అన్నదాతకు ఆసరా

ABN , First Publish Date - 2021-05-09T03:30:34+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి.

అన్నదాతకు ఆసరా
ధాన్యం బస్తాలతో వచ్చిన ట్రాక్టర్లు

వెల్దండ, మే 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధర కల్పిస్తుండడం అన్నదాతలకు ఊరటనిస్తున్నది. పంట పండించడం ఒక ఎతైతే, అమ్ముకోవడానికి గతంలో ఆపసోపాలు పడాల్సి వచ్చేది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రబీ సీజన్‌లో మండలంలో బోర్లు, బావుల ద్వారా వరిసాగు పెరిగింది. మండలంలో రబీ సీజన్‌లో 4375 ఎకరాలలో వరిసాగు చేశారు. ప్రతి ఎకరాకు సుమారుగా 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో మండలంలో వెల్దండ, చెదురుపల్లి గ్రామాలలో సింగిల్‌విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధాన్యానికి మద్దతు ధరగా 17 శాతం ఉంటే క్వింటాలుకు 1888 రూపాయలు చెల్లిస్తున్నారు. సింగిల్‌విండో కేంద్రంగా ఈ సీజన్‌లో సుమారు లక్ష బస్తాల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకోగా, గత వారం రోజులుగా ఇప్పటికే ఐదువేల బస్తాల ధాన్యాన్ని సేకరించారు. సకాలంలో ధాన్యం తీసుకు వచ్చేందుకు కేంద్రాల ద్వారా బస్తాలు సమకూరుస్తున్నారు. అంతేగాక రైతులకు వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


వేధిస్తున్న హమాలీల కొరత 

ధాన్యం సంచులలో నింపేందుకు హమాలీల కొరత వేధిస్తున్నది. రెండు కేంద్రాలకు 20 మంది వరకు హమాలీలు అవసరం ఉండగా కేవలం సగం మంది మాత్రమే ఉన్నారు. దీంతో రైతులు కొంతవరకు ఇబ్బందులకు గురవుతున్నారు. 



Updated Date - 2021-05-09T03:30:34+05:30 IST