా ఇస్తానని స్టాంప్ పేపర్లపై రాసిచ్చాడు. కానీ ఒక లేడీ కస్టమర్ అతని గుట్టు రట్టు చేసింది. 


వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన నూతన్ దాల్ మిల్ ఓనర్ కేతన్ రాంబియా అనే వ్యక్తికి మహానగరంలో కొన్ని సూపర్ మార్కెట్లు ఉన్నాయి. కేతన్ తన సూపర్ మార్కెట్‌కు వచ్చే రెగులర్ కస్టమర్లతో స్నేహంగా ఉండేవాడు. అతని వ్యాపారం బాగా జరుగుతోందని.. మరింత పెట్టుబడితో బిజినెస్‌ని ఇంకా విస్తరించవచ్చునని వారితో చెప్పేవాడు. తనకు పెట్టుబడి కోసం అప్పుగా డబ్బిస్తే 15 శాతం వడ్డీ కలిపి సంవత్సరం లోగా ఇస్తానని తనకు బాగాతెలిసిన కస్టమర్లను కేతన్ చెప్పాడు. 


కేతన్‌ని నమ్మి చాలా మంది కస్టమర్లు అతనికి అధిక మొత్తంలో డబ్బులిచ్చారు. వారందరికీ కేతన్ రూ.100ల స్టాంప్ పేపర్లపై అప్పు తీసుకున్నట్లు అగ్రిమెంటు రాసిచ్చాడు. అలా అతని కస్టమర్లలో ఒకరైన అనీతా రూప్ సింగ్(34) అనే యువతి  కూడా రూ.41.5 లక్షలు ఇచ్చింది. ఒక సంవత్సర కాలం తరువాత ఆమె తన డబ్బు తిరిగివ్వమని కేతన్‌ను అడిగింది. కానీ కేతన్ ఆర్థిక ఇబ్బందుల గురించి చబుతూ.. ఆమెను మరో సంవత్సరం ఆగమని చెప్పాడు. దానికి బదులుగా ఆమెకు వడ్డీ 16 శాతానికి పెంచి ఇస్తానని నమ్మించాడు. దానికి అనీతా అతడి నుంచి కొత్త అగ్రిమెంటు రాయించుకుంది. 


ఇంటికి వెళ్లి అనీతా ఆ స్టాంప్ పేపర్లను జాగ్రత్తగా పరిశీలిస్తుండగా.. ఆ పేపర్లన్నింటిలోనూ ఒకటే సీరియల్ నెంబర్ ఉందని గ్రహించింది. ఇందులో ఏదైనా మోసం ఉందని భావించి తనకు తెలిసిన లాయర్‌ను కలిసింది. ఆమె లాయర్.. కేతన్ ఒక ఫ్రాడ్ అని తెలిపాడు. ఆ తరువాత అనీతా పోలీసులకు కేతన్ ఇచ్చిన స్టాంప్ పేపర్లను చూపించి అతనిపై ఫిర్యాదు చేసింది. 


పోలీసులు కేతన్ రాంబియా‌ను నకిలీ స్టాంప్ పేపర్ల కేసులో అరెస్టు చేసి విచారణ చేశారు. పోలీసుల విచారణలో కేతన్ తన కస్టమర్లందరికీ ఆ నకిలీ స్టాంప్ పేపర్లు ఇచ్చినట్లు తేలింది. దాదాపు కస్టమర్లందరి వద్ద కలిపి రూ.40 కోట్లు తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.


Updated Date - 2022-02-20T05:38:28+05:30 IST