కదంతొక్కిన కర్షకలోకం

ABN , First Publish Date - 2021-01-22T05:14:04+05:30 IST

‘రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలి’ అనే నినాదంతో కర్షకలోకం పిడికిలి బిగించి ఒంగోలు ప్రధాన రహదారుల్లో గురువారం నినదించింది. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ప్రకాశం జిల్లా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. సంఘమిత్ర ఆస్పత్రి జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీకి అన్నదాతలు ట్రాక్టర్లతో పెద్దఎత్తున తరలివచ్చారు.

కదంతొక్కిన కర్షకలోకం
ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం జరిగిన భారీ ట్రాక్టర్ల ర్యాలీ

ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా

ఒంగోలులో రైతుల భారీ ట్రాక్టర్ల ర్యాలీ

దారిపొడవునా వివిధ సంఘాల సంఘీభావం

ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహణ

ఒంగోలు(జడ్పీ), జనవరి 21: ‘రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలి’ అనే నినాదంతో కర్షకలోకం పిడికిలి బిగించి ఒంగోలు ప్రధాన రహదారుల్లో గురువారం నినదించింది. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ప్రకాశం జిల్లా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. సంఘమిత్ర ఆస్పత్రి జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీకి అన్నదాతలు ట్రాక్టర్లతో పెద్దఎత్తున తరలివచ్చారు. వందలసంఖ్యలో ట్రాక్టర్లతో పాటు పెద్దసంఖ్యలో బైక్‌లతో రైతాంగం కదిలొచ్చింది. వామపక్షాలకుతోడు ప్రజాసంఘాలు సైతం గజ్జెకట్టి కదంతొక్కాయి. ర్యాలీకి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ముఖ్యంగా వివిధ విభాగాల కార్మిక సంఘాలైతే చేతిలో మద్దతు జెండా పట్టుకుని ర్యాలీపై పూలవర్షం కురిపించారు. ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగుతున్న దారిలో రిమ్స్‌ హెల్త్‌వర్కర్స్‌ యూనియన్‌, ఎలక్ట్రిసిటీ యూనియన్‌, ఎల్‌ఐసీ తదితర సంఘాలు కర్షకలోకం చేస్తున్న పోరాటానికి మద్దతును తెలియజేశాయి. అలాగే పలు షాపుల యజమానులు, సామాన్యజనం సైతం సంఘీభావం తెలిపే మహోన్నత దృశ్యానికి వేదికగా ఈ ట్రాక్టర్ల ర్యాలీ నిలిచింది. ర్యాలీ ముందుభాగంలో అంబానీ, అదానీ, మోదీ వేషధారణలో ఉన్న వ్యక్తులు కలిసి ఉన్న దృశ్యాన్ని ప్రదర్శించడం ఆసక్తికరంగా నిలిచింది. సంఘమిత్ర ఆస్పత్రి జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ పీవీఆర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన సభతో ముగిసింది.


రైతుల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నం

ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతుల మధ్య కులమతాల చిచ్చుపెట్టడానికి ప్రయత్నించే దుష్ట పన్నాగానికి కేంద్రం ఒడిగట్టిందని, కానీ రైతుల ఐక్యత ముందు అది పారలేదని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ జాతీయ నాయకులు విజ్జు కృష్ణన్‌ అన్నారు. ర్యాలీ అనంతరం పీవీఆర్‌ గ్రౌండ్‌లో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా కాలంలో కేంద్రం దొడ్డిదారిన ఆర్డినెన్స్‌లు తెచ్చి ఆమోదించుకుని చట్టాలు చేసిందని విమర్శించారు. ఇప్పటికే ఈ పోరాటంలో దాదాపు 145మంది అమరులయ్యారని అయినప్పటికీ రైతులు వెరవని పోరాటం చేస్తున్నారన్నారు. మోసపూరిత విధానాలతో కేంద్రం రైతులను వంచిస్తోందని కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య దుయ్యబట్టారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు మాట్లాడుతూ పేరుకు మాత్రం ప్రభుత్వాలు రైతురాజ్యం అని కబుర్లు చెబుతాయని, ఆచరణలో మాత్రం అన్నదాతలను నిలువునా వంచిస్తున్నాయని  మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు వారిపక్షాన పోరాడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ తెలిపారు. సభ ప్రారంభానికి ముందు ప్రజానాట్యమండలి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, రైతుల అవసరాన్ని, వారి సమస్యలను వివరిస్తూ చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, రైతునాయకులు వడ్డే హనుమారెడ్డి, పమిడి వెంకట్రావు, లలితకుమారి, చుంచు శేషయ్య, కంకణాల ఆంజనేయులు, రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.




Updated Date - 2021-01-22T05:14:04+05:30 IST