ఇంటింటి ఆరోగ్య పరీక్ష టీంలను పర్యవేక్షించాలి

May 9 2021 @ 00:24AM
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె శశాంక

- కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య పరీక్ష టీంలను ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతి రోజు పర్యవేక్షించాలని కలెక్టర్‌ కె శశాంక ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లతో ఇంటింటి ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రోగ్రాం ఆఫీసర్ల పరిధిలోని మండలాల్లో ఎన్ని టీంలు ఏర్పాటు చేశారు, ఎంతమందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు, ఎంతమందికి హోం ఐసోలేషనన్‌ కిట్స్‌ పంపిణీ చేశారనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు. ఐసోలేషన్‌ మెడికల్‌ కిట్స్‌ ఇచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని వచ్చే సోమవారం ఆరోగ్య కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి పరిశీలించాలని, లక్షణాలు తగ్గకుంటే స్టెరాయిడ్‌ మందులు ఇవ్వాలని సూచించారు. లేకుంటే కరోనా పరీక్షలు నిర్వహించి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని అన్నారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో 60 ఇంటింటి ఆరోగ్య పరీక్షల టీంలను ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు తమ పరిధిలోని మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో  జూమ్‌ సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు. మొదటి డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారందరికీ సరిపోను సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ జిల్లాలో ఉందని కలెక్టర్‌ తెలిపారు. మొదటి డోస్‌ తీసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రెండో డోసు సమయం వరకు తప్పకుండా వ్యాక్సిన్‌ వేస్తామని తెలిపారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పల్స్‌ ఆక్సీ మీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇంటి ఆరోగ్య పరీక్షల టీం సభ్యులకు మాస్కులు, సానిటైజర్లు అందజేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి, జువేరియా, ప్రోగ్రాం ఆఫీసర్లు జిల్లా క్షయ నివారణాధికారి రవీందర్‌ రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి  సాజిదా, రాజశేఖర్‌, రాజగోపాల్‌, రాజేందర్‌, శిరీష పాల్గొన్నారు. 

ఫ ప్రతి కొవిడ్‌ వార్డుకు ఇద్దరు డ్యూటీ డాక్టర్లను నియమించాలి..

జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రతి కొవిడ్‌ వార్డులో ఇద్దరు డాక్టర్లకు రోజు డ్యూటీలు వేయాలని కలెక్టర్‌ కె శశాంక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ వైద్య సేవలపై వైద్యాధికారులు, నోడల్‌ అధికారులతో కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను పర్యవేక్షించడం కోసం ఇద్దరు నోడల్‌ ఆఫీసర్లును నియమించామని తెలిపారు. కొవిడ్‌ వార్డుల్లో ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో ఇద్దరు చొప్పున డాక్టర్లకు డ్యూటీలు వేయాలని సూచించారు. రాత్రి షిఫ్టులో ఒక డాక్టర్‌కు డ్యూటీ చేస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వార్డులలో డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఆసుపత్రికి అదనంగా 50 పడకలు కొనుగోలు చేశామని, వెంటనే వాటిని వార్డుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో మందులకు, ఆక్సిజన్‌కు, డాక్టర్లకు, సిబ్బందికి కొరత లేదని, కొవిడ్‌ రోగులకు ఉత్తమ వైద్య సేవలందించాలని ఆదేశించారు. రోజు డాక్టర్లు పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని వారిలో మనోధైర్యం నింపాలని సూచించారు. సరిపోను మందులను నిల్వ ఉంచుకోవాలని అన్నారు. పారిశుధ్య చర్యలు మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. విధులకు హాజరుకాని డాక్టర్లు, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలన్నారు. కరోనా వార్డుల్లో పల్స్‌ ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు, మొబైల్‌ ఎక్స్‌రే మిషన్‌, ఈసీజీ మిషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా పేషెంట్లకు లిక్విడ్‌ డైట్‌ ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ వినియోగం పెరిగిందని, ఆక్సిజన్‌ వృథా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్సిజన్‌ లీకేజీ ఉంటే వెంటనే అరికట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, ఆర్‌ఎంవో శౌరయ్య, పద్మ, శ్రీనివాస్‌, అలీమ్‌, నోడల్‌ ఆఫీసర్లు మనోజ్‌కుమార్‌, మధుసూదన్‌ పాల్గొన్నారు. 


Follow Us on: