మూగ జీవాలకు ఆసరా

ABN , First Publish Date - 2021-05-10T04:55:55+05:30 IST

మూగ జీవాలకు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురైనా వ్యాధి నిర్ధారణ భారంగా మారింది. సకాలంలో సరైన చికిత్స అందక ఎన్నో మూగ జీవాలు మృతి చెందుతున్న దుస్థితి జిల్లాలో నెలకొంటోంది. వాటి అనారోగ్యాన్ని గుర్తించే పశు పోషకులు కొందరు రక్త నమూనాలతో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది.

మూగ జీవాలకు ఆసరా
పార్వతీపురంలో వినియోగంలోకి రానున్న పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల

నియోజకవర్గానికి ఒక వ్యాధి నిర్ధారణ కేంద్రం

సిబ్బంది భర్తీకి సిద్ధమవుతున్న జిల్లా అధికారులు

(కొమరాడ)

మూగ జీవాలకు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురైనా వ్యాధి నిర్ధారణ భారంగా మారింది. సకాలంలో సరైన చికిత్స అందక ఎన్నో మూగ జీవాలు మృతి చెందుతున్న దుస్థితి జిల్లాలో నెలకొంటోంది. వాటి అనారోగ్యాన్ని గుర్తించే పశు పోషకులు కొందరు రక్త నమూనాలతో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించింది. ఆ మేరకు పశు సంవర్ధకశాఖ రంగం సిద్ధం చేస్తోంది. 

మూగ జీవాలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో 2016లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొన్ని నియోజకవర్గాలలో పక్కా భవనాలు కూడా నిర్మాణం చేపట్టింది. కానీ సిబ్బంది నియామకం, ప్రయోగశాలకు అవసరమైన పరికరాల ఏర్పాటును మరిచింది. దీంతో ఆ భవనాలు నిరుపయోగంగా మారాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు ప్రయోగశాలలు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రాలలో పశువులు రోగ నిర్ధారణ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి 9 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 9 మంది అటెండర్లను భర్తీ చేసేందుకు పశు సంవర్ధకశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

తక్షణమే నిర్ధారించేలా..

ప్రయోగశాలల్లో ఆవులు, గొర్రెలు, మేకలు, గేదెలకు వచ్చే పలు వ్యాధులకు తక్షణమే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. పేడ పరీక్ష, యాంటీ బయోటిక్స్‌, పాలు, రక్తం, సీరం వంటి నమూనాలను పరీక్షిస్తారు. జిల్లాలో ఆవులు, ఎద్దులు 3,85,518.. గేదెలు, దున్న పోతులు 1,32,682లు ఉన్నాయి. అలాగే గొర్రెలు 4,23,260, మేకలు 1,73,820 ఉన్నాయి. ఈ ప్రయోగశాలల వల్ల సత్వరమే వైద్యం అందించేందుకు వీలు కలుగుతుంది.

ఎంతో మేలు

ప్రతీ నియోజకవర్గ కేంద్రంలోనూ వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నారు. దీంతో పశు సంరక్షకులకు ఎంతో మేలు జరగనున్నది. పశు పోషణ ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని భావిస్తున్న కుటుంబాలు ఏటా పెరుగుతున్నాయి. మూగ జీవాల సంరక్షణ చర్యల్లో భాగంగా సకాలంలో వ్యాధి నిర్ధారణ జరిగి వైద్యం చేసేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.

- బి.చక్రధర్‌, పశు సంవర్ధకశాఖ ఉప సంచాలకులు, పార్వతీపురం



Updated Date - 2021-05-10T04:55:55+05:30 IST