ltrScrptTheme3

సప్లిమెంట్లు ఎవరికి? ఎప్పుడు?

Jul 27 2021 @ 12:52PM

ఆంధ్రజ్యోతి(27-07-2021)

మొక్కకి పోషకాలు అవసరమే! అలాగని అవసరం లేకపోయినా ఎరువు వేస్తే మొక్క కృశిస్తుంది. అలాంటిదే మన శరీరం కూడా! అవసరం ఉన్నా, లేకపోయినా ‘హెల్త్‌ సప్లిమెంట్లు’ ఎడాపెడా వాడేస్తే ఆరోగ్యం నశిస్తుంది. కాబట్టి వాటిని వైద్యుల సూచన మేరకే వాడుకోవాలి.


కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తగు పరిమాణాల్లో ఉన్న సమతులాహారం తీసుకుంటే శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి. ఇలాంటి ఆహారం తీసుకునే ఆరోగ్యకరమైన వ్యక్తులకు అదనపు పోషకాల అవసరం ఉండదు. కానీ కొంతమంది కాస్త నీరసంగా అనిపించగానే బి కాంప్లెక్స్‌ మింగేస్తూ ఉంటారు. ఇంకొందరు మోకాళ్లు నొప్పి పెడితే, కాల్షియం తక్కువైందేమో అని ఆ సప్లిమెంట్లు వాడేస్తూ ఉంటారు. చర్మం మెరుపు కోసం విటమిన్‌ ఇ క్యాప్స్యూల్స్‌, ఓపిక కోసం ఐరన్‌ టాబ్లెట్లు... ఇలా వైద్యుల ప్రమేయం లేకుండా మెడికల్‌ షాపులో దొరికే హెల్త్‌ సప్లిమెంట్లను విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల మేలుకంటే కీడే ఎక్కువ. 


హెల్త్‌ సప్లిమెంట్లు వీళ్ల కోసం!

పెద్దలు, దీర్ఘకాలం పాటు మంచానికే పరిమితమైనవాళ్లు, కొన్ని రకాల జబ్బుల కారణంగా విటమిన్ల శోషణ శక్తి కోల్పోయిన రోగులు, బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవాళ్లు, కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే ఎంచుకుని తినేవాళ్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, తల్లి పాలు మానేసిన తర్వాత కేవలం పోత పాల మీదే ఆఽధారపడే పిల్లలు... వీళ్లందరికీ అదనంగా విటమిన్లు అందించాల్సిన అవసరం ఉంటుంది. 

ప్రమాదాలూ పొంచి ఉంటాయి

తగు ప్రమాణాల్లో విటమిన్లు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉంటుందో, ఎక్కువ ప్రమాణాల్లో కొన్ని విటమిన్లు తీసుకోవటం వల్ల అంతకంటే రెట్టింపు ప్రమాదమూ ఉంటుంది. మనకు అందే విటమిన్లలో వాటర్‌ సాల్యుబుల్‌, ఫ్యాట్‌ సాల్యుబుల్‌...అనే రెండు రకాలు ఉంటాయి. బీకాంప్లెక్స్‌ (బి1, బి2, బి6, బి12), విటమిన్‌ సిలు నీటిలో కరిగే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకున్నా అవి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి.


ఎ, డి, ఇ, కె విటమిన్లు ఫ్యాట్‌ సాల్యుబుల్‌. ఇవి శరీరంలోని కొవ్వులో చేరి అక్కడే నిల్వ ఉండిపోతాయి. అవసరం లేకపోయినా వీటిని తీసుకుంటే కొంత పరిధి దాటాక శరీరంలో టాక్సిసిటీ (విషపూరితం)ని పెంచుతాయి. ఫ్యాట్‌ సాల్యుబుల్‌ విటమిన్లు అవసరానికి మించి శరీరంలో చేరుకుంటే రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగిపోతాయు. ఈ అదనపు కాల్షియాన్ని పేగులు శోషించుకోలేవు. దాంతో కాల్షియం నిల్వలు మూత్రపిండాల్లో చేరి రాళ్లుగా మారతాయి. 


బీ కాంప్లెక్స్‌: బీ కాంప్లెక్స్‌లో బి 1, బి 2, బి 6, బి 12 అనే రకాలుంటాయి. వైద్యులు సూచించే బి కాంప్లెక్స్‌ పరిమాణం, ఆహారం ద్వారా అందే బి విటమిన్లతో సమానంగా ఉంటుంది. అంటే ఆహారం ద్వారా 50ు బి విటమిన్లు అందితే, మిగతా 50 శాతాన్ని వైద్యులు మందులతో భర్తీ చేస్తారు. కొందరు ప్రత్యేకమైన వ్యక్తులకు నూటికి నూరు శాతం బి కాంప్లెక్స్‌ను మందుల రూపంలోనే వైద్యులు సూచిస్తారు. బీ కాంప్లెక్స్‌ ఎంత వాడాలి? ఎప్పుడు వాడాలి? ఏ పరిస్థితుల్లో వాడాలనేది వైద్యులు నిర్ణయిస్తారు. 


కాల్షియం, విటమిన్‌ డి: మనకు రోజు మొత్తానికి సరిపడా విటమిన్‌ డితో కలిసిన కాల్షియం పరిమాణం 600 నుంచి 800 మైక్రో యూనిట్లు. గర్భిణులు కూడా కాల్షియంను ఇదే పరిమాణంలో తీసుకోవాలి. అయితే మెనోపాజ్‌ దశకు చేరుకుని, 65 ఏళ్లు దాటిన మహిళలకు 800 నుంచి 1000 మైక్రో యూనిట్ల కాల్షియం ఇవ్వాలి. మెనోపాజ్‌ తర్వాత 1200 వరకూ అవసరం పడుతుంది. 


విటమిన్‌ డి: విటమిన్‌ డి కలిపిన ఫార్టిఫైడ్‌ నూనెలు వాడటం వల్ల శరీరానికి సరిపడా విటమిన్‌ డి అందుతుంది. అలాగే సూర్యరశ్మి ద్వారా కూడా మన చర్మంలో విటమిన్‌ డి తయారవుతుంది. కాబట్టి వైద్యులు సూచిస్తే తప్ప ఈ విటమిన్‌ను తీసుకోకూడదు.

యాంటీఆక్సిడెంట్లు: యాంటీఆక్సిడెంట్లు తీసుకుంటే కేన్సర్‌ రిస్క్‌, హృద్రోగాలు తగ్గుతాయనే అపోహలు కూడా ఉన్నాయి. దీన్లో వాస్తవం ఉన్నా అది కొన్ని వర్గాల రోగులకే! తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి వీటి వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అలాగని ఆ తీవ్ర వ్యాధుల నుంచి రక్షణ పొందటం కోసం ప్రతి ఒక్కరూ యాంటీ ఆక్సిడెంట్ల మీద ఆధారపడితే లాభం కంటే నష్టమే ఎక్కువ.

Follow Us on:

Health Latest newsమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.