సామాజిక న్యాయాన్ని గెలిపించండి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-01T05:22:00+05:30 IST

భద్రాద్రి రాముడిని సైతం మోసం చేసిన ఘనత ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన రాములుయక్‌కు ఓటువేసి సామాజిక న్యాయాన్ని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.

సామాజిక న్యాయాన్ని గెలిపించండి..  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఖమ్మంలో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భద్రాద్రికి అన్యాయం చేసిన మోదీ, కేసీఆర్‌

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఖమ్మంలో ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమావేశం 

ఖమ్మం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): భద్రాద్రి రాముడిని సైతం మోసం చేసిన ఘనత ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన రాములుయక్‌కు ఓటువేసి సామాజిక న్యాయాన్ని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఖమ్మంలో ఆదివారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి రామాలయానికి చెందిన వేల ఎకరాల భూములు, ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు కట్టబెట్టిందని, దాంతో భద్రాద్రి రాముడికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా భద్రాద్రి ఆలయ అభివృద్ధికి వందకోట్లు కేటాయిస్తామని చెప్పి కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. భద్రాద్రికి అన్యాయం చేసిన బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీటవేసి ఒక ఎస్టీకి, ఒక ఓసీకి టికెట్లు ఇచ్చిందని, టీఆర్‌ఎస్‌, బీజేపీలు మాత్రం అగ్రవర్ణాల అభ్యర్థులకే టికెట్ల ఇచ్చాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెనుకబడిన వర్గాలన్నీ ఏకమై కాంగ్రెస్‌ బలపరిచిన రాములునాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌కు ఓటువేసినా వృధాఅవుతుందన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి పదవి వచ్చిన  తరువాత ఎవరికి కనిపించకుండా తిరిగాడని ఆరోపించారు. ఆయన సీఎం కేసీఆర్‌కు చంచాగిరి చేయడం తప్ప పట్టబద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు టీచర్లు సమస్యలపై ఎక్కడా స్పందించే పరిస్థితి లేదన్నారు. అటువంటి వ్యక్తి శాసనమండలికి వెళ్లడం వల్ల పట్టబద్రులకు జరిగే మేలు ఏమీలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. భద్రాద్రి రాముడిని సైతం మోసంచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు, ప్రధాని మోదీకి దక్కిందన్నారు.   కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాములునాయక్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు జావీద్‌, ఎస్టీఎఫ్‌ నుంచి దేవరకొండ సైదులు, టీటీఎఫ్‌ నుంచి లక్ష్మణ్‌నాయక్‌, టీఎస్‌టీటీఎఫ్‌ రాములునాయక్‌, తదితరులు మాట్లాడారు.  


Updated Date - 2021-03-01T05:22:00+05:30 IST