వ్యక్తిపూజ కాదు, విలువలకు మద్దతు

ABN , First Publish Date - 2020-11-25T06:07:07+05:30 IST

‘వ్యక్తిపూజలో విరసం’ శీర్షికన పి. విక్టర్ విజయ్‌కుమార్ రాసిన వ్యాసంలో (తేదీ: 13.11.2020) వరవరరావు (వివి)ను లక్ష్యంగా చేసుకున్నారు...

వ్యక్తిపూజ కాదు, విలువలకు మద్దతు

వరవరరావు పుట్టిన రోజున దాన్ని ఒక సందర్భంగా తీసుకుని చాలామంది ఆయన ప్రాపంచిక దృక్పథాన్ని, ఆయన ప్రాతినిధ్య విలువలను నెమరువేసుకున్నారు. ఒకవేళ వ్యాస్తకర్త ఉద్దేశం ప్రకారం ఇది ఫ్యూడల్ సంప్రదాయమైతే, దాన్ని ఆచరణీయ ఫ్యూడల్ సంప్రదాయమని నేనంటాను.


‘వ్యక్తిపూజలో విరసం’ శీర్షికన పి. విక్టర్ విజయ్‌కుమార్ రాసిన వ్యాసంలో (తేదీ: 13.11.2020) వరవరరావు (వివి)ను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు అతని స్వంత వ్యక్తిత్వం, గుణగణాలు, అభిరుచులు, ప్రవర్తనా శైలి గురించి మాట్లాడుకోవాలి. వివి అక్రమ నిర్బంధం తర్వాత దాన్ని నిరసిస్తూ అంతర్జాతీయ హక్కుల సంఘాలు, సాహితీవేత్తలు, మేధావులు ప్రకటనలు చేశారు. వీరిలో ఎవ్వరూ ఆయన వ్యక్తిగత గుణాలను పొగుడుతూ మద్దతు పలకలేదు. చాలామంది ఆయనను చూసి కూడా ఉండరు. వాళ్లందరూ వివి ప్రాతినిధ్య విలువలకు మద్దతు పలికారు. ఒక వ్యక్తి సమస్త పీడిత మానవాళి సమానత్వాన్ని కోరుతూ మాట్లాడినప్పుడు వాటిని వ్యక్తీకరించిన వ్యక్తి గురించి కూడా ప్రస్తావన రావటం సహజం. అదే వ్యక్తి పూజ అయితే, విక్టర్ విజయ్ కుమార్ చేస్తోంది ఒకరకంగా సాంస్కృతిక దాడే!


నూతన ప్రజాస్వామిక విప్లవం వివి ఆకాంక్ష. ఆయన ఆలోచనతో ప్రభావితుడై నూతన ప్రజాస్వామిక విప్లవం గురించి ఎమ్‌ఎస్‌ఆర్ తన పరీక్ష పేపర్లో రాసాడంటే అది ఆ పిల్లవాడి చైతన్యాన్ని తెలియజేస్తుంది. తను నమ్మిన మార్గం సామాజిక మార్పుకు దోహదపడుతుందని, తాను ఎంచుకున్న వినూత్న పద్ధతి ద్వారా దాని గురించి కొంతమందైనా చర్చించుకుంటారని అలా చేసి ఉండొచ్చు. దీన్ని ‘పిల్లచేష్ట’గా అభివర్ణించటం విక్టర్ విజయ్‌కుమార్ అవగాహనలోని అపరిపక్వతను సూచిస్తుంది. ఎమ్‌ఎస్‌ఆర్‌ని ప్రభావితం చేసింది వి.వి. ఒక్కరే అని ఎవరైనా ఎక్కడైనా అంటే ఆధారాలు చూపించాలి. ఒక్కటి నిజం. వివి మాత్రం అలాంటి వేలమందిని ప్రభావితం చేశారు. అది ఆయన వృత్తి, ప్రవృత్తి కూడా. 


వరవరరావు పుట్టిన రోజున దాన్ని ఒక సందర్భంగా తీసుకుని చాలామంది ఆయన ప్రాపంచిక దృక్పథాన్ని, ఆయన ప్రాతినిధ్య విలువలను నెమరువేసుకున్నారు. ఒకవేళ వ్యాస్తకర్త ఉద్దేశం ప్రకారం ఇది ఫ్యూడల్ సంప్రదాయమైతే, దాన్ని ఆచరణీయ ఫ్యూడల్ సంప్రదాయమని నేనంటాను. మార్క్స్, లెనిన్, మావోతో సమానంగా నేను అభిమానించే అంబేడ్కర్ జన్మదినోత్సవాలను జరుపుకున్నప్పుడు వారి చారిత్రక ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకుంటాం. దాన్ని ఫ్యూడల్ సంస్కృతి అంటే తప్పే కదా! వివిని అభిమానించడం అంటే ఆయన నమ్మిన మార్క్సిస్టు, లెనినిస్టు ఆలోచనా విలువలను అభిమానించటం అని అర్థం. 


విక్టర్ విజయ్ కుమార్ అన్నట్టే విప్లవం ఒక ఆకాంక్ష. అది నిరంతర సత్యాన్వేషణలో ఉంటుంది. దాని ప్రకారమే రష్యాలో, చైనాలో జరిగిన పరిణామాలు ఆ సత్యాన్వేషణలో భాగంగానే అర్థం చేసుకోవాలి. అయినా నా అభిప్రాయం ప్రకారం వివికి రష్యాగాని, చైనాగాని, మరి ఏ ఇతర సోషలిస్టు కమ్యూనిస్టు దేశాలుగాని విప్లవ కేంద్రాలు కావు. ఆయనకు మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం, చారుమజుందారు మార్గం తాత్త్విక పునాదులు. పలు అసందర్భ వాక్యాలతో వ్యాసకర్త ఎవరి కొమ్ముకాస్తున్నాడో అన్న మీమాంస అనవసరం. ఈ సందర్భంలో రాజ్యహింసకు బలవుతున్న వివి లాంటి అభిప్రాయాలు కలిగిన ప్రతి వ్యక్తికి మద్దతు పలుకుదాం. వారి విడుదల కోసం ఏకమవుదాం. 

ఎం. వెంకన్న

ఉపాధ్యక్షుడు, అఖిల భారత ప్రజాన్యాయవాదుల సంఘం

Updated Date - 2020-11-25T06:07:07+05:30 IST